
పవన్ పట్టుదలతో ఉన్నారు: జనసేన
హైదరాబాద్: దీర్ఘకాలిక లక్ష్యాల కోసం పనిచేస్తామని పవన్ కళ్యాణ్ 'జనసేన' పార్టీ ప్రకటించుకుంది. యువ రాజకీయ నాయకులను తయారు చేయాలన్న పట్టుదలతో పవన్ కళ్యాణ్ ఉన్నారని జనసేన ఒక ప్రకటనలో తెలిపింది. సరికొత్త రాజకీయం సృష్టించేందుకు పవన్ సిద్ధపడ్డారని స్పష్టం చేసింది. అట్టడుగు వర్గాల నుంచి నాయకులను తీసుకురావాలని పవన్ భావిస్తున్నారని వెల్లడించింది.
స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్ డే, రెండు రాష్ట్రాల అవరణ దినోత్సవాలను మాత్రమే సెలవు దినాలుగా ప్రకటిస్తామని పేర్కొంది. జాతీయ సమగ్రతకు ఉపయోగపడే రోజులు సెలవుదినాలుగా ఉండాలని పవన్ భావిస్తున్నారని తెలిపింది. అన్ని మతాలు, పండుగల పట్ల ఆయనకు గౌరవం ఉందని పేర్కొంది. పార్టీని దృఢంగా ముందుకు తీసుకెళ్లాలని పవన్ యోచిస్తున్నారని, రాజకీయ సామాజిక మార్పు లక్ష్యంగా వేలాది మందిని జనసేనలో చేర్చుకుంటామని తెలిపింది. కార్యకర్తలందరికీ శిక్షణనిచ్చి సామాజిక సైన్యంగా తయారుచేస్తామని వెల్లడించింది.
కాగా, పవన్ కళ్యాణ్ తన రెండో సభను విశాఖపట్టణంలో నిర్వహించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈనెల 25 లేదా 27న విశాఖలో పవన్ కళ్యాణ్ సభ ఉంటుందని అంటున్నారు. మరోవైపు పవన్తో పొత్తుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.