కడప కార్పొరేషన్: ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన బినామీలు కటకటాలపాలుగాక తప్పదని వైఎస్‌ఆర్‌సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్‌బాబు, కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి హెచ్చరించారు. శనివారం కడపలోని వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఏం జరిగినా దాన్ని వైఎస్ జగన్‌కు ముడిపెట్టి మాట్లాడటం టీడీపీ వారికి ఫ్యాషనైపోయిందన్నారు. కేంద్రం నుంచి నిధులు రాకపోతే వైఎస్ జగన్ అడ్డుకుంటున్నారని ప్రచారం చేశారని, ఇప్పుడు ఐటీ దాడులు జరుగుతుంటే జగన్ కుట్ర ఉందని చెప్పడం హాస్యాస్పదమన్నారు.
తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రికి బినామీలు చాలా మంది ఉన్నారని, వారందరిపై ఐటీ దాడులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. 1988–87 మధ్య కాలంలో సీఎం రమేష్ అబ్బ సారాయి కొట్టు నడుపుతూ హత్య కేసులో ఇరుక్కొని జలగం వెంగల్‌రావ్ ద్వారా బయటపడ్డారన్నారు. అనేక మందితో వ్యాపార భాగస్వామ్యం నడిపి అందరినీ మోసం చేశారన్నారు. కానుగచెట్టు నుంచి నూనె తీస్తామని, పెద్ద ఫ్యాక్టరీ పెడుతున్నామని పబ్లిక్ ఇష్యూ చేసి ప్రజల దగ్గర వందలకోట్లు వసూలు చేశారన్నారు. 2014కు ముందు రూ.50కోట్ల పనులు మాత్రమే చేసే రిత్విక్ కంపెనీ టీడీపీ ప్రభుత్వం వచ్చిన నాలుగున్నరేళ్లలో రూ.3,550కోట్ల పనులు చేయడం ఆశ్చర్యకరమన్నారు. అత్యవసరం కింద 61సీ జీఓ తెచ్చి ప్రాజెక్టుల పనులన్నీ అంచనాలు పెంచి నామినేషన్‌పై చేశారన్నారు.
జిల్లాలో గండికోట, అవుకు టన్నెల్, జీఎన్‌ఎస్‌ఎస్, ఆర్‌టీపీపీలో పనులన్నీ రిత్విక్ సంస్థే చేస్తోందన్నారు. సీఎం రమేష్, సుజనా చౌదరి చేస్తున్న పనుల్లో ముఖ్యమంత్రికి 25 శాతం వాటా ఉందని ఆరోపించారు. సుజనా చౌదరి వేలకోట్లు బ్యాంకుల్లో అప్పులు తీసుకొని ఎగ్గొట్టారని గుర్తు చేశారు. ఇన్ని అక్రమాలు చేసి ప్రభుత్వానికి ఆదాయపన్ను ఎగ్గొట్టిన వీరంతా ఏనాటికైనా కటకటలపాలు కాక తప్పదని హెచ్చరించారు. ఉక్కు దీక్ష చేసినందుకే తనపై ఐటీ దాడులు చేశారని సీఎం రమేష్ చెప్పడం సిగ్గుచేటన్నారు. ఆయన చేసింది ఉక్కు దీక్ష కాదని, అది వంచన దీక్ష అని ఎద్దేవా చేశారు. 14వ ఆర్థిక సంఘానికి, ప్రత్యేక హోదాకు సంబంధమే లేదని వైఎస్ జగన్ మొదటి నుంచి చెబుతూనే ఉన్నారని, 15వ ఆర్థిక సంఘం ఛైర్మెన్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారని గుర్తు చేశారు.
దీన్నిబట్టి బీజేపీ, టీడీపీ హోదా ఇవ్వడం ఇష్టం లేకే డ్రామాలాడాయని ధ్వజమెత్తారు. బీజేపీతో వైఎస్‌ఆర్‌సీపీ కుమ్మక్కు కావాల్సిన అవసరం లేదని, అలా అయింటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. బీజేపీపై మొదటిసారి అవిశ్వాస తీర్మాణం పెట్టి, ఎంపీలతో రాజీనామాలు చేయించి బయటికి వచ్చిన ఘనత వైఎస్‌ఆర్‌సీపీదేననివారు తెలిపారు. బీజేపీతో టీడీపీ లోపాయికారీ ఒప్పందం ఇప్పటికీ కొనసాగుతోందని, అందుకే టీడీపీ వారు ఎన్ని అక్రమాలు చేస్తున్నా ఏమీ పట్టించుకోవడం లేదన్నారు. ఈ ఐటీ దాడులతో ఏం సాధిస్తారో వేచిచూడాలని అన్నారు. ఈ సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర నాయకులు తుమ్మలకుంట శివశంకర్, యానాదయ్య, నగర అధ్యక్షుడు పులి సునీల్ కుమార్, ఖదీర్ పాల్గొన్నారు.
చంద్రబాబు, లోకేష్‌లపై ఐటీ దాడులు చేయాలి
కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి
కడప కార్పొరేషన్: లక్షల కోట్లు దిగమింగిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లపై ఐటీ దాడులు నిర్వహించాలని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం వైఎస్సార్ జిల్లా కేంద్రం కడపలోని వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్‌బాబుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
గత తొమ్మిదేళ్ల పాలన తర్వాత దేశంలోని అత్యంత ధనవంతులైన రాజకీయ నాయకుల్లో చంద్రబాబు అగ్రస్థానంలో ఉన్నారని తెహల్కా డాట్ కామ్ తెలిపిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. నాలుగేళ్లపాటు బీజేపీతో అంటకాగి, మంత్రి పదవులను పంచుకున్న టీడీపీ ఇప్పుడు ఐటీ దాడులు జరిగేసరికి ఇతరులపై బురద జల్లడం సరికాదన్నారు. సీఎం రమేష్ ఇళ్లపై ఐటీ దాడులు చేస్తే వైఎస్ జగన్‌పై బురదజల్లడం సరికాదన్నారు. బీజేపీతో తమకు అంత సాన్నిహిత్యమే ఉంటే జగన్‌పై ఉన్న ఈడీ కేసులను ఉపసంహరించేవారు కదా అని ప్రశ్నించారు. సీఎం బినామీలపై ఐటీ దాడులు చేస్తుంటే దాన్ని రాష్ట్రంపైన దాడిగా అభివర్ణించడం దారుణమన్నారు. సుజనా చౌదరి ఎన్ని వేల కోట్లు అప్పులు తీసుకొని ఎన్ని బ్యాంకులను మోసం చేశారో జగమెరిగిన సత్యమేనన్నారు.
Comments
Please login to add a commentAdd a comment