
ఆందోళనకారులను అరెస్టుచేస్తున్న పోలీసులు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్‌ఎంసీ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వైద్య విద్యార్థులు చేసిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. అలిపిరిని వేదికగా చేసుకుని జూడాలు మూడు గంటల పాటు రాస్తారోకో చేయడంతో భక్తులు, ప్రయాణికులు వారితో వాదులాడారు. చివరకు వైద్య విద్యార్థుల అరెస్టుతో ఆందోళనకు తెరపడింది.
సాక్షి, తిరుపతి : ఇటీవల కేంద్రం ఆమోదించిన జాతీయ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసీ) బిల్లుకు వ్యతిరేకంగా వైద్య విద్యార్థులు దేశ వ్యాప్తంగా ఆందోళనకు దిగారు. తిరుపతి ఎస్వీ వైద్య కళాశాల విద్యార్థులు సైతం ఆందోళన బాట పట్టడం విదితమే. ఐదు రోజులుగా బిల్లుకు వ్యతిరేకంగా వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేసిన వైద్యవిద్యార్థులు ఆరో రోజు బుధవారం తమ ఆందోళనను తీవ్రతరం చేశారు. మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో రుయా ఆస్పత్రిలో రిలే నిరాహార దీక్షకు పూనుకున్నారు. అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి అలిపిరికి చేరుకుని మానవహారం, రాస్తారోకోకు దిగారు. వీరికి మద్దతుగా స్విమ్స్, శ్రీపద్మావతి వైద్య కళాశాల విద్యార్థులు, ఎస్‌ఎఫ్‌ఐ నేతలు రాస్తారోకోలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ, ఎన్‌ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు.
దీంతో ఆ ప్రాంతంలో తిరుమలకు రాకపోకలు సాగే వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోవడంతో కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ స్తంభించింది. గంటల కొద్దీ వైద్య విద్యార్థులు రాస్తారోకో చేయడంతో పోలీసులు, టీటీడీ సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ అధికారులు, సిబ్బంది భారీ ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఆందోళనకు ఇది సరైన వేదిక కాదని ఏఎస్పీ అనిల్‌కుమార్, డీఎస్పీ మురళీకృష్ణ వారికి హితవు పలికారు. దీనిపై వైద్య విద్యార్థులు మాట్లాడుతూ విజయవాడలో జూడాలపై దాడి చేసినందుకు పోలీసుల తరఫున డీజీపీ సమాధానం చెప్పాలని, వైద్య శాఖ మంత్రితో చర్చలు జరిపేందుకు అనుకూల వాతావరణం కల్పించాలని, అరెస్టు చేసిన జూడాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
మూడు గంటల పాటు భక్తుల నిరీక్షణ
వైద్య విద్యార్థుల రాస్తారోకోతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. శ్రీవారి భక్తుల్లో ఓపిక నశించింది. ఆందోళనకారులతో వాగ్వాదానికి దిగారు. టీటీడీ విజిలెన్స్ అధికారులు భక్తులను రెచ్చగొట్టి తమపైకి ఉసిగొల్పారని వైద్య విద్యార్థులు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో టీటీడీకి చెందిన ఉన్నతస్థాయి విజిలెన్స్ అధికారి ఒకరు వైద్య విద్యార్థిని బూటు కాలితో తన్నడంతో ఆందోళనకారుల్లో ఆగ్రహం పెల్లుబికింది. ఆ అధికారిపైకి వైద్య విద్యార్థులు దూసుకొచ్చారు. ఇదే అదునుగా పోలీసులు వైద్య విద్యార్థులను పక్కకు లాగిపడేశారు. ఆందోళనకారులను అరెస్ట్ చేసి ముత్యాలరెడ్డిపల్లె పోలీస్ పరేడ్ గ్రౌండ్‌కు తరలించారు. ఆ తర్వాత ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. విద్యార్థులు–పోలీసులకు నడుమ తోపులాటలో ఓ వైద్య విద్యార్థి చేతికి తీవ్రగాయమైంది. దీంతో విద్యార్థులు మరింత ఆగ్రహానికి గురయ్యారు.
నేడు వైద్య సేవలు బంద్
ఎన్‌ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వైద్య సేవల బంద్‌కు పిలుపునివ్వడంతో ఐఎంఏ, జూడాలు, వైద్యులతో పాటు ప్రైవేటు వైద్యుల సంఘాలు ఈ బంద్‌లో పాల్గొననున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య సేవలను పూర్తిగా నిలిపేయనున్నట్లు ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ శ్రీహరి తెలిపారు. అన్ని రకాల ఓపీలతో పాటు అత్యవసర సేవలను సైతం నిలిపేయనున్నట్లు చెప్పారు. ఎన్‌ఎంసీ బిల్లు వల్ల పేద, మధ్య తరగతి వారికి తీవ్ర నష్టం తప్పదని, అంతేకాకుండా ఈ బిల్లు వల్ల వైద్య విధానాలు పేదలకు మరింత భారంగా పరిణమించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
ద్విచక్ర వాహనంపై తిరుమలకు ధర్మారెడ్డి
తిరుమల: జూనియర్ డాక్టర్ల నిరసనతో తిరుపతి నుంచి తిరుమలకు టీటీడీ తిరుమల ప్రత్యేక అధికారి ఏవీ ధర్మారెడ్డి ద్విచక్రవాహనంలో వెళ్లారు. నిరసన వల్ల అలిపిరిలోని గరుడ కూడలి వద్ద గంటపాటు రాకపోకలు స్తంభించాయి. అందులో ప్రత్యేకాధి కారి ధర్మారెడ్డి వాహనం కూడా నిలిచి పోయింది. దీంతో టీటీడీ ఉద్యోగికి చెందిన ద్విచక్రవాహనంపై ఆయన అక్కడి నుంచి తిరుమలకు వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment