సూపర్ స్పెషాలిటీ న్యూరాలజీ విభాగంలో రోగుల్లేని మంచాలు
సాక్షి, విశాఖపట్నం: పేదల వైద్యం బంద్ కానుంది. పేద, మధ్య తరగతి రోగులను ఆదుకునే పెద్దాస్పత్రి సహా ఇతర ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సేవలకు అంతరాయం కలగనుంది. మంగళవారం నుంచి జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగనున్న నేపథ్యంలో ఈ పరిస్థితి తలెత్తనుంది. తమ డిమాండ్లు పరిష్కరించనందుకు, జీతాలు/స్టైఫండ్ చెల్లించనందుకు నిరసనగా కొద్దిరోజుల నుంచి ఆందోళనలు చేపడుతున్న వీరు.. ప్రభుత్వం స్పందించకపోవడంతో సమ్మె బాట పట్టనున్నారు. మంగళవారం నుంచి ఆయా ఆస్పత్రుల్లో సేవలకు ఫుల్‌స్టాప్ పెడుతున్నారు. ఈ నెల 9 వరకూ వేచి చూసి అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే అప్పట్నుంచి అత్యవసర సేవలను కూడా బహిష్కరించాలని నిర్ణయించారు.
900 మంది జూనియర్ వైద్యుల విధులకు దూరం
ఆంధ్ర మెడికల్ కాలేజీ పరిధిలోకి వచ్చే కేజీహెచ్‌తోపాటు విమ్స్, ప్రభుత్వ ఛాతి, ఊపిరితిత్తుల ఆస్పత్రి, మానసిక వైద్యశాల, చెవి, ముక్కు గొంతు (ఈఎన్‌టీ), రాణి చంద్రమణిదేవి (ఆర్‌సీడీ), ప్రాంతీయ కంటి ఆస్పత్రి (ఆర్‌ఈహెచ్), ఘోషా తదితర ఆస్పత్రుల్లో సుమారు 900 మంది జూనియర్ వైద్యులు (పోస్టు గ్రాడ్యుయేట్లు, హౌస్ సర్జన్లు, సీనియర్ రెసిడెంట్లు) విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో ఒక్క కేజీహెచ్‌లోనే 600 మంది సేవలందిస్తుండగా, మిగిలిన వారు ఆయా ఆస్పత్రుల్లో పనిచేస్తున్నారు. ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు రోగులకు వైద్యం అందిస్తుంటారు.
వారి సూచనల మేరకు జూనియర్ డాక్టర్లు రోగులకు ఇంజక్షన్లు ఇవ్వడం, సెలైన్‌లు ఎక్కించడం వంటి వైద్య సేవలు చూస్తారు. రోగులకు అందే వైద్యసేవల్లో జూనియర్ వైద్యులు కీలకపాత్ర పోషిస్తుంటారు. వీరు లేకపోతే ఎక్కడి వైద్య సేవలక్కడే నిలిచిపోయే పరిస్థితి తలెత్తుతుంది. ఓపీ సేవలకు కూడా తీవ్ర అంతరాయం కలిగే ప్రమాదం ఏర్పడనుంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా సర్వీసు పీజీలు, అనాటమీ, ఫిజియాలజీ తదితర విభాగాల్లో ఉంటున్న 200 మంది వరకు ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్లను అందుబాటులో ఉంచుతున్నారు. అంటే దాదాపు ఐదోవంతు మందిని మాత్రమే సర్దుబాటుకు వీలవుతోంది.
ముందుగా డిశ్చార్జి..
