24 గంటలపాటు ముద్రగడ హౌస్ అరెస్ట్
కిర్లంపూడి: చలో అమరావతి పాదయాత్రకు బయల్దేరిన కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ముద్రగడ పాదయాత్రకు అనుమతి లేదని, 24 గంటల పాటు ఆయనను గృహ నిర్బంధం చేసినట్లు ఓఎస్డీ రవిశంకర్ వెల్లడించారు. కాగా అంతకు ముందు పాదయాత్రకు బయల్దేరిన ముద్రగడను ఇంటి గేటు వద్దే అడ్డుకున్న నేపథ్యంలో పోలీసులతో వాగ్వివాదం జరిగింది. గాంధీమార్గంలో పాదయాత్ర చేస్తానని ముద్రగడ ఈ సందర్భంగా పోలీసుల్ని చేతులు జోడించి వేడుకున్నారు. శాంతియుతంగా పాదయాత్ర చేస్తామని ముందే చెప్పామని, పోలీసులు ఎప్పుడు అనుమతి ఇస్తే అప్పుడే మొదలుపెడతానని ముద్రగడ తెలిపారు.
మరోవైపు ముద్రగడ ఇంటి చుట్టూ కేంద్ర బలగాలు, స్పెషల్ పార్టీ పోలీసులు మోహరించారు. కిర్లంపూడిలోకి బయట వ్యక్తులు రాకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. అలాగే పలువురు కాపు నేతలను ముందస్తుగా గృహనిర్భందం చేశారు. తూర్పు గోదావరి జిల్లాను సుమారు ఏడువేలమంది పోలీసులు దిగ్బంధం చేశారు.
జిల్లా వ్యాప్తంగా 95 చెక్‌పోస్టులు, 116 పికెట్‌లను ఏర్పాటు చేసి ఉభయ గోదావరి, కృష్ణా,గుంటూరు జిల్లాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. పలుచోట్ల షాడో పోలీసులతో నిఘా ఏర్పాటు చేశారు. ఐడీకార్డు చూపిస్తేనే కిర్లంపూడిలోకి అనుమతి ఇస్తున్నారు. ఇక ముద్రగడ పాదయాత్రకు మద్దతుగా సింహాద్రిపురంలో భారీ ర్యాలీగా బయల్దేరగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో చంద్రబాబు, పోలీసులకు వ్యతిరేకంగా ఎత్త ఎత్తున నినాదాలు చేశారు.