జీసీసీలో బియ్యం పక్కదారి?
- 7.6 టన్నుల బియ్యం రానేలేదు
- అలమటిస్తున్న గిరిజనులు
గూడెంకొత్తవీధి, న్యూస్‌లైన్ : గూడెంకొత్తవీధి గిరిజన సహకార సంస్థలో మరో అక్రమం బయటపడింది. ఏడాది క్రితం రూ.71 లక్షల జీసీసీ సొమ్ము పక్కదారి పట్టిన విషయం జనం మరచిపోకముందే మరో అవినీతి వెలుగు చూసింది. ఈసారి ఏకంగా 7.60 టన్నుల బియ్యం పక్కదారి పట్టాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జీసీసీ సంస్థ ఆయా గ్రామాల్లోని డిపోలకు బియ్యం, ఇతర నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తుంది. జీకేవీధిలో బ్రాంచి,గొడౌన్ ఏర్పాటు చేసి 26 ముఖ్య డిపోలు, 12 సబ్ డిపోల ద్వారా కార్డుదారులకు సరుకులు ఇస్తున్నారు.
ఈ 36 డిపోలకు గత ఏప్రిల్ నెలకు సంబంధించి 3,30,600 కిలోల బియ్యం సరఫరా చేయాల్సి ఉంది. ఐతే ఏప్రిల్, మే నెలల్లో రావలసిన బియ్యం లో 7.60 టన్నుల సరుకును అధికారులు సరఫరా చేయనే లేదు. దీంతో జీసీసీ అధికారులు వీటిని పక్కదారి పట్టించారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు ఈ రెండు నెలలకు సంబంధించి పౌరసరఫరాల శాఖ నుంచి స్టాకు తక్కువగా వస్తోందని జీసీ సీ సిబ్బంది చెబుతున్నారు. అయితే తమ తప్పును కప్పి పుచ్చుకునేందుకు జీసీసీ అధికారులు ఈ భారాన్ని సేల్స్‌మెన్‌పై వేస్తున్నారు. అన్ని డిపోలకు రెండేసి బస్తాలు తగ్గించి పంపుతున్నారు. దీంతో ఆ మేరకు గిరిజనులకు కోటాలో కోతపడుతోంది.
జీసీసీ అధికారుల జాడ ఎక్కడ?
గూడెంకొత్తవీధి గిరిజన సహకార సంస్థలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా పూర్తిస్థాయి బ్రాంచి మేనేజర్ లేకపోవడంతో అధికారులు విధులకు తరచు డుమ్మా కొడుతున్నారు. రెండు నెలల క్రితం కొయ్యూరు జీసీసీ బ్రాంచి మేనేజర్‌గా ధర్మజ్ఞానంను జీకేవీధికి ఇన్‌చార్జి మేనేజరుగా నియమించారు.
అయితే రెండు మండలాల బాధ్యతలు చూసుకోవడంలో ఇక్కడ పూర్తిస్థాయిలో కార్యకలాపాలపై దృష్టి సారించలేకపోతున్నారు. ఇక గోదాము విషయానికి వస్తే సూపరింటెండెంట్ చింతపల్లిలోనే మకాం వేసి, ఓ సహాయకుని ద్వారా వ్యవహారం నడిపిస్తున్నారు. బుధవారం విలేకరుల బృందం జీసీసీ బ్రాంచి కార్యాలయానికి వెళ్లగా బ్రాంచి కార్యాలయంలో తాత్కాలిక కంప్యూటర్ ఆపరేటర్ మాత్రమే ఉన్నారు.
ఫిర్యాదు చేస్తే చర్యలు తప్పవు
గూడెంకొత్తవీధి బ్రాంచి పరిధిలో జరిగే అక్రమాలపై ఆ సంస్థ పాడేరు డివిజనల్ మేనేజర్ ప్రతాప్‌రెడ్డిని వివరణ కోరగా ఈ సంఘటనపై తనకు సమాచారం లేదన్నారు. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే బాధ్యులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని చెప్పారు.