కపట నాటక సూత్రధారులు! | kapata naataka sutradharulu | Sakshi
Sakshi News home page

కపట నాటక సూత్రధారులు!

Published Mon, Jun 15 2015 3:20 AM | Last Updated on Tue, Aug 14 2018 11:24 AM

kapata naataka sutradharulu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తాం. సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. జీఎన్‌ఎస్‌ఎస్, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌లకు ప్రాధాన్యత ఇస్తాం. నా సొంత నియోజకవర్గం కుప్పం కంటే ముందే పులివెందులకు నీరు ఇస్తాం. రాబోవు జులై నాటికి గండికోట, మైలవరం ప్రాజెక్టుల్లో 35 టీఎంసీల నీరు నిల్వ చేస్తాం. మెట్ట ప్రాంతాన్ని అభివృద్ధి పర్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం.
 -ఫిబ్రవరి 27న గండికోట ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు
 
 గండికోట ప్రాజెక్టుకు కృష్ణా జలాలు తీసుకువస్తాం. పులివెందులకు లిఫ్ట్ ద్వారా తీసుకె ళ్తా. అంతవరకూ నా గడ్డం తీసేది లేదు.
 -శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ ఎస్వీ సతీష్‌రెడ్డి.

సాక్షి ప్రతినిధి, కడప : అధికార పార్టీ నేతల మాటలకు అర్థాలే వేరులే అన్న చందంగా తయారయింది జిల్లాలో పరిస్థితి. ఆర్భాటపు ప్రకటనలు మినహా, ఆచరణలో అధికార పార్టీ నేతలకు చిత్తశుద్ధి లేదని విశదమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి కింది స్థాయి వరకూ ప్రజలను మభ్యపెట్టేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి హామీ ఇస్తే కరువు ప్రాంత రైతులకు ప్రాణం లేచి రావడం సహజం. జులై నాటికి గండికోట, మైలవరం రిజర్వాయర్లలో 35 టీఎంసీల నీరు నిల్వ చేస్తామని ప్రకటించిన సీఎం, తాను ఇచ్చిన హామీని నెరవేర్చడం కోసం కనీస ప్రయత్నం చేసిన దాఖలాలు లేవు.

ముంపు గ్రామాలకు ఇంతవరకు పరిహారం అందకపోవడంతో అక్కడి ప్రజలు ఖాళీ చేయలేదు. అలాగే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వర్తింపజేయలేదు. దీంతో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రకటించగానే ఇది తీరిపోయే సమస్య కాదు. ఈ నేపథ్యంలో ప్రయత్నలోపం లేకుండా చూడాల్సిన బాధ్యత పాలకులపై ఉంది. కానీ ‘ఆయన చెప్పారు...మీరు విన్నారు’ అన్నట్లుగా అటు అధికార టీడీపీ నేతలు, ఇటు యంత్రాంగం ఉండటంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా గండికోట ప్రాజెక్టు ఉండిపోయింది.

 అంతా అత్యుత్సాహం...
 గండికోట ప్రాజెక్టుకు నీరు తీసుకువస్తా. పులివెందులకు లిఫ్ట్ ద్వారా తీసుకెళ్తా. అంతవరకూ నా గడ్డం తీసేది లేదు. అంటూ శాసనమండలి డిప్యూటీ ఛెర్మైన్ సతీష్‌రెడ్డి పులివెందులలో ప్రకటించారు. ఆ త ర్వాత కడపలో జరిగిన నవ నిర్మాణ దీక్షలోనూ ఇదే శపథం చేశారు. తాజాగా ప్రాజెక్టుల సందర్శన పేరుతో అక్కడే నిద్రకు ఉపక్రమిస్తూ గండికోటకు పూర్తి స్థాయిలో నీరు తీసుకువచ్చేందుకు మరో ఏడాది పడుతుందని తెలిపారు. ఇలా ఎప్పటికప్పుడు అనుకున్నదే తడవుగా ప్రకటిస్తున్నారు.

ప్రకటన చేయడంలో ఉన్న ఉత్సాహం ఆచరణలో లేదు. పులివెందులకు లిఫ్ట్ ద్వారా ట్రయల్న్ ్రచేయాలంటే గండికోటలో 5టీఎంసీల నుంచి ఐదున్నర టీఎంసీల నీరు నిల్వ ఉండాలి. అప్పుడే లిఫ్ట్ సాధ్యమవుతుంది. ఆ స్థాయిలో నీరు నిల్వ చేయాలంటే తక్షణమే నాలుగైదు ముంపు గ్రామాలు ఖాళీ చేయకతప్పదు. ఆయా గ్రామాలు ఖాళీ చేయాలంటే వారికి రూ.18 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకూ పరిహారం అందించాలి. ఆర్ అండ్ ఆర్ పునరావాస కార్యక్రమం సైతం నిధులు లేక నీరసించిపోయింది.

ఐదున్నర టీఎంసీల నీరు నిల్వ చేయాలంటే తక్షణం పరిహారం కింద సుమారు రూ.25కోట్లు కేటాయించి గ్రామాలు ఖాళీ చేయిస్తే, నీరు నిల్వ చేసుకునే అవకాశం ఉంది. ఇవన్నీ సత్వరమే చేపట్టాలంటే ప్రభుత్వ సహకారంతోనే సాధ్యం. ఆ దిశగా ప్రయత్నాలు చేసినట్లు కన్పించలేదు. వాస్తవాలను విస్మరించి ప్రజలను మభ్యపెట్టేందుకు గాలికబుర్లతో కాలక్షేపం చేస్తే ప్రజలకు ఒరిగేదేమీ లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో జులై నాటికి 35 టీఎంసీల నీరు నిల్వ చేస్తామని ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లు ముఖ్యమంత్రిపై ఒత్తిడి తీసుకొచ్చి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే గాక జిల్లా అభివృద్ధికి తోడ్పడిన వారవుతారు. లేదంటే వీరు కూడా కపట నాటకసూత్రధారులకు వంతపాడిన వారే అవుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement