సామాన్యుడి దగ్గరికే న్యాయం.. | justice p.sathasivam launches legal aid clinics | Sakshi
Sakshi News home page

సామాన్యుడి దగ్గరికే న్యాయం..

Jan 25 2014 12:58 AM | Updated on Sep 4 2018 5:07 PM

దేశవ్యాప్తంగా కొత్త లీగల్ ఎయిడ్ క్లీనిక్‌లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ప్యాట్రన్ ఇన్ చీఫ్ జస్టిస్ పి.సదాశివం, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ ఆర్.ఎం.లోథా, పలువురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.

దేశవ్యాప్తంగా లీగల్ ఎయిడ్ క్లినిక్‌ల ఏర్పాటు
శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన సుప్రీం చీఫ్ జస్టిస్ సదాశివం
 
 సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా కొత్త లీగల్ ఎయిడ్ క్లీనిక్‌లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ప్యాట్రన్ ఇన్ చీఫ్ జస్టిస్ పి.సదాశివం, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ ఆర్.ఎం.లోథా, పలువురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. రాష్ట్రానికి సంబంధించిన లీగల్ ఎయిడ్ క్లినిక్‌ల ప్రారంభోత్సవ కార్యక్రమం రాష్ట్ర హైకోర్టులో జరిగింది. ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ప్యాట్రన్ ఇన్ చీఫ్ జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్ జస్టిస్ జి.రోహిణి, లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి, పలువురు న్యాయమూర్తులు, న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి శ్యామ్‌ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ సేన్‌గుప్తా మాట్లాడుతూ... ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు న్యాయస్థానాలను ఆశ్రయించడానికి బదులు... స్థానికంగా సమస్యను పరిష్కరించడమే లీగల్ ఎయిడ్ క్లినిక్‌ల ఏర్పాటు ప్రధాన ఉద్దేశమని చెప్పారు.
 
 మండల స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల తరహాలోనే... ఈ క్లినిక్‌లు ఉంటాయన్నారు. న్యాయపరంగా ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలకు కూడా ప్రజలు ఇప్పటివరకు పట్టణాలు, నగరాలకు వెళ్లాల్సి ఉండేదని... లీగల్ ఎయిడ్ క్లినిక్‌ల ద్వారా ఇక ఆ ఇబ్బంది ఉండదని జస్టిస్ సేన్‌గుప్తా తెలిపారు. ఈ క్లినిక్‌ల్లో పనిచేసేందుకు అవసరమైన వలంటీర్లను పూర్తిస్థాయిలో నియమిస్తామని... క్లినిక్‌ల ఏర్పాటు లక్ష్యాన్ని విజయవంతం చేయడంలో వారిదే కీలకపాత్ర అని పేర్కొన్నారు. అవసరాన్ని బట్టి న్యాయవాదుల సేవలను సైతం వినియోగించుకుంటామన్నారు. పోలీస్‌స్టేషన్లలో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయకపోవడంతో పలువురు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారని.. లీగల్ ఎయిడ్ క్లినిక్‌లతో ప్రజలకు ఇక ఆ ఇబ్బంది ఉండదని చెప్పారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం, తాగునీరు, వైద్యం, ఆరోగ్యం తదితరాలన్నీ ప్రజల ప్రాథమిక హక్కులని.. ఆ హక్కులకు భంగం కలిగితే ప్రజలు నేరుగా లీగల్ ఎయిడ్ క్లినిక్‌లకు వెళ్లి న్యాయం పొందవచ్చునని వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement