
రాష్ట్ర విభజన అశాస్త్రీయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక రాష్ట్రనేత జస్టిస్ లక్ష్మణరెడ్డి
పదిమంది మెప్పుకోసం తెలుగుజాతికి ద్రోహం చేస్తున్నారు
సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న పార్టీలకు మద్దతు తెలపాలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అశాస్త్రీయం, అసంబద్ధం... దీనిని మనమందరం తిప్పికొట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట పరిరక్షణ వేదిక రాష్ట్రనేత జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి పిలుపునిచ్చారు. ‘వంద రోజుల సమైక్యాంధ్ర ఉద్యమంపై సమీక్ష ’ అనే అంశంపై శుక్రవారం తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం సెనేట్ హాల్‌లో ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. వంద రోజుల ఉద్యమం, భవిష్యత్ ప్రణాళికపై చర్చించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జస్టిస్ లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ విభజన రాజకీయ విభజనే తప్ప శాస్త్రీయమైన విభజన కాదని ధ్వజమెత్తారు. ఏదైనా రాష్ట్రాన్ని విభజించాలని భావిస్తే ముందుగా దానిపై చర్చ జరగాలని, అసెంబ్లీ, పార్లమెంట్‌లలో తీర్మానాలు జరగాలని తెలిపారు.
1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు సమయంలో ఫజల్ అలీ కమిషన్ వేసి, ఆ కమిషన్ ప్రతిపాదించిన మొదటి ఎస్‌ఆర్‌సీకి అనుగుణంగా రాష్ట్రాల ఏర్పాటు జరిగిందని గుర్తుచేశారు. ఆర్టికల్-3 ప్రకారం చట్టబద్ధంగా సాగిందన్నారు. అలాగే మహారాష్ట్ర నుంచి విదర్భను వేరుచేయాలని ఉద్యమం వచ్చిన సందర్భం లో 2001లో ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో కమిటీ వేశారని, శాస్త్రీయ అధ్యయనం జరిపారని గుర్తుచేశారు. ప్రస్తుతం మన రాష్ట్ర విభజన విషయంలో పది జిల్లాలతో కూడిన తెలంగాణ ను ఏర్పాటు చేయాలని సీడబ్ల్యూసీలో చేసిన తీర్మానం మేరకు రాష్ట్రాన్ని విడదీయడం ఎంతవరకు సమంజసమన్నారు. సీడబ్ల్యూసీ తీర్మానానికి శాస్త్రీయతకానీ, చట్టబద్ధత కానీ లేదన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచడమే ఉత్తమమని శ్రీకృష్ణకమిటీ తేల్చిందని గుర్తుచేశారు. దానిని పట్టించుకోకుండా జీవోఎంను వేసి దీని సూచనల అనుగుణంగా విడదీయాలని చూడడం బాధాకరమన్నారు.
కేంద్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు సమైక్యాంధ్రకోసంగాక ప్యాకేజీల కోసం పాకులాడడం హాస్యాస్పదమన్నారు. ఒక రాజకీయ పార్టీ తన ప్రయోజనాలకోసం రాష్ట్రాన్ని విభజిస్తే ఊరుకోబో మన్నారు. సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని ఆధారంగా చేసుకుని కేంద్ర కేబినెట్‌లో ఆమోదం తెల్పి రాష్ట్ర విభజన ప్రక్రియను తలకెత్తుకోవడం నియంతృత్వ పోకడలకు నిదర్శనమన్నారు. పది మంది తెలంగాణ ప్రజాప్రతినిధుల మెప్పుకోసం ఆరు కోట్ల సీమాంధ్రులకు ద్రోహం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీమాం ధ్ర మంత్రులు, ఎంపీలకు రాష్ట్ర విభజన అడ్డుకోవడం చేతకాకపోతే మౌనంగా ఉండిపోవాలని సూచించారు. తాము ప్యాకేజీలకోసం పాకులాడట్లేదని, రాష్ట్ర్రాన్ని సమైక్యంగా ఉంచడమే తమ లక్ష్యమని చెప్పారు. సమైక్యాంధ్రకోసం పోరాడుతున్న పార్టీలకు మద్దతు తెలపాలని ఉద్యమకారులకు పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ ప్రధాని, రాష్ట్రపతి, యూపీఏ చైర్‌పర్సన్‌కు సీమాంధ్రులంతా పోస్టుకార్డులు పంపాలన్నారు. సదస్సుకు సీమాంధ్ర యూనివర్సిటీల కన్వీనర్ ప్రొఫెసర్ రవి, నారాయణరెడ్డి అధ్యక్షత వహించారు.