
జూట్ కార్మికుల రాస్తారోకో
స్థానిక శ్రీ లక్ష్మీ శ్రీనివాస జూట్ మిల్లు మూతపడిందని, దానిని తెరిపించడానికి ప్రభుత్వపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మికులు స్థానిక
బొబ్బిలి: స్థానిక శ్రీ లక్ష్మీ శ్రీనివాస జూట్ మిల్లు మూతపడిందని, దానిని తెరిపించడానికి ప్రభుత్వపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మికులు స్థానిక ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద బుధవారం రాస్తారోకో నిర్వహించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా మొండి వైఖరి వహిస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసు కోవాలని డిమాండ్ చేశారు. బొబ్బిలి పర్యటనకు వచ్చిన మంత్రి మృణాళినికి వినతిపత్రం ఇవ్వాలని చూసినా జూట్ కార్మికులు రాస్తారోకో చేసి వాహనాన్ని అడ్డుకుని మంత్రిని ఘెరావ్ చేసే అవకాశం ఉందని తెలుసుకున్న పోలీసులు మంత్రిని వేరే దారిలో విజయనగరం సాగనంపారు. అనంతరం రాస్తారోకో చేస్తున్న స్థలం వద్దకు సీఐ వీరకుమార్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీసలు తరలివచ్చారు.
ఒకానొక దశలో జూట్ కార్మికులను బలవంతంగా అక్కడ నుంచి పోలీస్ స్టేషనుకు తరలించాలన్న ఆలోచనకు పోలీసులు వచ్చారు. కార్మికులు, నాయకులు కూడా అందుకు సిద్ధమయ్యారు. ఈలోగా సీఐ చొరవ తీసుకుని రెండు రోజుల సమయం ఇవ్వాలని కోరారు. దాంతో కార్మికులు ఆందోళన విరమించారు. ఆదివారానికి సమస్య పరిష్కారం కాకపోతే సోమవారం రహదారులను దిగ్బంధిస్తామని కార్మిక నాయకులు హెచ్చరించారు. కార్యక్రమంలో పి శంకరరావు, ఎ సింహాచలం, వి శేషగిరి, బి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
తహశీల్దార్ కార్యాలయం ఎదుట జూట్‌కార్మికుల ధర్నా
బొబ్బిలి రూరల్: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ,ఇఫ్టూల ఆధ్వర్యంలో శ్రీలక్ష్మీశ్రీనివాసా జూట్ కార్మికులు బుధవారం తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కార్మికుల హక్కులు కాలరాస్తున్న యాజమాన్యంపై చర్యలు చేపట్టాలని, కార్మికులకు న్యాయం చేసి మిల్లు తెరవాలని, బోనస్,ఈఎస్‌ఐ, గ్రాట్యుటీలు చెల్లించాలంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ డివిజన్ కార్యదర్శి పొట్నూరు శంకరరావు మాట్లాడుతూ హుద్‌హుద్ తుపాను సమయంనుంచి కరెంటు కోత పేరిట కార్మికులకు యాజమాన్యం అన్యాయం చేసిందని, దసరా బోనస్ చెల్లించలేదని, అలాగే కార్మికులకు చెందిన ఈఎస్‌ఐ,పీఎఫ్, గ్రాట్యుటీ బకాయిలు రూ.కోట్లలో ఉందని వీటిని తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.
చర్చలపేరిట యాజమాన్యం తాత్సారం చే స్తోందని, కార్మికుల ఆకలికేకలు ప్రభుత్వానికి, అధికారులకు పట్టడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇఫ్టూ నాయకుడు సన్యాసిరావు మాట్లాడుతూ కార్మికులకు మూడునెలలుగా యాజమాన్యం అన్యాయం చేస్తోందని, ఉద్యోగ విరమణచేసిన ఉద్యోగుల బకాయిలు చెల్లింపుల విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకె ళ్లినా ఎవరూపట్టించుకోవడంలేదని ఆందోళన వెలిబుచ్చారు. అనంతరం తహశీల్దార్ బి.మాసిలామణికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ,ఇఫ్టూ నాయకులు వి.శేషగిరిరావు, జుత్తాడ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.