డబ్బిస్తేనే... జాబు | jobs recruitment fraud in vizianagaram district | Sakshi
Sakshi News home page

డబ్బిస్తేనే... జాబు

Published Sun, Jun 11 2017 7:10 PM | Last Updated on Tue, Sep 5 2017 1:22 PM

డబ్బిస్తేనే... జాబు

డబ్బిస్తేనే... జాబు

ఔట్‌సోర్సింగ్‌ నియామకాలకు కొత్త భాష్యం
ఆగని అధికార పార్టీ నాయకుల వసూళ్ల పర్వం
హౌసింగ్‌ వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల అమ్మకాలు
నేతల సిఫార్సుతోనే ఏజెన్సీల ద్వారా నియామకం
విజయనగరం జిల్లాలో పోస్టుల భర్తీపై రచ్చ రచ్చ


పోస్టులొస్తే అమ్మేసుకుంటున్నారు... పనులొస్తే పంచేసుకుంటున్నారు... పథకాలొస్తే పక్కదారి పట్టించేస్తున్నారు... నిధులొస్తే వాటాలకు సిద్ధమైపోతున్నారు... ఇదీ గడచిన మూడేళ్లుగా జిల్లాలో సాగుతున్న పాలకపక్ష నేతల దందా. నిజాయితీ... నిప్పు... అంటూ గొప్పలు చెప్పుకుని జనాన్ని తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తున్నా... క్షేత్ర స్థాయిలో జరుగుతున్న అవినీతిని కప్పిపుచ్చలేకపోతున్నారు. పత్రికలకు ఎక్కకుండా ఉండలేకపోతున్నారు. మొన్నటివరకూ అంగన్‌వాడీ, సబ్‌ స్టేషన్‌ షిప్ట్‌ ఆపరేటర్లు, కేజీబీవీ, వెటర్నరీ పోస్టులే అనుకుంటే తాజాగా హౌసింగ్‌ వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు ఆ జాబితాలో చేరాయి. ఔట్‌సోర్సింగ్‌ద్వారా నియమించే ఈ పోస్టుకు ఒక్కోదానికి లక్షా యాభైవేల వరకూ వసూలు చేస్తున్నారంట!

సాక్షి ప్రతినిధి, విజయనగరం: జిల్లాలో భర్తీ కానున్న ఔట్‌ సోర్సింగ్‌ వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు పెద్ద ఎత్తున పైరవీలు జరుగుతున్నాయి. నియోజకవర్గానికి ఎనిమిది చొప్పున కేటాయించాల్సిన పోస్టులు అంగడి సరుకులా అమ్ముడైపోతున్నాయి. నాడు గుంటూరు ఏజెన్సీ పేరుతో వసూళ్లు చేపట్టగా, నేడు జిల్లాకు చెందిన సంస్థ పేరుతోనే కలెక్షన్‌ పర్వం కొనసాగుతోంది. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో జరుగుతున్న నియామకాలపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో పోస్టుకు రూ. లక్ష నుంచి లక్షా యాభై వేల వరకు డిమాండ్‌ చేస్తున్నట్టు తెలిసింది. హౌసింగ్‌ శాఖలో తొలుత ఔట్‌ సోర్సింగ్‌ వర్క్‌ ఇన్‌స్పెక్టర్ల వ్యవస్థ ఉండేది. టీడీపీ అధికారంలోకి వచ్చాక కొత్తగా ఇళ్లు ఇవ్వకపోవడంతో పనిలేదని చెప్పి చాలామందిని తొలగించింది. తాజాగా  కేంద్రప్రభుత్వ నిధులతో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించడంతో వాటి పర్యవేక్షణకు వర్క్‌ ఇన్‌స్పెక్టర్ల నియామకానికి చర్యలు తీసుకుంది. గత నవంబర్‌లో ప్రభుత్వ స్థాయిలో పైరవీలు చేసుకున్న గుంటూరుకు చెందిన ఏజెన్సీకి నియామకాల బాధ్యత అప్పగించింది.

75 పోస్టులకు నాడు బేరసారాలు  
జిల్లాలో 75 వర్క్‌ ఇన్‌స్పెక్టర్లను తీసుకోవాలని నిర్ణయించి... ఐటీఐ సివిల్, డిప్లమో ఇన్‌ సివిల్, బీటెక్‌ సివిల్‌ అర్హతలున్నవారు దరఖాస్తు చేసుకోవాలని గత నవంబర్‌ 20వ తేదీన ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. స్థానిక నేతలతో సంప్రదింపులు చేసుకున్న ఆ సంస్థ నాకింత... మీకింత దోరణితో ఒప్పం దాలు చేసుకుని నియోజకవర్గాల వారీగా పంపకాలు చేసింది. పోస్టుకు రూ. లక్ష నుంచి లక్షన్నర చొప్పున రేటు పెట్టి భర్తీ చేసేందుకు తెరలేపారు. నిబంధనల మేరకైతే వచ్చిన దరఖాస్తుల్లో మెరిట్‌ ప్రకారం ఎంపిక చేసి, హౌసింగ్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌కు పంపించాలి. ఆ జాబితాకు కలెక్టర్‌ ఆమోదముద్ర వేయాలి. కానీ, అందుకు భిన్నంగా జరిగింది.

మళ్లీ అమ్మకాలకు లేచిన తెర
నాలుగు నెలలుగా స్తబ్దుగా ఉన్న ఔట్‌ సోర్సింగ్‌ పోస్టుల నియామకాలకు మళ్లీ తెరలేచింది. ఈసారి గుంటూరు ఏజెన్సీకి కాకుండా జిల్లాకు చెందిన ఓ ఏజెన్సీకి కట్టబెట్టారు. ఇప్పుడా ఏజెన్సీ పేరుతో పోస్టుల అమ్మకాలు సాగిపోతున్నాయి. ఇప్పటికే కొన్ని అమ్మేశారు. తాజాగా 35 పోస్టులను భర్తీ చేసేసినట్టు తెలిసింది. రూ. లక్షా 50వేలు చొప్పున ఈ సారి వసూలు చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. మిగతా 40పోస్టులను భర్తీ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ పోస్టులను నియోజకవర్గాల వారీగా నేతలకు కేటాయించారు. వారి పేరుతో ఇప్పుడా పోస్టులకు పైరవీలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. కొన్నిచోట్ల ఎమ్మెల్యేలు చేతివాటం ప్రదర్శిస్తున్నారని తెలిసింది.

ఇదిలా ఉండగా, కొన్ని నియోజకవర్గాల్లో స్థానిక నేత లు చెప్పిన వారికి కాకుండా పదవుల్లో ఉన్న వారికి కట్టబెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా చీపురుపల్లి నియోజకవర్గంలో ఓ వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టును బొబ్బిలికి చెందిన నేత సిఫార్సు మేరకు భర్తీ చేసినట్టు తెలిసింది. ఇప్పుడిది పార్టీలో చిచ్చు రేగింది. తమకు తెలియకుండా, తమ సిఫార్సు లేకుండా వేరొ క ప్రాంతానికి చెందిన వారిని, వేరొకరు చేసిన సిఫార్సు మేరకు ఎలా భర్తీ చేస్తారంటూ అక్కడి నేతలు గుర్రుగా ఉన్నట్టు తెలిసింది. ఏదేమైనప్పటికీ అంగన్‌వాడీ, షిప్ట్‌ ఆపరేటర్లు, కేజీబీవీ, వెటర్నరీ పోస్టుల మాదిరిగానే వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు పోస్టులు కూడా నేతల జేబులు నింపుతున్నాయన్నది స్పష్టమవుతోంది. ఇదే విషయమై వివరణ కోసం హౌసింగ్‌ పీడీ రమణమూర్తికోసం ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరు.

వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’
జరిగిన పంపకాలు, చేపడుతున్న వసూళ్లపై డిసెంబర్‌ 13వ తేదీన ‘సాక్షి’లో ప్రత్యేక కథనం ప్రచురితమయ్యింది. ఔట్‌ సోర్సింగ్‌ పోస్టులు అమ్ముడైపోతున్నాయని, ఏజెన్సీయే సూత్రధారి అని, నేతలే వసూళ్లకు పాల్పడుతున్నారని బయట ప్రపంచానికి తెలియజేసింది.వసూళ్ల బాగోతం కాస్తా బట్టబయలవ్వడంతో ఉన్నతాధికారులు అప్రమత్తమై అప్పట్లో నియామకాలు నిలిపేశారు. లోపాయికారీగా జరిగిన ఒప్పందాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement