'బాబు.. చేతనైతే జగన్ను నేరుగా ఎదుర్కో'
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే సత్తా లేక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, కొన్ని రాజకీయ పార్టీలు కొంత మంది వ్యక్తులతో కలిసి కుట్ర చేస్తున్నారని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు ఆరోపించారు. దివంగత మహానేత వైఎస్ఆర్ ఉన్నప్పుడు కూడా ఇలాగే కుట్రలు చేశారని, ఇప్పుడు కూడా అదే పంథా కొనసాగిస్తున్నారని విమర్శించారు.
చంద్రబాబు దిష్టిబొమ్మలా తయారయ్యారని, చేతనైతే జగన్ను నేరుగా ఎదుర్కోవాలని జూపూడి సవాల్ విసిరారు. కౌరవుల్లా కట్టకట్టుకుని వచ్చినా జగన్ ప్రభంజనాన్ని ఆపలేరని అన్నారు. సీమాంధ్రలో 143 స్థానాల్లో వైఎస్ఆర్ సీపీ విజయకేతనం ఎగరవేయబోతుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ మేనిఫెస్టో కమిటీ శుక్రవారం సమావేశమైందని, త్వరలోనే మరో సారి సమావేశమై మేనిఫెస్టోను ప్రకటిస్తామని జూపూడి ప్రభాకరరావు చెప్పారు.