ఆ గొంతు మీదని తేలితే రాజీనామాకు సిద్ధమా? | Jayaprakash Narayan savals chandra babu naidu | Sakshi
Sakshi News home page

ఆ గొంతు మీదని తేలితే రాజీనామాకు సిద్ధమా?

Published Wed, Jun 10 2015 2:34 AM | Last Updated on Sat, Jul 28 2018 6:48 PM

ఆ గొంతు మీదని తేలితే రాజీనామాకు సిద్ధమా? - Sakshi

ఆ గొంతు మీదని తేలితే రాజీనామాకు సిద్ధమా?

సీఎం చంద్రబాబుకు లోక్‌సత్తా అధినేత జేపీ సవాలు
తెలుగునాట డబ్బు రాజకీయాలు మీ చలవే
మీ స్వార్థం కోసం ప్రజల్ని రెచ్చగొట్టొద్దు
హజారే వారసుడినన్నారుగా... మరి ఆ ప్రమాణాలు పాటిస్తారా?
లోక్‌పాల్ పర్యవేక్షణలో ఈ కేసును సీబీఐతో విచారించాలి
రేవంత్.. మీకు చెప్పకుండా ఆ పనిచేస్తే ఎందుకు ఉపేక్షించారు?


సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే ఓటు కొనుగోలు వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు తన వ్యక్తిగత బాధను అందరి బాధగా చిత్రీకరించి ప్రజల్ని రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్నారని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ దుయ్యబట్టారు. పార్టీ  కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ వంక చెప్పి చంద్రబాబు ఈ కేసును పక్కదారి పట్టించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగా? రికార్డింగా? స్టింగ్ ఆపరేషనా? మరొకటా..? అనేది కోర్టు తేల్చాలన్నారు.

‘చంద్రబాబూ, ఆ గొంతు మీదే అయితే రాజీనామాకు సిద్ధమా’ అంటూ జేపీ సవాలు విసిరారు. ‘గుంటూరు సభలో నాకేమన్నా అయితే లేవండి.. లేవండి’ అంటూ ప్రజల్ని పదే పదే రెచ్చగొట్టేందుకు యత్నించారు. ఇప్పటికే ప్రాంతీయ విద్వేషాలతో నలిగిపోతున్న ప్రజలకు నచ్చజెప్పాలే తప్ప, రెచ్చగొట్టే యత్నం సరైన నేతల లక్షణం కాదు’ అంటూ తూర్పారపట్టారు. రాష్ట్రం దివాలా స్థితిలో ఉందని పదే పదే చెబుతున్న మీరు నిజంగా అలా ఉంటే ఓ ఎమ్మెల్యే ఓటుకి రూ. 5 కోట్లు ఎలా ఇవ్వగలుగుతున్నారని నిలదీశారు. తెలుగునాట డబ్బు రాజకీయాల్ని తెచ్చింది చంద్రబాబేనని చెప్పారు.

పోలీసులు, చట్టం తమ గుప్పెట్లో ఉందనే ధోరణిలో చెబుతూ అధికారం రాజరికంతో సమానమనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 15 ఏళ్లల్లో ఎన్నడూలేనిరీతిలో దివంగత సీఎం ఎన్టీఆర్ ప్రస్తావనను నిన్ననే ఎందుకు తెచ్చారని సూటిగా ప్రశ్నించారు. ఎన్టీఆర్ తీరుకు, ప్రమాణాలకు, చంద్రబాబు తీరుకు, ప్రమాణాలకు చాలా వ్యత్యాసముందన్నారు. అన్నా హజారేకి వారసుడినని  చెప్పుకునే చంద్రబాబు ఆ ప్రమాణాల్ని పాటిస్తారా? అని ప్రశ్నించారు. ఈ కేసును లోక్‌పాల్ పర్యవేక్షణలో సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు పలు ప్రశ్నలను సంధిస్తూ... వాటికి సూటిగా జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.
 
మీ పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఓటు కొనుగోలుకు ప్రయత్నించాడా.. లేదా? మీ అనుమతి, ప్రేరణ లేకుండా పార్టీకి ఒక ఎమ్మెల్సీని ఇవ్వడం కోసం ఒక్క ఓటుకి రూ. 5 కోట్లు ఆ ఎమ్మెల్యే ఇస్తారా?
మీకు తెలియకుండా మీ ఎమ్మెల్యే కొనుగోలు చేసి ఉంటే మరి ఎందుకు ఆయనపై చర్య తీసుకోలేదు? మీ అనుమతి లేకుండా అంత డబ్బుని ఇచ్చినా, పార్టీ భవిష్యత్‌ను దెబ్బతీసినా ఎందుకు చర్య తీసుకోలేదు?
కొన్నాళ్ల కిత్రం బంగారు లక్ష్మణ్ వంటి మంచి మనిషి ఒక జాతీయ పార్టీ కోసం లక్ష రూపాయలు చెక్కు లేకుండా విరాళం తీసుకున్నందుకు ఆ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అలాంటిది రూ. 5 కోట్లు ఇస్తే చర్య తీసుకోకుండా ఎలా ఉంటారు? రాజకీయమంటే ఇలాగే ఉంటుందంటారా?
మీ ఆడియో టేపు.. అది ఫోన్ ట్యాపింగా, రికార్డింగా, స్ట్రింగా కాదా అనేది కోర్టులు తేలుస్తాయి. గొంతు నాది కాదు.. వేర్వేరు చోట్ల మాట్లాడిన మాటల్ని అతికించారు అని చెప్పిస్తున్నారు. ఒక క్రిమినల్ కేసులో శిక్ష వేసేందుకు వాటిని కోర్టులు పరిశీలిస్తాయి. క్రిమినల్‌కు పాటించే ప్రమాణాల స్థాయికి మిమ్మల్ని మీరు దిగజార్చుకుంటున్నారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement