Mailavaram reservoir
-
నేడు పెన్నాకు నీరు విడుదల
సాక్షి, జమ్మలమడుగు(కడప) : మైలవరం జలాశయం నుంచి పెన్నానదిలోకి రెండు టీఎంసీల నీరు విడుదల చేయడం కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే రెండున్నర టీఎంసీల పైన నీరు ఉండగా, మంగళవారం రాత్రికి మూడు టీఎంసీలకు చేరుకుంటుంది. ముందుగా గండికోట జలాశయం నుంచి మైలవరంలోకి ఇరిగేషన్ అధికారులు కేవలం 500 క్యూసెక్కుల నీటిని వదిలారు. తర్వాత 1500 క్యూసెక్కులు విడుదల చేశారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సెప్టెంబర్ 1 నుంచి మైలవరం గేట్లు ఎత్తి పెన్నానదిలోకి నీటిని విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే అధికారులు ఆ స్థాయిలో గండికోట నుంచి మైలవరం జలాశయంలోకి నీరు విడుదల చేయలేదు. ఇరిగేషన్ అధికారులు తమపై పక్షపాతం చూపుతున్నారని రెండు రోజుల్లో మైలవరం నుంచి పెన్నానదిలోకి విడుదల చేయకపోతే ఇరిగేషన్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. దీంతో అధికారులు రోజుకు 1500 క్యూసెక్కుల వచ్చే నీటిని 5000 క్యూసెక్కులకు పెంచేశారు. నాలుగు రోజుల నుంచి పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరుతుంది. రెండు గేట్ల ద్వారా.. మైలవరం జలాశయం నుంచి పెన్నానదిలోకి రెండు టీఎంసీల నీటిని విడుదల చేయబోతున్నారు. రెండు గేట్ల ద్వారా ప్రతిరోజు 1000 క్యూసెక్కుల నీటిని పెన్నానదిలో నీటిని విడుదల చేసి భూగర్భజలాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల మున్సిపాలిటీ ప్రజలకు తాగునీటి సమస్య తీరుతుంది. అంతే కాకుండా జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, కమలాపురం మండలాల్లోని గ్రామాల్లో భూగర్భజలాలు పెరిగి తాగునీటితో పాటు రైతుల బోర్లకు నీరు అందే అవకాశం ఉంది. 6.5 టీఎంసీల నిల్వకు ప్రయత్నాలు.. మైలవరం రిజర్వాయర్ కింద ఉన్న ఆయకట్టు రైతులకు, తాగునీరు, ఆర్టీపీపీలకు నీరు అందించే విధంగా జలాశయంలో దాదాపు 6.5 టీఎంసీల నీటిని నిల్వ ఉంచే విధంగా అధికారులు సిద్ధమవుతున్నారు. మైలవరం జలాశయం మొత్తం సామర్థ్యం 9.5 టీఎంసీలు అయితే ప్రస్తుతం 6.5 టీఎంసీల నీటిని నిల్వ ఉంచాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నీటిని విడుదల చేయనున్న ఎంపీ, ఎమ్మెల్యేలు.. మైలవరం జలాశయం నుంచి బుధవారం ఉద యం పది గంటలకు నీటిని విడుదల చేయాలని ఇరిగేషన్ అధికారులు ఏర్పాటు చేశారు. మంగళవారం సాయంత్రమే విడుదల చేయాల్సి ఉన్నా పూర్తి స్థాయిలో నీరు వచ్చి చేరకపోవడంతో కార్యక్రమాన్ని బుధవారం ఉదయానికి వాయిదా వేశా రు. నీటి విడుదలకు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి హాజరవుతున్నట్లు సమాచారం. ఇబ్బందులు లేకుండా చర్యలు.. మైలవరం జలాశయం నుంచి రెండు టీఎంసీల నీటిని పెన్నానదిలోకి వదలి భూగర్భజలాలు పెరిగి భవిష్యత్తులో తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా బుధవారం ఉదయం మైలవరం జలాశయం గేట్లను ఎత్తి పెన్నానదిలోకి విడుదల చేయబోతున్నాం. కార్యక్రమానికి ప్రజాప్రతినిధులతో పాటు ఉన్నతాధికారులు వస్తున్నారు. – గౌతమ్‌రెడ్డి, మైలవరం ఇరిగేషన్ ఏఈ -
కపట నాటక సూత్రధారులు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తాం. సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. జీఎన్ఎస్ఎస్, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌లకు ప్రాధాన్యత ఇస్తాం. నా సొంత నియోజకవర్గం కుప్పం కంటే ముందే పులివెందులకు నీరు ఇస్తాం. రాబోవు జులై నాటికి గండికోట, మైలవరం ప్రాజెక్టుల్లో 35 టీఎంసీల నీరు నిల్వ చేస్తాం. మెట్ట ప్రాంతాన్ని అభివృద్ధి పర్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం. -ఫిబ్రవరి 27న గండికోట ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గండికోట ప్రాజెక్టుకు కృష్ణా జలాలు తీసుకువస్తాం. పులివెందులకు లిఫ్ట్ ద్వారా తీసుకె ళ్తా. అంతవరకూ నా గడ్డం తీసేది లేదు. -శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ ఎస్వీ సతీష్‌రెడ్డి. సాక్షి ప్రతినిధి, కడప : అధికార పార్టీ నేతల మాటలకు అర్థాలే వేరులే అన్న చందంగా తయారయింది జిల్లాలో పరిస్థితి. ఆర్భాటపు ప్రకటనలు మినహా, ఆచరణలో అధికార పార్టీ నేతలకు చిత్తశుద్ధి లేదని విశదమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి కింది స్థాయి వరకూ ప్రజలను మభ్యపెట్టేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి హామీ ఇస్తే కరువు ప్రాంత రైతులకు ప్రాణం లేచి రావడం సహజం. జులై నాటికి గండికోట, మైలవరం రిజర్వాయర్లలో 35 టీఎంసీల నీరు నిల్వ చేస్తామని ప్రకటించిన సీఎం, తాను ఇచ్చిన హామీని నెరవేర్చడం కోసం కనీస ప్రయత్నం చేసిన దాఖలాలు లేవు. ముంపు గ్రామాలకు ఇంతవరకు పరిహారం అందకపోవడంతో అక్కడి ప్రజలు ఖాళీ చేయలేదు. అలాగే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వర్తింపజేయలేదు. దీంతో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రకటించగానే ఇది తీరిపోయే సమస్య కాదు. ఈ నేపథ్యంలో ప్రయత్నలోపం లేకుండా చూడాల్సిన బాధ్యత పాలకులపై ఉంది. కానీ ‘ఆయన చెప్పారు...మీరు విన్నారు’ అన్నట్లుగా అటు అధికార టీడీపీ నేతలు, ఇటు యంత్రాంగం ఉండటంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా గండికోట ప్రాజెక్టు ఉండిపోయింది. అంతా అత్యుత్సాహం... గండికోట ప్రాజెక్టుకు నీరు తీసుకువస్తా. పులివెందులకు లిఫ్ట్ ద్వారా తీసుకెళ్తా. అంతవరకూ నా గడ్డం తీసేది లేదు. అంటూ శాసనమండలి డిప్యూటీ ఛెర్మైన్ సతీష్‌రెడ్డి పులివెందులలో ప్రకటించారు. ఆ త ర్వాత కడపలో జరిగిన నవ నిర్మాణ దీక్షలోనూ ఇదే శపథం చేశారు. తాజాగా ప్రాజెక్టుల సందర్శన పేరుతో అక్కడే నిద్రకు ఉపక్రమిస్తూ గండికోటకు పూర్తి స్థాయిలో నీరు తీసుకువచ్చేందుకు మరో ఏడాది పడుతుందని తెలిపారు. ఇలా ఎప్పటికప్పుడు అనుకున్నదే తడవుగా ప్రకటిస్తున్నారు. ప్రకటన చేయడంలో ఉన్న ఉత్సాహం ఆచరణలో లేదు. పులివెందులకు లిఫ్ట్ ద్వారా ట్రయల్న్ ్రచేయాలంటే గండికోటలో 5టీఎంసీల నుంచి ఐదున్నర టీఎంసీల నీరు నిల్వ ఉండాలి. అప్పుడే లిఫ్ట్ సాధ్యమవుతుంది. ఆ స్థాయిలో నీరు నిల్వ చేయాలంటే తక్షణమే నాలుగైదు ముంపు గ్రామాలు ఖాళీ చేయకతప్పదు. ఆయా గ్రామాలు ఖాళీ చేయాలంటే వారికి రూ.18 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకూ పరిహారం అందించాలి. ఆర్ అండ్ ఆర్ పునరావాస కార్యక్రమం సైతం నిధులు లేక నీరసించిపోయింది. ఐదున్నర టీఎంసీల నీరు నిల్వ చేయాలంటే తక్షణం పరిహారం కింద సుమారు రూ.25కోట్లు కేటాయించి గ్రామాలు ఖాళీ చేయిస్తే, నీరు నిల్వ చేసుకునే అవకాశం ఉంది. ఇవన్నీ సత్వరమే చేపట్టాలంటే ప్రభుత్వ సహకారంతోనే సాధ్యం. ఆ దిశగా ప్రయత్నాలు చేసినట్లు కన్పించలేదు. వాస్తవాలను విస్మరించి ప్రజలను మభ్యపెట్టేందుకు గాలికబుర్లతో కాలక్షేపం చేస్తే ప్రజలకు ఒరిగేదేమీ లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో జులై నాటికి 35 టీఎంసీల నీరు నిల్వ చేస్తామని ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లు ముఖ్యమంత్రిపై ఒత్తిడి తీసుకొచ్చి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే గాక జిల్లా అభివృద్ధికి తోడ్పడిన వారవుతారు. లేదంటే వీరు కూడా కపట నాటకసూత్రధారులకు వంతపాడిన వారే అవుతారు. -
