కృష్ణమ్మా.. రావమ్మా
సాక్షి, కడప: జిల్లాలోని మైలవరం రిజర్వాయర్‌కు కృష్ణా జలాలను తీసుకొచ్చేందుకు కలెక్టర్ కేవీ రమణ కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే పోతిరెడ్డిపాడు ద్వారా అవుకు రిజర్వార్‌కు కృష్ణా జలాలను తీసుకొచ్చి అక్కడి నుంచి ఐదు టీఎంసీల నీటిని గండికోట ప్రాజెక్టుకు తీసుకొస్తున్నారు.
అయితే మైలవరం ప్రాజెక్టుకు తుంగభద్ర జలాలు రాక ప్రతి ఏడాది ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు. మైలవరం రిజర్వాయర్‌కు తుంగభద్ర నుంచి 4 టీఎంసీల నీటి కోటా ఉది. ఈ నీరు మిడ్ పెన్నార్ రిజర్వాయర్ నుంచి 150 కిలోమీటర్లు హై లెవెల్ కెనాల్ ద్వారా కొంతదూరం ప్రయాణించి ఆ తర్వాత పెన్నానదిలో ప్రవహించిన అనంతరమే మైలవరం చేరాల్సి ఉంటుంది.
దీంతో తుంగభద్ర నుంచి ఎప్పుడు కూడా మైలవరానికి సక్రమంగా నీరు వచ్చిన దాఖలాలు లేవు. పైగా పెన్నానది ఎండిపోయి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో నీరు రావడం గగనమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో మైలవరం రిజర్వాయర్‌పై ఆధారపడి ఉన్న ప్రొద్దుటూరు, జమ్మలమడుగు మున్సిపాలిటీ ప్రజలతోపాటు మైలవరం మండల ప్రజలకు తాగునీరు అందించాలంటే కచ్చితంగా కృష్ణా జలాల అవసరముందని ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి సోమవారం పంపించారు.
గతంలో కూడా రెండుమార్లు జలాలు
మైలవరం రిజర్వాయర్‌కు గతంలో కూడా రెండుసార్లు శ్రీశైలం ప్రాజెక్టు రైట్ బ్రాంచ్ కెనాల్ ద్వారా కృష్ణా జలాలు వచ్చినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తాగునీటి సమస్య ఏర్పడకుండా ముందుజాగ్రత్తగా కృష్ణా జలాల అవసరాన్ని అధికారులు గుర్తించారు. కనీసం మూడు టీఎంసీల నీటిని విడుదల చేస్తే సమస్య లేకుండా పోతుందని భావిస్తున్నారు. సాగునీరు దేవుడెరుగు మొదటి విడతగా తాగునీటిని తెచ్చుకుంటే చాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇప్పటికే గండికోట ప్రాజెక్టుకు ఐదు టీఎంసీల నీటిని కేటాయించిన నేపథ్యంలో వాటితో సంబంధం లేకుండా మైలవరానికి తుంగభద్ర జలాలకు బదులు కృష్ణా జలాలు అందించాలని అధికారులు కోరుతున్నారు. అయితే ఇప్పటివరకు తుంగభద్ర కోటా కింద మైలవరానికి వచ్చే నీరు ప్రతిసారి పెన్నానదిలో ఇంకిపోతూ అనంతపురం జిల్లా ప్రజలకు అంతో ఇంతో లాభం చేకూరేది. తద్వారా అక్కడి ప్రజలకు బోరుబావులు రీఛార్జి కావడంతో పాటు, తాగునీటి సమస్య కూడా సమీప గ్రామాల్లో లేకుండా వస్తోంది. అయితే అనవసరంగా మైలవరం కోటా నీరు వృథా కాకుండా కలెక్టర్ కేవీ రమణ తుంగభద్ర జలాల బదులు కృష్ణా జలాలు తీసుకు రావాలని సంకల్పించడం మంచి నిర్ణయమే.
కలెక్టర్ కేవీ రమణతో చర్చించిన ఇన్‌ఛార్జి ఈఈ రాజశేఖర్
పులివెందుల బ్రాంచ్ కెనాల్ ఈఈగా పనిచేస్తూ మైలవరం ప్రాజెక్టు ఇన్‌ఛార్జి ఈఈగా పనిచేస్తున్న రాజశేఖర్‌తో జిల్లా కలెక్టర్ కేవీ రమణ సోమవారం ప్రత్యేకంగా చర్చించారు. ప్రధానంగా తుంగభద్ర నుంచి మైలవరానికి వచ్చే నీటి కోటా విషయంతోపాటు కృష్ణా జలాల విషయమై కూడా వారిరువురు మాట్లాడుకున్నారు. మైలవరానికి కృష్ణా జలాలు మూడు టీఎంసీలు అవసరమని కలెక్టర్ కేవీ రమణ ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాతనే ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు.