
సాక్షి, విజయవాడతూర్పు: నేషనల్ మెడికల్ కమిషన్ రద్దు కోరుతూ జూనియర్ వైద్యులు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. మూడో రోజు ఆదివారం కూడా ప్రభుత్వాస్పత్రిలో సాధారణ విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వాస్పత్రి ఎదుట చేపట్టిన రిలేదీక్షలు మూడో రోజు కొనసాగాయి. కాగా సాయంత్రం వందలాది మంది జూనియర్ వైద్యులు ఎన్‌ఎంసీ బిల్లును వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రభుత్వాస్పత్రి నుంచి రమేష్ హాస్పిటల్ సిగ్నల్స్ వరకూ ర్యాలీ చేశారు. స్పెన్సర్ ఎదురుగా మానవహారంలా ఏర్పడి నినాదాలు చేశారు.
బిల్లు ఉపసంహరించే వరకూ నిరసనలు..
కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదించిన నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లును ఉపసంహరించే వరకూ ఆందోళనలు కొనసాగిస్తామని జూనియర్ వైద్యులు తేల్చిచెప్పారు. వైద్య విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడే దుర్మార్గపు బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని నినదించారు. అంతేకాకుండా అనుభవం లేనివారికి వైద్యం చేసేందుకు లైసెన్స్ ఇస్తూ, ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడటం ఏమిటనీ వారు ప్రశ్నించారు. ఎన్‌ఎంసీ నియమ నిబంధనలు ఏమిటీ, ఏమి చేయబోతున్నారో కూడా చెప్పడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి బిల్లు ఆమోదించడం దేశ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడటమేనన్నారు.
నేడు రాష్ట్రంలోని పలు వైద్య కళాశాలల విద్యార్థుల రాక
కాగా ఎన్‌ఎంసీ బిల్లుపై వైద్య విద్యార్ధులు కొనసాగిస్తున్న ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్రంలోని పలు వైద్య కళాశాలలకు చెందిన విద్యార్ధులు సోమవారం నగరానికి రానున్నారు. వారంతా కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు కార్యచరణ రూపొందిస్తున్నారు. ఆదివారం జూడాలు చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఐఎంఏ నగర శాఖ కార్యదర్శి డాక్టర్ సీహెచ్ మనోజ్‌కుమార్ పాల్గొని తమ మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో జూనియర్ వైద్యుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ ధనశేఖరన్, డాక్టర్ కౌశిక్‌లతో పాటు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment