దటీజ్‌ వైఎస్‌ జగన్‌.. | Kalishavali Shaik Special Story On YS Jagan Mohan Reddys Padayatra | Sakshi
Sakshi News home page

దటీజ్‌ వైఎస్‌ జగన్‌..

Published Sun, Jul 8 2018 10:06 AM | Last Updated on Thu, Jul 26 2018 7:17 PM

Kalishavali Shaik Special Story On YS Jagan Mohan Reddys Padayatra - Sakshi

తొలి అడుగు పడింది మొదలు అదే ఆత్మస్థైర్యం 2500 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తిచేసుకున్నా అదే ఆత్మవిశ్వాసం.. వేల గ్రామాలు తిరిగినా.. లక్షల మంది జనం వచ్చి కలుస్తున్నా.. అదే ఉత్సాహం.., ఊపిరి సలపని షెడ్యూల్‌లోనూ అలసట లేదు.. కోట్ల మంది సమస్యలు విన్నా విసుగు లేదు.., ఎండల్లోనూ, వానల్లోనూ.. వణికించే చలిలోనూ షెడ్యూల్‌ మారలేదు.. కలుస్తానన్న జనాన్ని మరువలేదు. ప్రజా సమస్యలపైన.. పేదల పక్షాన..  ఉద్యోగ భద్రత కోసం.. నిరుద్యోగుల భవితవ్యం కోసం.. రైతుల కన్నీళ్లు తుడవడమే లక్ష్యంగా.. డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు అండగా ప్రభుత్వంపై చేస్తున్న పోరాటం ఆపలేదు. విమర్శలకు బెదరలేదు.. అధికారానికి లొంగలేదు.. ఎమ్మెల్యేలు పార్టీ వీడారని కుంగలేదు. ఆకతాయి విమర్శలకు తొణకలేదు. 

ఇడుపుల‌పాయ నుంచి జననేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నవంబర్‌ 6, 2017న ప్రజాసంకల్పయాత్ర  చేపట్టి ఇప్పటికే ఎనిమిది నెలలు పూర్తయింది. పార్టీ ప్లీనరీలో ప్రకటించిన తేదీలో మార్పు జరిగింది కానీ.. ఎన్ని అడ్డంకులు  ఎదురైనా పాదయాత్ర జరగడం మాత్రం ఆగలేదు. ఆరు నెలలపాటు 13 జిల్లాల్లో 3 వేల కిలోమీటర్లు 125 నియోజకవర్గాల్లో నిర్వహించాలని నిర్ణయించిన పాదయాత్ర పది జిల్లాలైనా పూర్తి కాకుండానే 2500 కిలోమీటర్ల మైలురాయిని అందుకుంది. ఆరు నెలల్లో పూర్తి చేయాలనుకున్నత‌ర‌లివ‌స్తున్న జ‌న‌సందోహం కార‌ణంగా ఎనిమిది నెలలు పూర్తయింది. రెండొందల రోజులుగా న‌డిచొస్తున్న జన సునామీని ఆప్యాయతగా పలకరిస్తూ జననేత ప్రజా ఊరేగింపు కొనసాగిస్తున్నారు.

పది జిల్లాల్లో 95 నియోజకవర్గాల్లో కోట్ల మందిని స్వయంగా కలిశాడు. త‌న తండ్రి రాజ‌న్న ఇచ్చిన కుటుంబంలోని స‌భ్యుల‌ను పేరుపేరునా ప‌లుక‌రిస్తూ ముందుకు సాగుతున్నారు. వంద‌లాది మండలాల్లో.. వేలాది గ్రామాల్లో  లక్షల మంది సమస్యలను నేరుగా విన్నాడు. అవసరమైన వాటిపై తక్షణమే స్పందించారు. కుదిరిన వాటిని అప్పటికప్పుడే పరిష్కరించారు. కుదరని వాటికి హామీలిచ్చారు. సుదీర్ఘంగా పరిష్కారానికి నోచుకోని సమస్యలను అధికారం చేపట్టాక పూర్తిచేస్తానని ప్రణాళికలు రచించారు. తన దృష్టికొచ్చిన.. తను వినవచ్చిన.. ఏ సమస్యనూ వదల్లేదు. సుదీర్ఘ ప్రయాణంలో ప్రజా సమస్యల పరిష్కారమే ఊపిరిగా ముందుకు సాగారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను నేరుగా తెలుసుకునేందుకు క‌ల్పించుకున్న ఈ అవ‌కాశాన్ని అనుకూలంగా మ‌లుచుకుంటూ అధికార పీఠానికి చేరువ అవుతున్నారు. ఈ వెనకడుగు వేయని ధైర్యం.. వెన్ను చూపని తత్వమే అధికార టీడీపీకి నచ్చలేదు. ఎలాగైనా లొంగదీసుకోవాలని చేయని కుట్ర లేదు.

పాదయాత్రపై అడుగడుగునా కుట్రలు 
జగన్‌ పాదయాత్రపై ఎదురుదాడి చేయండి.. డ్రోన్‌ కెమెరాలు మోహరించి జగన్‌ను కలిసే నాయకులు.. ఆయన సభలకు వస్తున్న జనాలపై నిఘా పెట్టండి.. బ్రిడ్జిలపై పాదయాత్రకు వచ్చినప్పుడు అనుమతులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టండి.. శుక్రవారం కోర్టులకు వెళతాడని ప్రచారం చేయండి.. పాదయాత్రకు విరామం ప్రకటించిన రోజున మన మీడియాను అలెర్ట్‌ చేయండి.. లోటస్‌పాండ్‌లో ఎంజాయ్‌ చేస్తున్నాడని టీవీలు, పేపర్లు హోరెత్తించండి.. జగన్‌ పాదయాత్రకు వెళ్తున్న ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి పనులు మొదలు పెట్టండి.. రాయలసీమకు నీళ్లొదలండి.. పోలవరానికి రిబ్బన్‌ కటింగ్‌ ఏర్పాట్లు చేయండి.. నిరుద్యోగ భృతి ఇస్తున్నామని ప్రెస్‌ మీట్‌ పెట్టి చెప్పండి.. ఇలా ఎక్క‌డిక‌క్క‌డ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పాద‌యాత్ర‌కు అడ్డంకులు సృష్టించాల‌ని అధికార పార్టీ చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. ఎదురుకాని స‌వాల్ లేదు. 

మీడియాను అడ్డం పెట్టుకుని దుష్ప్రచారం
ప్రజాసంకల్పయాత్రకు ఇడుపులపాయలో తొలి అడుగు పడింది మొదలు.. 10 జిల్లాలు పూర్తవుతున్నా.. 2500 కిలోమీటర్లు నడిచినా.. జననేత వైఎస్‌ జగన్‌పై విమర్శలు దాడి ఆగలేదు. చంద్రబాబు సహా టీడీపీ నాయకులు ఆయన పాదయాత్రకు అడ్డంకులు సృష్టించడం మానలేదు. వదంతులు సృష్టిస్తూనే ఉన్నారు. అసత్య ప్రచారాలు చేస్తున్నారు. డబ్బులు గుమ్మరించి వైఎస్సాఆర్‌సీపీ ఎమ్మెల్యేలను కొని టీడీపీలో చేర్చుకుని ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసే వస్తున్నారని ప్రచారం చేసి మానసికంగా వైఎస్‌ జగన్‌ను, పార్టీ కేడర్‌ను నిరుత్సాహానికి గురిచేయాలని చూశారు. అక్రమాస్తులు, పనామా పేపర్లు అంటూ ఇంగ్లిషు పత్రికల్లో కథనాలు రాయించి.. ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం అంటూ తెలుగు పత్రికల్లో  సొంత బాణీ వినిపించారు. జగన్‌ మీద విషం కక్కి మానసికంగా కుంగదీయాలని ప్రయత్నించారు. బీజేపీతో కలిసి అధికారం పంచుకుంటూనే వైయస్‌ఆర్‌సీపీ బీజేపీతో  జట్టు కడుతున్నదంటూ అనైతిక ప్రచారానికీ వెనకాడలేదు. ఒక మనిషి సహనాన్ని దెబ్బతీయడానికి అందుబాటులో ఉన్న అరువు తెచ్చుకున్న ఏ మార్గాన్ని చంద్రబాబు అండ్‌ కో వదిలిపెట్టలేదు.

ఎంతమంది ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజా సమస్యలే పరిష్కారమే ధ్యేయంగా ఒక దృఢ సంకల్పంతో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సాగిస్తున్న పాదయాత్రకు జనం అడుగడుగునా హారతులు పట్టి నీరాజనాలు పడుతున్నారు. విచిత్రంగా వైఎస్సార్‌సీపీకి ప్రాతినిథ్యంలేని, ఎమ్మెల్యేలు పార్టీలు మారిన ప్రాంతాల్లో వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి అధికార పార్టీ నాయకులు నోరళ్లబెట్టారు. పార్టీ ఫిరాయించి మంత్రి పదవులు చేపట్టిన అమర్నాథ్‌రెడ్డి, భూమా అఖిల ప్రియ, ఆది నారాయణరెడ్డిలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు ఎన్ని బెదిరింపులకు దిగినా పాదయాత్రకు తరలివచ్చిన ప్రజా సునామీని ఆపలేకపోయారు. అంత సుదీర్ఘ పాదయాత్ర జగన్‌ చేయగలడా అని మాట్లాడిన విమర్శకుల నోటివెంటే దటీజ్‌ వైఎస్‌ జగన్‌ అనిపించుకున్నారు. 

షేక్ కాలీషావ‌లి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement