వెంకయ్య నోట చంద్రబాబు మాట: కవిత
హైదరాబాద్: తెలంగాణ బిల్లును ఆమోదించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను స్వాగతిస్తున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. బిల్లులో తెలంగాణకు వ్యతిరేకంగా చాలా అంశాలున్నాయని తెలిపారు. హైదారాబాద్‌లో గవర్నర్ పాలన పెట్టడం సరికాదన్నారు. జనాభా ప్రాతిపదికన కాకుండా ఖర్చును బట్టి అప్పులు పంచాలని సూచించారు. విద్యాఉపాధి అవకాశాల్లో పదేళ్లపాటు రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని చెప్పారు. టెన్త్ సర్టిఫికెట్ నేటివిటి ఆధారంగానే ఉద్యోగులకు ఫించన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సీమాంధ్రకు ప్రత్యేకంగా హైకోర్టు ఏర్పాటు చేయాలన్నారు. పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలపడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు కవిత చెప్పారు. పోలవరం ప్రాజెక్టును ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లు వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. ఆ రెండు రాష్ట్రాల సీఎంలను కలిసి పార్లమెంట్‌లో పోలవరం డిజైన్ మార్పుకు పట్టుబట్టాలని కోరతామన్నారు. కృష్ణా, గోదావరి జలాల పంపకంపై వాటర్ బోర్డు పెట్టడం వింతగా ఉందన్నారు. చంద్రబాబు మాట వెంకయ్యనాయుడి నోట వస్తోందని కవిత అన్నారు.