ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. ఆపై వద్దన్నాడు | kadapa constable cheated woman with marriage | Sakshi
Sakshi News home page

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. ఆపై వద్దన్నాడు

Published Sun, Feb 26 2017 4:00 PM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. ఆపై వద్దన్నాడు - Sakshi

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. ఆపై వద్దన్నాడు

కానిస్టేబుల్‌ నయవంచనపై ఓ యువతి ఆవేదన
కడప ‌: ఓ కానిస్టేబుల్‌ వెంటబడి ప్రేమించాడు. పట్టుబట్టి వివాహం చేసుకున్నాడు. కొద్దిరోజులు సంసారం చేశాడు. అనంతరం తనకు అంతకుముందే పెళ్లి అయినట్లుగా చెప్పాడు. తాజాగా ఇప్పుడు తన తల్లిదండ్రులు ఒప్పుకోవడంలేదు. వారు ఇచ్చింది తీసుకొని మిన్నకుండి పొమ్మని అంటున్నాడు. ఈ నేపథ్యంలో భర్తే తనకు కావాలని కమలాపురం మండల కేంద్రంలోని రామ్‌నగర్‌కు చెందిన డి. కేశమ్మ అధికారులను వేడుకుంటోంది.

స్థానిక వైఎస్సార్‌ మెమోరియల్‌ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ 2012లో కమలాపురంలోని ఒక జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ మీడియట్‌ చదువుతుండగా అప్పుడు కడపలోని ఒక పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న పోలీస్‌ కానిస్టేబుల్‌తో తన స్నేహితురాలి ద్వారా పరిచయం ఏర్పడిందని తెలిపింది. అతను తనను ప్రేమిస్తున్నానని చెప్పడంతో పాటు 2015లో కడపలోని శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానంలో వివాహం చేసుకున్నాడని ఆమె వాపోయింది. పెళ్లికి అతని తల్లిదండ్రులు రాలేదని, ఇదేమిటని ప్రశ్నిస్తే వారికి ఈ పెళ్లి వారికి ఇష్టం లేదని చెప్పాడన్నారు.

అనంతరం అతను ఇదివరకే తనకు వివాహమైందని.. ఆమె అంటే తనకు ఇష్టం లేదని చెప్పడంతో తాను ఆశ్చర్యపోయానన్నారు. కాగా అప్పటికే తాను గర్భం దాల్చడంతో అతను భయపడి అబార్షన్‌ చేయించడంతో తాను తీవ్ర అనారోగ్యానికి గురయ్యానని తెలిపారు. తాజాగా అతను దువ్వూరు పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్నాడని చెప్పారు. కాగా ఇటీవల అతను ఇక నేను నీ వద్దకు రాలేను నా తల్లిదండ్రులు, నా భార్య రెండవ వివాహానికి ఒప్పుకోవడం లేదు అని చెప్పాడన్నారు. అంతేగాకుండా నీ వద్దకు నా తల్లిదండ్రులు వస్తారు. వారు ఇచ్చింది తీసుకొని ఊరకే ఉండిపొమ్మని చెప్పినట్లుగా పేర్కొన్నారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లగా ఆయన చర్యలకు ఆదేశించినట్లు తెలిపారు. అయితే ఇంతవరకు దువ్వూరు పోలీసులు తనకు ఎలాంటి న్యాయం చేయలేదని ఆరోపించారు. తనకు తన భర్తే కావాలని వేడుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement