
కోటిరెడ్డిసర్కిల్‌లో కమాండ్ కంట్రోల్ సిబ్బందికి సూచనలిస్తున్న డీఎస్పీ మాసుంబాషా
కడప అర్బన్ : మంగళవారం రాత్రి 8.30 గంటల సమయం. పనులు ముగించుకున్న ప్రజలు ఎవరి వాహనాల్లో వారు ఇళ్లకు బయలుదేరారు. ఇంతలో నగరంలోని ప్రధాన కూడళ్లు ఒక్కసారిగా పోలీసు వలయంలోకి వెళ్లాయి. వాహనాల తనిఖీ చేపట్టి కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకోవడంతో పాటు కొన్ని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. జిల్లా పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి ఆదేశాలతో మంగళవారం రాత్రి కడప డీఎస్పీ షేక్ మాసుం బాషా పర్యవేక్షణలో కూడళ్లన్నింటిలో పోలీ సులు నాకాబందీ నిర్వహించారు. రాత్రి 8.30 గంటల నుంచి 10 గంటలకు పైగా ఈ తనిఖీలను విస్తృతంగా చేపట్టారు.
ఈ తనిఖీలలో డీఎస్పీతోపాటు సీఐలు విశ్వనాథరెడ్డి, పద్మనాభన్, హమీద్‌ఖాన్, నాయకుల నారాయణ, శ్రీధర్‌నాయుడు, నాగరాజరావు, చంద్రశేఖర్‌ల ఆధ్వర్యంలో ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది అంతా మొత్తం 150 మంది పాల్గొన్నారు. కడప నగరంలోని కోటిరెడ్డిసర్కిల్, అప్సర సర్కిల్, అంబేడ్కర్ సర్కిల్, ఏడురోడ్ల కూడలి, ఐటీఐ సర్కిల్, వన్‌టౌన్ సర్కిల్, అల్మాస్‌పేట సర్కిల్, రాజంపేట బైపాస్ సర్కిల్‌లలో ఈ తనిఖీలను నిర్వహించారు. ద్విచక్ర వాహనాలు మొదలు కుని కార్లు, ఆటోలు, ఇతర వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. సమగ్రంగా దర్యాప్తు చేసి వివరాలను వెల్లడిస్తామని పోలీసు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment