ఆర్థిక అసమానతలతో ముప్పు
సాక్షి, హైదరాబాద్: సహజ వనరులను ఆక్రమించి పెంచుకున్న సంపదతో కొందరు వ్యక్తులు ప్రజాస్వామ్యంలోని అన్ని వ్యవస్థలను శాసిస్తున్నారని అంతర్జాతీయ సెమినార్‌లో వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ‘తెలంగాణ విద్యావంతుల వేదిక’, ‘సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్’, ‘డెమొక్రసీ డైలాగ్స్’ ఆధ్వర్యంలో నాలుగు రోజుల అంతర్జాతీయ సెమినార్ శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ‘ప్రజాస్వామ్యం - సామ్యవాదం - 21వ శతాబ్దపు నూతన దృక్పథాలు’ అనే అంశంపై మూడు సమాంతర సెమినార్లు ప్రారంభమయ్యాయి. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి ఈ సెమినార్‌ను ప్రారంభించారు.
కేంద్ర మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి, సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ, తెలంగాణ జేఏసీ చైర్మన్ ఎం.కోదండరాం, తెలంగాణ విద్యావంతుల వేదిక చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య, ఎమ్మెల్సీ చుక్కా రామయ్య, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు, పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి, ఎస్.వినయ్‌కుమార్, కె.శ్రీనివాస్‌రెడ్డి, ప్రొఫెసర్ రమా మెల్కొటే, శాంతా సిన్హా, సీడీఎస్ చైర్మన్ వై.బి.సత్యనారాయణ, దాదాపు 30 దేశాలకు చెందిన సామాజికవేత్తలు, ఆర్థికవేత్తలు, ఉద్యమకారులు, రాజకీయవేత్తలు హాజరయ్యారు.
సంపన్నులే శాసిస్తే ప్రమాదం: ఈ సెమినార్‌లో కేంద్ర మంత్రి ఎస్.జైపాల్ రెడ్డి మాట్లాడుతూ... ‘‘సహజ వనరులను ప్రైవేటు వ్యక్తులకు, సంస్థలకు ప్రభుత్వమే ధారాదత్తం చేయడం వల్ల కొందరి సంపద హద్దుల్లేకుండా పెరిగిపోయింది. మరోవైపు ఆకలి, దారిద్య్రం వంటివి అంతకన్నా ఎక్కువగా పెరిగాయి. సంపన్నులు, పేదల మధ్య తీవ్రంగా పెరిగిన అంతరాలు సమాజంలో అశాంతిని, అసంతృప్తిని పెంచుతున్నాయి. తద్వారా పెరుగుతున్న అశాంతి సమాజ భద్రతకు మంచిది కాదు. రెండు వర్గాల మధ్య అసమానతలపై ప్రజాస్వామిక ఉద్యమాలు వస్తున్నాయి. ఇంతకన్నా ప్రమాదం అత్యంత సంపన్నుల నుంచి ఉంది. ప్రభుత్వ ప్రోత్సాహంతో దేశంలోని సహజ వనరులను ఉపయోగించుకుని కొందరు శతకోట్ల రూపాయల ఆస్తి ఉన్న సంపన్నులుగా ఎదిగారు. ఇలాంటివారు ప్రజాస్వామ్యంలోని అన్ని వ్యవస్థలనూ గుప్పిట్లో బంధించారు. రాజకీయాలనూ ఇలాంటివారే శాసిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు పెను ప్రమాదం’’ అని ఆందోళన వ్యక్తం చేశారు.
మార్కెట్ శక్తులపై రాజ్యాంగ నియంత్రణ: జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ప్రసంగిస్తూ... ‘‘ప్రభుత్వం ప్రోత్సహించే పెట్టుబడిదారీ విధానాలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు అత్యంత ప్రమాదకరం. జాతి సంపద సహజ వనరులను ఆక్రమించుకున్న మార్కెట్ శక్తులు అన్ని రాజ్య వ్యవస్థలతో పాటు మీడియా, విద్యా వ్యవస్థలనూ కబళిస్తున్నాయి. వాటి అడుగుజాడల్లో మైనింగ్ ఇతరత్రా మాఫియాలు సమాజాన్ని ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. వాటిని నియంత్రించడానికి రాజ్యాంగాన్ని బలోపేతం చేయాలి’’ అని అభిప్రాయపడ్డారు.
సామ్రాజ్యవాద శక్తులు అణచివేస్తున్నాయి: సీపీఎం నేత ప్రకాశ్ కారత్ మాట్లాడుతూ... ‘‘ఉత్పాతకత, మార్కెట్ రంగం ప్రభుత్వ నిర్వహణలోనే ఉండాలి. వ్యక్తుల భారీ పెట్టుబడులపై పరిమితులు విధించాలి. ఆర్థిక ప్రణాళిక ద్వారా వికేంద్రీకరణను ప్రయోగాత్మకంగా అమలుచేయాలి. బహుళ రాజకీయపార్టీల వ్యవస్థ ద్వారా వక్రీకరణలను నివారించొచ్చు. సామ్రాజ్యవాద శక్తులు విప్లవాత్మక మార్పులను నియంత్రిస్తున్నాయి. విప్లవోద్యమాలను అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నాయ’’ని వివరించారు.