రాజకీయాల్లో రాజులు...కపిలేశ్వరపురం జమీందార్లు | Kapileswarapuram Zamindars Are Kings In Politics | Sakshi
Sakshi News home page

రాజకీయాల్లో రాజులు...కపిలేశ్వరపురం జమీందార్లు

Published Tue, Mar 12 2019 10:49 AM | Last Updated on Tue, Mar 12 2019 10:51 AM

Kapileswarapuram Zamindars Are Kings In Politics - Sakshi

సాక్షి, కపిలేశ్వరపురం (తూర్పు గోదావరి) : జిల్లా స్థాయి నుంచి జాతీయస్థాయి వరకూ రాజకీయాల్లో కపిలేశ్వరపురం జమీందార్లకు ప్రత్యేక స్థానం ఉంది. జమీందారు శ్రీబలుసు బుచ్చిసర్వారాయుడు, లక్ష్మీ వెంకట సుబ్బమ్మారావు దంపతుల కుమారులైన ఎస్‌బీ ప్రభాకర పట్టాభిరామారావు, ఎస్‌బీపీబీకే సత్యనారాయణరావులు కేంద్ర సహాయ మంత్రులుగా పనిచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పలు మంత్రి పదవులను చేపట్టిన కపిలేశ్వరపురం జమీందార్లు ఎన్నికల సమయాల్లో జిల్లా రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసేవారు.

స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి వాజ్పేయి పాలన వరకూ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్‌లో తమదైన చతురతను ప్రదర్శిస్తూ పలు పదవులను అలంకరించారు.   టంగుటూరి ప్రకాశం పంతులు నేతృత్వంలోని తొలి ఆంధ్రరాష్ట్ర మంత్రివర్గంలో పట్టాభిరామారావు విద్యా శాఖ మంత్రిగా పనిచేశారు. తర్వాత బెజవాడ గోపాలకృష్ణ మంత్రి వర్గంలోనూ పనిచేశారు. తరువాత కాలంలో ఢిల్లీ రాజకీయాల్లోకి ప్రవేశించి ఇందిరాగాంధీ మంత్రివర్గంలో పరిశ్రమల శాఖ, ఆర్థిక శాఖల సహాయ మంత్రిగా పనిచేశారు. ఐదవ (1971), ఆరవ (1977) , ఏడవ(1980)  లోక్‌ సభలలో సభ్యుడిగా ఉన్నారు. 1955లో తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడుగా పనిచేసిన పట్టాభిరామారావు 1953లో ఆంధ్రా యూనివర్సిటీ సెనేట్‌ సభ్యుడిగా కూడా వ్యవహరించారు. 


వాజపేయి మంత్రివర్గంలో ‘చంటిదొర’
కపిలేశ్వరపురం జమీందారు ఎస్‌బీపీబీకే సత్యనారాయణరావు కేంద్రంలో, రాష్ట్రంలో పలు కీలక పదవులు చేపట్టారు. ‘చంటిదొర’గా పిలిచే ఈయన పూర్తిపేరు శ్రీబలుసు ప్రభాకర బుచ్చికృష్ణ సత్యనారాయణరావు. 1999 ఎన్నికల్లో రాజమండ్రి పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా గెలుపొంది వాజపేయి నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో వ్యవసాయశాఖ సహాయమంత్రిగా పనిచేశారు.  బీఏ చదివిన ఆయన 1953 జూలై 8న కపిలేశ్వరపురం గ్రామ అధ్యక్షుడిగా రాజకీయ ప్రవేశం చేశారు.

ఈ పదవిలో 1959 వరకూ కొనసాగారు. తరువాత 1959 నవంబర్‌ 1న కపిలేశ్వరపురం పూర్వపు పంచాయతీ సమితి అధ్యక్షుడిగా పదవిని చేపట్టి 1964 వరకూ కొన సాగారు. 1958 నుంచి 1964 వరకూ శాసనమండలి సభ్యునిగా పనిచేశారు. అనంతరం ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్‌ స్థానం నుంచి మరో మారు ఎమ్మెల్సీగా ఎన్నికైనారు. 1964 సెప్టెంబర్‌ 11 నుంచి –1976 వరకూ తూర్పుగోదావరి జిల్లా పరిషత్‌ అధ్యక్షునిగా పనిచేశారు. తన 25 ఏట కపిలేశ్వరపురం ఉత్పత్తిదారుల, వినియోగదారుల సహకార సంఘానికి అధ్యక్షునిగా సుమారు ఇరవై ఏళ్లు పనిచేశారు. సత్యనారాయణరావు అఖిలభారత స్థాయిలో ఇండియన్‌ షుగర్‌ మిల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షునిగా పనిచేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement