చోడవరం, న్యూస్‌లైన్: నడినెత్తిన భానుడు మండిస్తున్నా సమైక్య పోరాట స్ఫూర్తి అవధుల్లేని ఉత్సాహాన్నిచ్చింది... ప్రభుత్వ అనుచిత నిర్ణయం ఆవేదన కలిగిస్తున్నా ఉద్యమ దీక్ష ఉత్తేజాన్ని ఇనుమడింపజేసింది. కష్టాలు వేధిస్తున్నా, సమస్యలు బాధిస్తున్నా సమరోత్సాహం ప్రజానీకాన్ని పురోగమింపజేసింది. చోడవరంలో బుధవారం జరిగిన లక్ష గళ గర్జన సభలో ఈ ఆవేశం అడుగడుగునా కనిపించింది. జనం అణువణువునా సమైక్యభావం ఉప్పొంగిపోయింది. ప్రతి గొంతులో సమర నినాదం మార్మోగిపోయింది. వేలాది మంది చేసిన సింహనాదంతో చోడవరం పట్టణం హోరెత్తింది.
ఉద్యమంతో మమేకం
ఎండ మండిపోతున్న లెక్క చేయకుండా కార్మికులు, కర్షకులు, రైతు కూలీలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు సమైక్య ఉద్యమానికి అండగా కదిలారు. సభ లో పాల్గొనడానికి మేమంటేమేమని ముందుకొచ్చారు. విద్యార్థులు, కళాకారులు రకరకాల సాం స్కృతిక ప్రదర్శనలతో ఉద్యమావేశాన్ని రగిలిం చారు. చేతుల్లో సమైక్య జెండాలు రెపరెపలాడుతూ ఉంటే అంతా హైస్కూల్ మైదానానికి తర లి వచ్చారు. మేళ తాళాలతో, ఎడ్ల బళ్ల ర్యాలీలతో, ప్లకార్డుల ప్రదర్శనలతో సమైక్య దీక్షను చాటిచెప్పారు. సభావేదికకు వచ్చే దారులన్నీ జనసమూహంతో నిండిపోగా, స్టేడియంలో జనం కిటకిటలాడారు.
విజ్ఞాన్, చలపతి, రవి, ఆడమ్స్, మహతి, ఉషోదయ, రవీంద్రభారతి, ఫోర్ ఎస్, గాయత్రి, తదితర పాఠశాలలు, కళాశాల విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. జన చైతన్య మండలి జజ్జనకరి జనారే నృత్య గీతాలాపన సమైక్య వాదులను రంజింపచేసింది. ‘ అమ్మా సోనియమ్మా.. మా ఇండియాకు వచ్చిన ఇటలీ బొమ్మా..’ అనే జానపదగీతం అందరినీ ఉర్రూతలూగించింది. ఇటీవలి కాలంలో ఎప్పుడూ లేని విధంగా ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు మించినా, గొంతు తడారి పోతున్నా ఉత్సాహం ఆద్యంతం కొనసాగింది. మధ్యాహ్నం రెండు గంటలు దాటినా గ్రౌండులో జనం కదలకుండా నిలబడి సమైక్యాంధ్రకు సమర్ధనగా నినదిస్తూ ఉంటే ఆ దీక్ష అద్వితీయమనిపించింది.
జన ప్రవాహం : సభకు చోడవరం నుంచి, పరిసర మండలాల నుంచి ప్రజానీకం వాహనాలపైన, పాదయాత్రలతో కెరటాల్లా తరలివచ్చారు. అడుగడుగునా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలకు హృదయ పూర్వకంగా స్పందించారు. రైతులు, కూలీలు పొలం పనులను మానుకుని ఉద్యమ సభకు హాజరయ్యారు.
ఉవ్వెత్తున గర్జన
Published Thu, Sep 26 2013 1:43 AM | Last Updated on Fri, Sep 1 2017 11:02 PM
Advertisement