'మమ్మల్ని పరారీలో ఉండమంది రాజకీయ నేతలే'
కర్నూలు : కప్పట్రాళ్ల వెంకటప్ప నాయుడు హత్యకేసులో నిందితుడు దివాకర్ నాయుడును పోలీసులు బుధవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ హత్య కేసులో డిసెంబర్ 10న 21మందికి శిక్ష విధిస్తూ ఆదోని కోర్టు తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. తీర్పు సమయంలో దివాకర్ నాయుడు కోర్టుకు హాజరు కాలేదని, దాంతో అతనిపై నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. మూడు బృందాలుగా ఏర్పడి దివాకర్ నాయుడిని కర్ణాటకలో అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.
కాగా రాజకీయ నేతలు తమని పావులుగా వాడుకున్నారని దివాకర్ నాయుడు ఆరోపించారు. 'మమ్మల్ని పరారీలో ఉండమని చెప్పింది రాజకీయ నేతలే అని, రాజకీయ నేతల కుట్రలకు మేం బలయ్యామని' ఆయన అన్నారు. 2008, మే 17న కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు వాహనాన్ని ప్రత్యర్థులు లారీతో ఢీ కొట్టి, అనంతరం ప్రత్యర్థులు బాంబులతో దాడి చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో కప్పట్రాళ్లతోపాటు ఆయన అనుచరులు 10 మంది మరణించారు.