‘చంద్రబాబు చుట్టూ విజయ్ మాల్యాలు’
నెల్లూరు: ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిని టీడీపీ నుంచి సస్పెండ్ చేయడం సరైందేనని నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. వాకాటిపై ముందు నుంచే కేసులు ఉన్నా టికెట్ ఎందుకు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రజల దృష్టిని మరల్చేందుకే వాకాటిని టీడీపీ సస్పెండ్ చేసిందని ఆరోపించారు. గంటా శ్రీనివాసరావు, సీఎం రమేశ్, రాయపాటి సాంబశిరావులపై కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సుజనా చౌదరి వేల కోట్ల రూపాయలు ఎగ్గొడితే ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.
వాకాటిపై ఆరోపణల గురించి ముందే చెప్పామని, అయినా టికెట్ ఇచ్చి కోట్లు ఖర్చు చేశారని దుయ్యబట్టారు. అక్రమ కేసులతో ప్రజాప్రతినిధులను భయపెట్టిన ఘనత చంద్రబాబుదని చెప్పారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. సీబీఐ దర్యాప్తు చేయించుకుని క్లీన్‌చిట్ తెచ్చుకునే ధైర్యం ఉందా అని నిలదీశారు. చంద్రబాబు చుట్టూ వందల మంది విజయ్ మాల్యాలు ఉన్నారని విమర్శించారు. టీడీపీలో ఆర్థిక నేరాలకు పాల్పడిన వారిని సస్పెండ్ చేయాలని కాకాని డిమాండ్ చేశారు.