
జయేంద్ర సరస్వతికి అస్వస్థత
నెల్లూరు, న్యూస్‌లైన్: కంచి కామకోటి పీఠాధిపతి, జగద్గురు జయేంద్ర సరస్వతి స్వామి(79) అస్వస్థతకు గురయ్యారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆదివారం ఉదయం నెల్లూరు వచ్చిన ఆయన సాయంత్రం జొన్నవాడ కామాక్షితాయి ఆలయానికి వెళ్తూ దారి మధ్యలో వాహనంలోనే స్పృహకోల్పోయారు. ఆయనను నెల్లూరులోని జయభారత్ ఆస్పత్రికి తరలించారు. తర్వాత దగ్గర్లోని డయాగ్నోస్టిక్స్ సెంటర్‌లో సీటీ, ఎంఆర్‌ఐ స్కాన్ పరీక్షలు నిర్వహించి మళ్లీ ఆస్పత్రికి తెచ్చి ఈసీజీ పరీక్ష చేశారు. స్వామీజీ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళనపడాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. షుగర్ లెవల్స్ తగ్గడంతో సృహకోల్పోయారన్నారు.
స్వామీజీకి చికిత్స కోసం చెన్నై నుంచి ప్రముఖ న్యూరాలజిస్ట్ కల్యాణ్‌రామన్ బయల్దేరారని తెలిపారు. నెల్లూరులోని శంకరమఠంలో కొత్తగా నిర్మించిన చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట కోసం జయేంద్ర సర స్వతి వచ్చారు. ఆయన అస్వస్థత విషయాన్ని టీవీల ద్వారా తెలుసుకున్న భక్తులు ఆందోళనకు గురయ్యారు. పలువురు జయభారత్ ఆస్పత్రికి చేరుకున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ఆస్పత్రికి వచ్చి వైద్యులతో మాట్లాడారు.