రంగారెడ్డి జిల్లా కోర్టులు : తల్లీకూతుళ్లను హత్య చేసిన నలుగురు నిందితులకు జీవితఖైదుతో పాటు ఒక్కొక్కరికి రూ.8 వేల జరిమానా విధిస్తూ 13వ అదనపు డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి గురువారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం... మోహన్‌నగర్‌లో నివాసముండే సుశీలాదేవి, మంజురాణిలు తల్లీకూతుళ్లు. 2006లో కందుకూరు మండలం కొత్తగూడ గ్రామానికి చెందిన జంగారెడ్డికి చెందిన ఎకరం వ్యవసాయ భూమిని రూ.3.10 లక్షలకు కొనుగోలు చేశారు. ఆ భూమి కొనుగోలు విషయం జంగారెడ్డి కుమారుడు సుధాకర్‌రెడ్డికి తెలియకుండా జరిగింది. రెండేళ్ల తర్వాత సదరు భూమి విలువ కోటి రూపాయలు కావడంతో సుధాకర్‌రెడ్డి ఆ భూమి తనకు అమ్మాలంటూ సుశీలాదేవి, మంజురాణిలపై ఒత్తిడి తెచ్చాడు.
వారు ససేమిరా అనడంతో వారిని చంపి భూమిని సొంతం చేసుకోవాలని పథకం వేశాడు. ఈ క్రమంలోనే కందుకూరు తహసీల్ధార్ కార్యాలయానికి వస్తే తన తండ్రి నుంచి కొనుగోలు చేసిన ఎకరం భూమికి పట్టాదారు పాసు పుస్తకాలు ఇప్పిస్తానని సుశీలాదేవి, మంజురాణిలతో సుధాకర్‌రెడ్డి నమ్మబలికాడు. దీంతో వారు కందుకూరు వెళ్తున్నామని తమ కుమారుడు శ్రీవాత్సవకు చెప్పి 2007 ఆగస్టు 25న టాటా సుమో వాహనంలో సుధాకర్‌రెడ్డితో కలిసి వెళ్లారు. ఆ వాహనంలో సుధాకర్‌రెడ్డి మిత్రులు కమల్‌రెడ్డి, సుధాకర్, శాంతికుమార్ ఉన్నారు.
వాహనం విరాట్‌నగర్‌కు చేరుకోగానే నలుగురూ తమ వెంట తెచ్చుకున్న విద్యుత్ వైర్‌తో సుశీలాదేవి, మంజురాణిల గొంతుకు ఉరి బిగించి హతమార్చారు. తర్వాత వారి వద్ద ఉన్న బంగారు నగలు, నగదు తీసుకున్నారు. తర్వాత మృతదేహాలను టాటాసుమోలో తీసుకెళ్లి చింతపల్లి మండలం నర్సాయపల్లి శివారులో పడేశారు. కందుకూరు వెళ్లిన సుశీలాదేవి, మంజురాణిలు ఎంతకూ తిరిగి రాకపోవడంతో కుమారుడు శ్రీవాత్సవ చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసిన పోలీసులు సుధాకర్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా తానే తన స్నేహితులతో కలిసి ఇద్దరినీ హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. పోలీసులు నలుగురు నిందితులనూ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించి కోర్టులో అభియోగపత్రం నమోదు చేశారు. కేసు సాక్ష్యాధారాలను పరిశీలించిన 13వ అదనపు డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి లక్ష్మీకామేశ్వరి పైవిధంగా తీర్పు చెప్పారు.
తల్లీకూతుళ్ల హత్య కేసులో నిందితులకు జీవితఖైదు
Published Thu, Aug 20 2015 11:52 PM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
Advertisement