
విభజనపై చట్టసభల్లో చర్చ జరగాలి : జెపి
హైదరాబాద్: రాష్ట్ర విభజనపై చట్టసభల్లో చర్చ జరగాలని లోక్సత్తా నేత జయప్రకాశ్ నారాయణ్ అన్నారు. రాష్ట్ర పరిస్థితులపై ఆయన ప్రెస్‌మీట్లో మాట్లాడారు. రాగద్వేషాలకు అతీతంగా అందరికి ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాలన్నారు. అసెంబ్లీని వెంటనే సమావేశ పరచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సంక్షోభంపై సమగ్రంగా చర్చ జరగాలన్నారు.
కేంద్రప్రభుత్వం రాష్ట్ర విభజన సమస్యను తమ సొంత పార్టీ వ్యవహారంలా చేస్తున్నదని విమర్శించారు. రాష్ట్ర సమస్యల పరిష్కారానికి కేంద్రప్రభుత్వ కమిటీ లేదా సంయుక్త పార్లమెంటరి కమిటీ వేయాలని కోరారు. కేంద్రప్రభుత్వం ఓటు బ్యాంక్ రాజకీయాలు ప్రక్కన పెట్టి దేశ సమగ్రతకు కృషి చేయాలన్నారు. ఇరుప్రాంతాల మధ్య, ప్రజల మధ్య ఏర్పడిన విభేదాలను తొలగించాడానికే తెలుగు తేజం యాత్రను త్వరలోనే కొనసాగిస్తానని చెప్పారు.