ముందుజాగ్రత్తగా కేజీహెచ్ అధికారులు అంతగా ప్రాణాపాయం లేదనుకున్న రోగులకు డిశ్చార్జి ఇచ్చేస్తున్నారు. అత్యవసర రోగులను తప్ప ఇతరులను చేర్చుకోవడం లేదు. సోమవారం నుంచే దీనిని అమలులోకి తెచ్చారు. ఉదాహరణకు కేజీహెచ్ భావనగర్ వార్డులో 40 పడకలకు గాను పురుష వార్డులో నలుగురు, స్త్రీల వార్డుల ఏడుగురు, గ్యాస్ట్రో ఎంటరాలజీలో ముగ్గురు, పిల్లల వార్డులో 10 మందిని పంపించేశారు. మంగళవారం గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో 15 మందికి డిశ్చార్జి ఇవ్వనున్నారు. ఇలా మిగతా వార్డుల్లో చికిత్స పొందుతున్న వారిలో ప్రాణాంతక రోగాలతో చికిత్స పొందుతున్న వారిని మినహా పలువురిని ఇంటికి పంపడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ప్రభుత్వం పట్టించుకోకే..
ఏళ్ల తరబడి తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోనందువల్లే సమ్మెకు దిగుతున్నట్టు జూనియర్ డాక్టర్లు చెబుతున్నారు. ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించామని, కొన్నాళ్లుగా వివిధ రూపాల్లో ఆందోళనలు చేపడుతున్నా స్పందించలేదని, దీంతో సమ్మె చేయక తప్పడం లేదని అంటున్నారు. ఐదు నెలల నుంచి స్టైపండ్, గౌరవ వేతనాలు చెల్లించడం లేదని, ఏటా బడ్జెట్‌లో దీనికోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని, ఎంబీబీఎస్, పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులు పూర్తి చేసిన వెంటనే డిగ్రీలు జారీ చేసి రిజిస్ట్రేషన్లకు అనుమతించడం తదితర డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నామని ఏపీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.ముఖేష్‌కుమార్ ‘సాక్షి’కి చెప్పారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 9 నుంచి అత్యవసర సేవలు కూడా నిలిపివేస్తామని హెచ్చరించారు.
సమ్మె మరింత తీవ్రతరం
పాతపోస్టాఫీసు: జూనియర్ వైద్యుల రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా మంగళవారం నుంచి కేజీహెచ్‌లో విధులు బహిష్కరిస్తాం. ఓపీ, వార్డుల సేవలను పూర్తిగా నిలిíపివేస్తాం. అత్యవసర, ఇంటెన్సివ్ కేర్ యూనిట్, క్యాజువాల్టీ కేసులను అటెండ్ అవుతాం. జూనియర్ వైద్యుల వేదనను అర్థం చేసుకోకుండా ప్రత్యేక వైఖరిని ప్రదర్శిస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం.
–ఏపీ జూనియర్ వైద్యుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు, ఆంధ్రవైద్య కళాశాల సంఘం కార్యదర్శి డాక్టర్ గంగాధర్
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం..
జూనియర్ డాక్టర్ల సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. నాన్ క్లినికల్ (మైక్రో బయాలజీ, బయోకెమిస్ట్రీ, పేథాలజీ, ఫిజియాలజీ, అనాటమీ తదితర విభాగాల్లోని 40 మందిని ఓపీ సేవలకు డెప్యుటేషన్ పంపాలని కోరాం. శస్త్రచికిత్సలు నిలిచిపోకుండా చూస్తాం. వార్డుల్లో రోగులకు సేవలకు అంతరాయం కలగకుండా నర్సులకు తాత్కాలికంగా లీవులు రద్దు చేస్తున్నాం. మార్చి, ఏప్రిల్ నెలల్లో రోగుల తాకిడి ఎక్కువగా ఉంటున్నందున జూనియర్ వైద్యుల సమ్మె పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని డీఎంఈని కోరాం. సమ్మె దృష్ట్యా అత్యవసర వైద్య సేవలందించే వారినే ఆస్పత్రిలో చేర్చుకుంటున్నాం.
–డాక్టర్ జి.అర్జున, సూపరింటెండెంట్, కేజీహెచ్
Comments
Please login to add a commentAdd a comment