= న్యాయశాఖ పరిశీలనకు ఫైలు
= సీఎం హామీ అమలయ్యేనా
= సమైక్య సమ్మెలో పాల్గొన్న ఉపాధ్యాయుల్లో ఆందోళన
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర కోసం సమ్మె చేసిన ఉపాధ్యాయులను ప్రభుత్వం చిక్కుల్లో పడవేసే ధోరణిలో వ్యవహరిస్తోందనే ఆరోపణలు వినవస్తున్నాయి. సమ్మె కాలానికి వేతనం చెల్లించే విషయంలో అనేక కొర్రీలు పెడుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమం జరిగిన సమయంలో అక్కడి ఉపాధ్యాయుంతా ఒకేరోజు సమ్మెలోకి వచ్చి, ఒకేరోజు సమ్మె విరమించటంతో 151 జీవో ప్రకారం ప్రభుత్వం వారికి వేతనాలు చెల్లించింది.
సీమాంధ్రలో ఉపాధ్యాయులు విడతల వారీగా సమ్మెలో పాల్గొనటంతో ఏ ప్రాతిపదికన వేతనాలు చెల్లించాలనే అంశంపై విద్యాశాఖ డెరైక్టర్ న్యాయశాఖకు లేఖ రాసినట్లు సమాచారం. ముఖ్యమంత్రి, ఉపాధ్యాయ జేఏసీ నాయకుల మధ్య జరిగిన సమావేశంలో సమ్మె కాలంలో కోల్పోయిన పని దినాలను భర్తీ చేస్తామనే ఒప్పందం జరిగినట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు.
జీవో విడుదలయ్యేవరకూ ఆగాల్సిందే!
సమైక్యాంధ్రకు మద్దతుగా ఆగస్టు 22 నుంచి అక్టోబరు 10 వరకు ఉపాధ్యాయులు సమ్మెలో పాల్గొన్నారు. వీరిలో మూడొంతుల మంది సమ్మెలో పాల్గొనగా ఒక వంతు పాఠశాలలకు హాజరయ్యారు. ఆగస్టు 22 నుంచి అక్టోబరు 10 వరకు సమ్మె జరపగా సెలవు దినాలు పోను పనిదినాలు 33 రోజులుగా ఉన్నాయి. ఆయా రోజులకు గాను ప్రభుత్వం వేతనాలు చెల్లించేందుకు ప్రత్యేక జీవోను విడుదల చేయాల్సి ఉంది. ఈ జీవో విడుదలకు న్యాయశాఖ అనుమతి కావాల్సి ఉండటంతో ఇప్పట్లో ఉపాధ్యాయుల వేతనాలు చెల్లించేందుకు ఉత్తర్వులు జారీ కావనే భయం ఉపాధ్యాయులను వెంటాడుతోంది.
దీనికి కారణం లేకపోలేదు. ఆగస్టు 22 నుంచి కొంతమంది, ఆగస్టు 27 నుంచి మరికొందరు, సెప్టెంబరు 3 నుంచి అలాగే 11 నుంచి ఇంకొందరు ఉపాధ్యాయులు సమ్మెలోకి వచ్చి అక్టోబరు 10 వరకు ఉద్యమంలో కొనసాగారు. వీరిలో కొంతమంది అక్టోబరు ఒకటో తేదీనే సమ్మెబాట వీడి విధులకు హాజరయ్యారు. ఇలా విడతలవారీగా ఉపాధ్యాయులు సమ్మెలో పాల్గొనటం, సమ్మె విరమించటం వల్ల వీరికి సమ్మె కాలంలో వేతనం ఎలా చెల్లించాలనే అంశంపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.
మరిన్ని సందేహాలు...
ఉపాధ్యాయులు విడతలవారీగా సమ్మెలోకి రావటం, విరమించటంతో వారికి సీఎం ఇచ్చిన హామీ అమలు నేపథ్యంలో మరిన్ని సందేహాలు ఎదురవుతున్నాయి. ఒక పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉంటే ఒకరు సమ్మెలో పాల్గొనగా మరొకరు పాఠశాలను నడిపారు. పాఠశాల తెరిచి ఉండటంతో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేశారు. ఉపాధ్యాయులు సమ్మె విరమించే సమయంలో సమ్మె జరిగిన 33 రోజులను రానున్న రోజుల్లో భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఒక ఉపాధ్యాయుడు పనిచేసి మరొకరు సమ్మెలోకి వెళితే ఆ పాఠశాల మళ్లీ 33 రోజులు ఎలా పనిచేస్తుందనే ప్రశ్న ఉదయిస్తోంది.
అనుకోని పరిస్థితుల్లో 33 రోజులు పాఠశాలను అదనంగా పెడితే పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేస్తారా, దీనికి ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందా అన్నది తేలాల్సి ఉంది. సమ్మె కాలంలో విధినిర్వహణలో పాల్గొన్న ఉపాధ్యాయులు మళ్లీ పనిచేయాలా అనే ప్రశ్న కూడా వస్తోంది. 177 జీవో ప్రకారం ఉపాధ్యాయులు సమ్మె చేయడానికి వీలు లేదని.. నో వర్క్, నో పే అమలులో ఉంటుందని గతంలో హైకోర్టు స్పష్టం చేసినట్లు టీచర్లు చెబుతున్నారు. సమైక్యాంధ్ర కోసం 33 రోజుల పని దినాల్లో ఉపాధ్యాయులు సమ్మె చేస్తే వారికి వేతనం చెల్లించేందుకు ప్రత్యేక జీవో విడుదల చేయాలని ముఖ్యమంత్రి విద్యాశాఖ డెరైక్టర్‌కు సూచన చేయటం, ఈ అంశంపై వారు న్యాయశాఖ వివరణ కోరటంతో ప్రత్యేక జీవో విడుదల ఆలస్యమైందనే వాదన వినిపిస్తోంది.
న్యాయశాఖ ఈ అంశంపై పరిశీలన చేసిన అనంతరం సాధారణ పరిపాలనా విభాగానికి ఈ ఫైలు వెళ్లి ఆమోదం పొందిన తరువాతే ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించే అంశం కొలిక్కివచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 2012 ఫిబ్రవరి 28న దేశవ్యాప్తంగా జరిగిన సమ్మెలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆ ఒక్క రోజుకు సమ్మెలో పాల్గొన్న ఉపాధ్యాయులకు ఇంతవరకు వేతనం చెల్లించలేదు. దీని కారణంగా ఉపాధ్యాయులకు రావాల్సిన ఇంక్రిమెంట్లు, పే ఫిక్సేషన్ తదితర అంశాలన్నీ పెండింగ్‌లోనే ఉంచారు.
ఒక్కరోజు సమ్మె చేస్తేనే ఇన్ని ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో 33 రోజుల సమ్మె కాలానికి ఉపాధ్యాయులకు వేతనం ఎలా చెల్లిస్తారు, దానికి సంబంధించి జీవో ఎలా విడుదల చేస్తారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. సమ్మె విరమించేవరకు బుజ్జగించిన పాలకులు వేతనాలు చెల్లించే జీవో విడుదల విషయంలో ఎలా వ్యవహరిస్తారోనని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.