ఇది రాజకీయ నాయకత్వమా... రాక్షసత్వమా?
విభజన సమస్య శాసనసభలో మాత్రమే కాదని, రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలో ఉందని లోక్సత్తా పార్టీ ఎమ్మెల్యే జయప్రకాశ్ నారాయణ పేర్కొన్నారు. రాష్ట్ర విభజన పేరుతో కులం, మతం, ప్రాంతాల వారిగా ఓట్లు రాజకీయం చేయడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.... విభజనపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై ఆయన మండిపడ్డారు.
ఇది రాజకీయ నాయకత్వమా... లేక రాక్షసత్వమా అని కేంద్రాన్ని జయప్రకాశ్ నారాయణ ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఏ ఒక్క అంశంపైన కూడా రాష్ట్ర మంత్రి వర్గం సమిష్టిగా నిర్ణయాలు తీసుకున్న దాఖల లేదన్నారు. మంత్రివర్గంలోని మంత్రులే ఒకరిపై ఒకరు పరుష పదజాలంతో నిందించుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాజ్యాంగ ఖననం జరగుతుంది. ఢిల్లీలో జరిగిన రాజకీయ మార్పు ఆంధ్రప్రదేశ్ లో కూడా సంభవిస్తుందని ఆయన జోస్యం చెప్పారు. ప్రజలల్లో ఆగ్రహం పెల్లుబికి ప్రభుత్వం కుప్పకూలే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు.