కడప–బెంగళూరు రైల్వేలైనుపై కేంద్ర ప్రభుత్వ స్పందన ఆశాజనకంగా లేదు. అందువల్లే పనులు వేగమందు కోలేకపోతున్నాయి. దివంగత సీఎం వైఎస్సార్ తన హయాంలో ఈ రైల్వేలైనుపై ప్రత్యేక
ప్రేమ కనబరిచేవారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాటాను సక్రమంగా కేటాయించారు. ఆయన మరణానంతరం పనులు మందగించాయి. పదకొండేళ్లవుతున్నా ప్రాజెక్టు పెళ్లినడకగా నేసాగుతోంది. టీడీపీ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన మేర నిధులు కేటాయించలేదు. తాజాగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం బడ్జెట్‌లో రైల్వేలైన్లకు రూ.185కోట్లు కేటాయించడం కొంత ఉత్సాహాన్నిస్తోంది. కేంద్రం
కూడా ఇదే రీతిన స్పందిస్తే పనులు పరుగందుకునేవని ప్రజలంటున్నారు.
సాక్షి, రాజంపేట(కడప) : కడప వయా మదనపల్లె–బెంగళూరు రైలుమార్గంలో మలిదశపనులు మొదలయ్యాయి. రైల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఆర్‌ఐడీసీ)లోకి ఈమార్గాన్ని తీసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కడప–బెంగళూరు రైలుమార్గాన్ని పూర్తి చేయాల్సి ఉంది. 2010 సెప్టెంబరులో జాయింట్ వెంచర్‌లో చేపట్టనున్న ఈ మార్గానికి అప్పటి రైల్వేశాఖ మంత్రి మునియప్ప శంకుస్ధాపన చేశారు. ఈ రైల్వే మార్గం దివంగత సీఎం వైఎస్సార్ మానసపుత్రిక. 2008–2009లో కేంద్రం ఆమోదించిన ఈ ప్రాజెక్టు పనులను రూ.1000కోట్ల అంచనా వ్యయంతో చేపట్టారు.
258 కిలోమీటర్ల మేర నిర్మాణానికి 1,531 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ఐదేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలనేదిలక్ష్యం. తాజా పరిస్థితులు గమనిస్తే అయిదేళ్లలో కాదు కదా కనీసం 15 ఏళ్లు దాటిపోయేటట్లు కనిపిస్తోంది. భూసేకరణకు రూ.199.2కోట్లు కేటాయించారు. 2016–2017లో రూ.58కోట్లు, 2017–2018లో రూ.240కోట్లు కేటాయించారు. మొదటిదశలో పెండ్లిమర్రి వరకు లైను సిద్ధం చేసి డెమోరైలును నడిపిస్తున్నారు. నాలుగుదశల్లో ఈ రైలుమార్గం చేపట్టాలని రైల్వేశాఖ నిర్ణయించింది.
కేంద్రం ఆమోదం ఆమోదం: 2008–2009లో
రైలుమార్గం ప్రారంభం: 2010లో
అంచనా వ్యయం: రూ.1000కోట్లు
రైలుమార్గం: 258కి.మీ
నిర్మాణం: 4దశల్లో...
మొదటిదశలో
మొదటిదశలో రూ.153కోట్లు కేటాయించారు. ఈ దశలో 21.8కి.మీ వరకు లైన్ నిర్మించారు. కడప నుంచి గంగనపల్లె, పెండ్లిమర్రి వరకు పట్టాలు వేశారు. 311.84 ఎకరాలు భూమిని సేకరించారు. 54 చిన్నబ్రిడ్జిలు, ఆరుపెద్ద బ్రిడ్జిల నిర్మాణం చేపట్టారు.నిర్మాణం కోసం రూ.199.2కోట్లు వెచ్చించారు. రెండోదశలో పెండ్లిమర్రి–రాయచోటి టు వాల్మీకిపురం వరకు లైన్‌ను చేపట్టాల్సి ఉంది. మూడవదశలో మదనపల్లెరోడ్డు టు మదగట్ట (ఆంధ్రప్రదేశ్ సరిహద్దు), మదగట్ట–ముల్భాగల్ (కర్నాటక రాష్ట్రం సరిహద్దు) లైను పూర్తి చేయాలనుకుంటున్నారు. 4వదశలో ముల్బాగల్ టు కోలార్ వరకు నిర్మాణం చేపట్టేలా రూపకల్పన చేసి ప్రణాళికలు రూపొందించుకున్నారు.
ఈ ఏడాది అరకొరే..
ఆంధ్రప్రదేశ్‌లో 205 కిలోమీటర్ల రైలుమార్గం ఉండగా, కర్నాటకలో 50.40కిలోమీటర్ల మేర రైలుమార్గం నిర్మించాలి. ఈ మార్గ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం సగం వాటా భరిస్తోంది. ఈ ఏడాది సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కొత్త రైల్వే నిర్మాణాలకు బడ్జెట్‌లో తమ వాటా కింద రూ.185కోట్లు కేటాయించారు. మొదటిదశలో కడప నుంచి పెండ్లిమర్రి వరకు మార్గం పూర్తి చేసిన సంగతి తెలిసిందే. 21 కిలోమీటర్ల మార్గం అందుబాటులో ఉంది. రాష్ట్రంలోని ముఖ్యమైన రైలుమార్గాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాటాను కేటాయించాల్సి ఉంటుంది. గత టీడీపీ ప్రభుత్వం సక్రమంగా వాటాలు కేటాయించకపోవడంతో ఈలైను నిర్మాణం జాప్యం జరుగుతూ వస్తోందని విమర్శలున్నాయి. కేంద్రం కూడా రైల్వేబడ్జెట్‌లో ఏటా అరకొరగా నిధులు కేటాయిస్తూ వచ్చింది. ఈ ఏడాది కూడా కడప–బెంగళూరు లైనుకు నామమాత్రంగా రూ.2కోట్లు కేటాయించడంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment