
సుజనాచౌదరిపై పత్రికల్లో వచ్చిన వార్తలు చూడలేదు: జేపీ
హైదరాబాద్: టైటానియం కుంభకోణంలో పాత్ర కలిగిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారి ఆస్తులు జప్తు చేయాలని లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... టైటానియం ఖనిజ వనరుల కేటాయింపు విషయంలో కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు 18.5 మిలియన్ డాలర్ల బేరసారాలు జరిపారని పత్రికల్లో వచ్చిన వార్తలు చదివినట్లు చెప్పారు. కేవీపీతో పాటు మరికొందరిపై దర్యాప్తు సంస్థలు వేగంగా విచారణ చేపట్టాలని కోరారు.
కేవీపీపై పత్రికల్లో వచ్చిన వార్తలు చదివినట్లు చెప్పిన జేపీ... చంద్రబాబు ఆత్మబంధువులా వ్యవహరించే సుజనాచౌదరిపై న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పును పత్రికల్లో చదవలేదన్నారు. మారిషస్ బ్యాంక్‌కు దాదాపు రూ.102 కోట్లు కుచ్చుపోటీ పెట్టిన కేసులో కోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించిన వార్తలు తాను చదివే పత్రికల్లో రాలేదని జేపీ చెప్పారు.