సాక్షి ప్రతినిధి, అనంతపురం : కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి ఏకంగా ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీని వేలెత్తి చూపుతూ చేసిన విమర్శలు సంచలనం రేపాయి. సోనియా నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ సర్వ నాశనమైపోయిందని వ్యాఖ్యానించిన జేసీ.. ఆ పదవి నుంచి ఆమె తప్పుకుని యువకులకు అప్పగిస్తే మంచిదని సలహా ఇచ్చారు. పనిలో పనిగా రాహుల్‌గాంధీ కూడా పార్టీని సమర్థవంతంగా నడిపించలేరని స్పష్టీకరించడం సంచలనం కలిగించింది. కాంగ్రెస్ అధిష్టానంపై జేసీ దివాకర్‌రెడ్డి వ్యూహాత్మకంగానే విమర్శలు చేశారని అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.
టీడీపీలో చేరడానికే జేసీ దివాకర్‌రెడ్డి అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి రఘువీరా వర్గీయులు విమర్శిస్తుండగా.. కిరణ్ సారథ్యంలో ఏర్పాటయ్యే పార్టీలో చేరడానికే ఆ రకమైన వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయం రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. కానీ.. జేసీ దివాకర్‌రెడ్డి మాత్రం ఆ వ్యాఖ్యలను కొట్టిపారేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తనను బహిష్కరిస్తే ఆహ్వానిస్తానని పేర్కొనడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ జన్మదినం రోజునే ఆమెపై ఆ పార్టీ శ్రేణులు తిరుగుబాటు బావుటా ఎగురవేశాయి. సోమవారం ఉదయం ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో సోనియాగాంధీ జన్మదిన వేడుకల్లో వడ్డే గోపాల్ అనే కార్యకర్త బర్త్‌డే కాదు.. డెత్‌డే చేయాలంటూ నినదించారు. సాయంత్రం కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డి అందుకున్నారు. తాడిపత్రిలో సోమవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్టానంపై నిప్పులు చెరిగారు.
నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో వెల్లడైన ఫలితాలే దేశ వ్యాప్తంగా జరగనున్న సాధారణ ఎన్నికల్లో పునరావృతమవుతాయని ఉద్ఘాటించారు. సోనియా లేకపోతే కాంగ్రెస్ పార్టీ నడవదనే పరిస్థితి ఇప్పుడు లేదని పేర్కొన్నారు. ఏఐసీసీ అధ్యక్ష పదవి నుంచి ఆమె తప్పుకుని యువకులకు అవకాశం ఇస్తే పార్టీకి ప్రయోజనం ఉంటుందని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో తాడిపత్రి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేయనని, రాజకీయ సన్యాసం చేస్తానని గతంలో ఆయన పరోక్షంగా వెల్లడించారు. కాంగ్రెస్ అధిష్టానం రాయల తెలంగాణ ఆలోచన చేస్తోందని విశ్వసించిన జేసీ.. ఆ దిశగా మద్దతు కూడగట్టేందుకు అనంతపురంలో రెండు సార్లు సభలు నిర్వహించారు. ఆ సమయంలో సోనియాగాంధీని దేవత అంటూ జేసీ దివాకర్‌రెడ్డి ప్రశంసించారు. ఈ నేపథ్యంలో పది జిల్లాలతో కూడిన తెలంగాణకే కేంద్ర కేబినెట్ మొగ్గుచూపింది. దీనిపై సీమాంధ్ర ప్రజానీకం భగ్గుమంది. సీమాంధ్రలో కాంగ్రెస్ కథ ముగిసిందని ఆ పార్టీ సీనియర్ నేతలు పలువురు వ్యాఖ్యానించారు.
ఈ క్రమంలోనే రాజకీయంగా నిలదొక్కుకునేందుకు జేసీ ఇలాంటి వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. జేసీ దివాకర్‌రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్‌రెడ్డి అనంతపురం లోక్‌సభ నుంచి, జేసీ కుమారుడు పవన్‌కుమార్‌రెడ్డి తాడిపత్రి శాసనసభ స్థానం నుంచి టీడీపీ నుంచి పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నారనీ.. ఆ క్రమంలోనే అధిష్టానంపై జేసీ విమర్శలు చేశారని రఘువీరా వర్గంలో కీలక పాత్ర పోషిస్తోన్న మాజీ ఎమ్మెల్సీ విప్ వై.శివరామిరెడ్డి వ్యాఖ్యానించారు. జేసీ కుటుంబాన్ని టీడీపీలో చేర్చుకుంటే పార్టీని వీడటానికి కూడా వెనుకాడబోమని సీనియర్ ఎమ్మెల్యే పరిటాల సునీత, మాజీ ఎంపీ కాలవ శ్రీనివాసులు స్పష్టీకరించిన విషయం విదితమే.
పరిటాల సునీత, కాలవ ఒత్తిళ్లకు తలొగ్గిన చంద్రబాబు టీడీపీలోకి చేర్చుకోకపోతే.. కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో ఏర్పాటయ్యే పార్టీలో చేరడానికి జేసీ ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయం కాంగ్రెస్ పార్టీలోని మరొక వర్గం వ్యాఖ్యానిస్తోంది. అధినేత్రిని విమర్శిస్తే తనపై బహిష్కరణ వేటు పడుతుందని అప్పుడు సానుభూతిని కూడగట్టుకోవడంతోపాటూ పార్టీ మారడానికి మార్గం సుగమం అవుతుందని ఆయన భావిస్తున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
వ్యూహమా.. అవకాశవాదమా..!
Published Tue, Dec 10 2013 6:37 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
Advertisement