ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో జాబ్‌మేళా!
480 ఉద్యోగాల కోసం తరలివచ్చిన నిరుద్యోగులు
తెలుగుదేశం కార్యకర్తల కోసం లోకేష్ మంత్రాంగం
హైదరాబాద్: మెరికల్లాంటి విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు సాఫ్ట్‌వేర్ కంపెనీలతో పాటు ఫార్మా, బీపీవో తదితర కంపెనీలు క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహించడం పరిపాటి. కానీ ప్రస్తుతం రాజకీయ పార్టీ క్యాంపస్‌లూ ఆఫ్ క్యాంపస్ రిక్రూట్‌మెంట్లకు వేదికలవుతున్నాయి. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో నారాలోకేష్ నేతృత్వంలో శనివారం ఏడు జాతీయ స్థాయి కంపెనీలు 480 ఉద్యోగాల కోసం జాబ్‌మేళా నిర్వహించాయి. తద్వారా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరుల కుటుంబాలకు చెందిన పిల్లలను ట్రస్ట్‌భవన్ నుంచే కంపెనీల్లోకి పంపించే ఏర్పాట్లు చేశారు.
హెటెరోడ్రగ్స్, అమెజాన్, గ్లోబల్ ఇన్నోవా, ఏగిస్ కంపెనీలు వంద చొప్పున ఉద్యోగాలకు మేళా నిర్వహించగా, సాగర్స్ లాబరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్(20), బిగ్-సి(10), ఎం మోడల్స్(50) ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించాయి. ఉద్యోగ ప్రకటనలేవీ ఇవ్వకుండా టీడీపీ కార్యాలయంలోనే జాబ్‌మేళాలు నిర్వహించడం వల్ల పార్టీకి సంబంధించిన వారికే తప్ప సాధారణ నిరుద్యోగులకు ప్రయోజనం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.