
పెద్దల జేబుల్లోకి పిల్లల నిధులు
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఆరోగ్యవంతంగా ఉండాలన్న ఉద్దేశంతో జవహర్ బాల ఆరోగ్య రక్ష పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2010లో అమల్లోకి తెచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఆరోగ్యవంతంగా ఉండాలన్న ఉద్దేశంతో జవహర్ బాల ఆరోగ్య రక్ష పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2010లో అమల్లోకి తెచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ప్రభుత్వ పాఠశాలకు ప్రతి గురువారం సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది వెళ్లి విద్యార్థులకు వైద్య పరీక్షలు చేయాలి. అంతేకాకుండా ప్రతి పీహెచ్‌సీ వైద్యాధికారి తన పరిధిలోని అన్ని పాఠశాలల విద్యార్థులకు సంవత్సరంలో రెండు పర్యాయాలు నేరుగా వైద్య పరీక్షలు చేయాలి. ఏ విద్యార్థికైనా ఆరోగ్యం బాగోలేకపోతే సమీపంలో ఆస్పత్రులకు రిఫర్ చేయాలి. ఈ క్రమంలో విద్యార్థులను పాఠశాల నుంచి ఆస్పత్రి తీసుకెళ్లేందుకు అయ్యే చార్జీలు, భోజనం కోసం జవహార్ బాల ఆరోగ్య రక్ష కింద విడుదల నిధులను ఖర్చు పెట్టాలి. ఇదంతా సామాజిక ఆరోగ్య పౌష్టికాహార కేంద్ర సముదాయం(సీహెచ్‌ఎన్‌సీ) ఆధ్వర్యంలో జరగాలి. ఈ క్లస్టర్ పరిధిలోని మండలాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులందరికీ రిఫర్ చేసే సమయంలో అయ్యే ఖర్చులన్నీ భరించాలి.
ఈ కార్యక్రమం అంతటినీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కనుసన్నల్లో జవహర్ బాల ఆరోగ్య రక్ష కోఆర్డినేటర్ పర్యవేక్షించాలి. కానీ జిల్లాలో ఈ విధంగా జరగడం లేదు. ప్రతి వారం వైద్య సిబ్బందితో తనిఖీలు గానీ, ఆరు నెలలకొకసారి పాఠశాల విద్యార్థులకు వైద్య పరీక్షలు గానీ సక్రమంగా జరపడం లేదు. తూతూమంత్రంగా చేసి చేతులు దులుపేసుకుంటున్నారు. విడుదలైన నిధులను మాత్రం పక్కదారి పట్టిస్తున్నారు. 2013-14 సంవత్సరానికి గాను ఎస్.కోట సీహెచ్‌ఎన్‌సీకి రూ.79 వేలు, గజపతినగరానికి రూ.52 వేలు, భోగాపురానికి రూ.52 వేలు, బొబ్బిలికి రూ.52 వేలు, బాడంగికి రూ.31 వేలు, నెల్లిమర్ల సీహెచ్‌ఎన్‌సీకి రూ.62 వేలు మంజూరయ్యాయి. ఎక్కడా విద్యార్థులకు పరీక్షలు చేసి, అనారోగ్యం ఉన్న విద్యార్థులను గుర్తించిన దాఖలాలు లేవు. ఆయాసీహెచ్‌ఎన్‌సీలు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. దాదాపు విడుదలైన నిధులన్నీ నిరుపయోగంగా ఉండిపోయాయి.
వాటిపై జిల్లా స్థాయి అధికారుల దృష్టి పడింది. ఖర్చు పెట్టకుండా ఉన్న నిధులన్నీ వెనక్కి ఇచ్చేయాలని సీహెచ్‌ఎన్‌సీ అధికారులను మౌఖికంగా ఆదేశించారు. దీనికి సీహెచ్‌ఎన్‌సీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. విడుదలైన నిధులను నేరుగా ఇవ్వలేమని, ఖర్చు కాని కారణంగా తమకు ఏ ఖాతా నుంచి వచ్చాయో ఆ ఖాతాకే జమ చేస్తామని చెప్పుకొచ్చారు. కానీ, జిల్లా స్థాయి అధికారులు వినిపించుకోలేదు. జిల్లా వ్యాప్తంగా తామే ఖర్చు పెడతామని, నిధులిచ్చేయాల్సిందేనని ఒత్తిడి చేశారు. దీంతో సీహెచ్‌ఎన్‌సీ అధికారులు తలొగ్గక తప్పలేదు. జిల్లా అధికారులు చెప్పినట్టుగా వినకపోతే ఇబ్బందులొస్తాయన్న ఉద్దేశంతో తమకు విడుదలైన నిధులను నేరుగా అందజేసేశారు.
ఇంకేముంది చేతికొచ్చిన నిధులను ఒక్క నెలలోనే ఖర్చు చేసేసినట్టు జిల్లా స్థాయి అధికారులు చూపించేశారు. దీంతో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికైతే, ఆ నిధులను సీహెచ్‌ఎన్‌సీ అధికారులు తప్ప మిగతా వారు ఖర్చు చేసే అవకాశం లేదు. ఒక వేళ నిధులు మిగిలిపోతే అదే ఖాతాలో వేసి సరండర్ చేసేయాలి. విడుదలైన నిధులను ఏడాది పొడవునా ఖర్చు పెట్టాలే తప్ప ఒక్క నెలలో వెచ్చించడం సరికాదు. ఇందుకు భిన్నంగా జిల్లాలో ఖర్చవడంతో సందేహాలు నెలకొన్నాయి. దాదాపు పక్కదారి పట్టాయన్న అభిప్రాయమే వ్యక్తమవుతోంది. ఇదే విషయమై జవహర్ బాల ఆరోగ్య రక్ష జిల్లా కో ఆర్డినేటర్ సుబ్రహ్మణ్యంను ‘సాక్షి’ వివరణ కోరగా సీహెచ్‌ఎన్‌సీల నుంచి నిధులు వెనక్కి తీసుకోవడం వాస్తవమేనన్నారు. కాకపోతే, వాటిని తాము యూనిఫాంగా ఖర్చు పెట్టేశామని చెప్పారు.