కృష్ణమ్మా.. రావమ్మా
సాక్షి, కడప: జిల్లాలోని మైలవరం రిజర్వాయర్‌కు కృష్ణా జలాలను తీసుకొచ్చేందుకు కలెక్టర్ కేవీ రమణ కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే పోతిరెడ్డిపాడు ద్వారా అవుకు రిజర్వార్‌కు కృష్ణా జలాలను తీసుకొచ్చి అక్కడి నుంచి ఐదు టీఎంసీల నీటిని గండికోట ప్రాజెక్టుకు తీసుకొస్తున్నారు. అయితే మైలవరం ప్రాజెక్టుకు తుంగభద్ర జలాలు రాక ప్రతి ఏడాది ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు. మైలవరం రిజర్వాయర్‌కు తుంగభద్ర నుంచి 4 టీఎంసీల నీటి కోటా ఉది. ఈ నీరు మిడ్ పెన్నార్ రిజర్వాయర్ నుంచి 150 కిలోమీటర్లు హై లెవెల్ కెనాల్ ద్వారా కొంతదూరం ప్రయాణించి ఆ తర్వాత పెన్నానదిలో ప్రవహించిన అనంతరమే మైలవరం చేరాల్సి ఉంటుంది. దీంతో తుంగభద్ర నుంచి ఎప్పుడు కూడా మైలవరానికి సక్రమంగా నీరు వచ్చిన దాఖలాలు లేవు. పైగా పెన్నానది ఎండిపోయి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో నీరు రావడం గగనమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో మైలవరం రిజర్వాయర్‌పై ఆధారపడి ఉన్న ప్రొద్దుటూరు, జమ్మలమడుగు మున్సిపాలిటీ ప్రజలతోపాటు మైలవరం మండల ప్రజలకు తాగునీరు అందించాలంటే కచ్చితంగా కృష్ణా జలాల అవసరముందని ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి సోమవారం పంపించారు. గతంలో కూడా రెండుమార్లు జలాలు మైలవరం రిజర్వాయర్‌కు గతంలో కూడా రెండుసార్లు శ్రీశైలం ప్రాజెక్టు రైట్ బ్రాంచ్ కెనాల్ ద్వారా కృష్ణా జలాలు వచ్చినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తాగునీటి సమస్య ఏర్పడకుండా ముందుజాగ్రత్తగా కృష్ణా జలాల అవసరాన్ని అధికారులు గుర్తించారు. కనీసం మూడు టీఎంసీల నీటిని విడుదల చేస్తే సమస్య లేకుండా పోతుందని భావిస్తున్నారు. సాగునీరు దేవుడెరుగు మొదటి విడతగా తాగునీటిని తెచ్చుకుంటే చాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే గండికోట ప్రాజెక్టుకు ఐదు టీఎంసీల నీటిని కేటాయించిన నేపథ్యంలో వాటితో సంబంధం లేకుండా మైలవరానికి తుంగభద్ర జలాలకు బదులు కృష్ణా జలాలు అందించాలని అధికారులు కోరుతున్నారు. అయితే ఇప్పటివరకు తుంగభద్ర కోటా కింద మైలవరానికి వచ్చే నీరు ప్రతిసారి పెన్నానదిలో ఇంకిపోతూ అనంతపురం జిల్లా ప్రజలకు అంతో ఇంతో లాభం చేకూరేది. తద్వారా అక్కడి ప్రజలకు బోరుబావులు రీఛార్జి కావడంతో పాటు, తాగునీటి సమస్య కూడా సమీప గ్రామాల్లో లేకుండా వస్తోంది. అయితే అనవసరంగా మైలవరం కోటా నీరు వృథా కాకుండా కలెక్టర్ కేవీ రమణ తుంగభద్ర జలాల బదులు కృష్ణా జలాలు తీసుకు రావాలని సంకల్పించడం మంచి నిర్ణయమే. కలెక్టర్ కేవీ రమణతో చర్చించిన ఇన్‌ఛార్జి ఈఈ రాజశేఖర్ పులివెందుల బ్రాంచ్ కెనాల్ ఈఈగా పనిచేస్తూ మైలవరం ప్రాజెక్టు ఇన్‌ఛార్జి ఈఈగా పనిచేస్తున్న రాజశేఖర్‌తో జిల్లా కలెక్టర్ కేవీ రమణ సోమవారం ప్రత్యేకంగా చర్చించారు. ప్రధానంగా తుంగభద్ర నుంచి మైలవరానికి వచ్చే నీటి కోటా విషయంతోపాటు కృష్ణా జలాల విషయమై కూడా వారిరువురు మాట్లాడుకున్నారు. మైలవరానికి కృష్ణా జలాలు మూడు టీఎంసీలు అవసరమని కలెక్టర్ కేవీ రమణ ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాతనే ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు.