కడప: కడప నగర శివార్లలోని రాయచోటి రైల్వేగేటు రైల్వేస్టేష్టన్ మధ్య ట్రాక్‌లో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతురాలు మండెం శివజ్యోతి( 28)గా గుర్తించారు. ఘటనా స్థలానికి మృతురాలి బంధువులు, పోలీసులు వచ్చి పరిశీలించారు.
మృతురాలి అక్క శివ కళావతి, తల్లి సరోజమ్మ, సీఐ సదాశివయ్య తెలిపిన వివరాల మేరకు... ఊటుకూరుకు చెందిన మండెం శివశంకరయ్య, సరోజమ్మలకు నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు సంతానం. చివరి సంతానమైన మండెం శివజ్యోతికి, సుండుపల్లెకు చెందిన కిషోర్‌కుమార్‌కు 2003 వివాహమైంది. వీరికి కళ్యాణ్‌కుమార్ (8) కుమారుడు ఉన్నాడు. వీరి మధ్య మనస్పర్థలు ఏర్పడి విడిపోయారు.
2013లో కానిస్టేబుల్ శివప్రసాద్‌తో శివజ్యోతికి పరిచయం ఏర్పడింది. అతను ప్రస్తుతం రాజంపేటలో పనిచేస్తున్నాడు. గత ఏడాది భాకరాపేట (విశ్వనాథపురం)లోని శివాలయంలో కానిస్టేబుల్ శివప్రసాద్‌తో శివజ్యోతి వివాహమైంది. ఊటుకూరులో అవ్వ సరోజమ్మ దగ్గర కళ్యాణ్‌కుమార్ ఉంటున్నాడు. శివజ్యోతి, తన భర్త శివప్రసాద్‌తో కలిసి నగరంలోని అక్కాయపల్లెలో నివసిస్తోంది. ఆమె బ్యూటీషియన్ కోర్సు చేసింది. శివప్రసాద్‌కు, మృతురాలికి తీవ్ర స్థాయిలో మనస్ఫర్థలు ఏర్పడ్డాయి. ఈనెల 11న రాత్రి 7:30 గంటల సమయంలో తన అక్క శివకళావతి సెల్‌ఫోన్‌కు తనను శివ వేధిస్తున్నాడని మెసేజ్ పెట్టింది. తర్వాత ఆదివారం ఉదయం రైల్వేట్రాక్‌లో శవమై కన్పించింది.
శివజ్యోతి మృతిపై అనుమానం
శివజ్యోతి, శివప్రసాద్‌ల మధ్య ఏర్పడిన మనస్పర్థల వలనే ఆమె మృతికి కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలంలో మృతదేహాన్ని పరిశీలిస్తే రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడినట్లుగానీ, శరీరం ఛిద్రమైనట్లుగాగానీ కన్పించలేదు. రైల్వే ట్రాక్ మధ్యలో నిలువుగా పడి ఉంది. పథకం ప్రకారం హత్య చేసి రైల్వే ట్రాక్ మధ్య పడుకోబెట్టి ఉండవచ్చునని అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై మొదట కడప రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. పోస్టుమార్టం అనంతరం దర్యాప్తు ప్రారంభిస్తామనీ అర్బన్ సీఐ సదాశివయ్య తెలిపారు.