ఉదయపూర్: రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో కలుషిత ఆహారం కలకలం రేపింది. ఒక వివాహ వేడుకకు హాజరైన అతిథులు అక్కడ వడ్డించిన విందులో పాల్గొన్నాక అనారోగ్యానికి గురయ్యారు. ఆహారం తింటున్న సమయంలోనే కొందరు వాంతులు చేసుకుని, స్పృహ తప్పి పడిపోయారు.
విందు భోజనం వికటించిన ఘటన ఉదయ్‌పూర్‌లో చర్చనీయాంశంగా మారింది. అనారోగ్యంపాలైనవారంతా ఆస్పత్రికి పరుగులు తీశారు. మరికొంతమంది బాధితులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. బాధితులను పరీక్షించేందుకు ఆస్పత్రిలో తగినంతమంది వైద్యులు లేకపోవడంతో ఇతర ఆస్పత్రుల నుండి వైద్యులను పిలిపించారు. బాధితులు కడుపు నొప్పితో తల్లడిల్లిపోతుండటాన్ని చూసిన వైద్యసిబ్బంది వెంటనే వారికి ప్రథమచికిత్స అందించారు. దీంతో పలువురి ఆరోగ్యం కాస్త కుదుటపడింది.
సమాచారం అదుకున్న పోలీసులు ఆ పెళ్లిలో వండిన ఆహార నమూనాలను పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపారు. బాధితుల్లో 15 ఏళ్ల బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మొత్తం 200 మంది బాధితుల్లో ఎక్కువ మంది మహిళలు, పిల్లలే ఉన్నారు. ప్రత్యేక వార్డులో 57 మందికి చికిత్స అందిస్తున్నారు. కొందరు బాధితులకు మందులు ఇచ్చి ఇంటికి పంపించారు. నలుగురు చిన్నారులు చికిత్స పొందుతున్నవారిలో ఉన్నారు.
ఉదయపూర్‌లోని ధన్ మండిలోని ఓస్వాల్ భవన్‌లో సామూహిక వివాహ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా 600 మందికి విందు ఏర్పాటు చేశారు. ఉదయపూర్‌తో పాటు వివిధ జిల్లాల నుండి కూడా జనం ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. ఆహారం తిన్న తర్వాత వందలమంది అస్వస్థతకు గురయ్యారు. కార్యక్రమ నిర్వాహకులు అంబులెన్స్‌కు ఫోన్ చేసి బాధితులను ఎంబీ ఆస్పత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: ‘ప్రయాణికులకు విజ్ఞప్తి.. రైలు నంబరు 13228.. 72 గంటలు లేటుగా ..’
Comments
Please login to add a commentAdd a comment