కాపుల సంక్షేమమే ధ్యేయం... కాపు కార్పొరేషన్‌కు ఏడాదికి రూ.2 వేల కోట్లు మంజూరు చేస్తాం.. రాయితీ రుణాలు మంజూరు చేస్తామంటూ టీడీపీ నేతలు ప్రకటనలు గుప్పించారు. ఆచరణలో తుస్సు మనిపించారు. దీనిపై కాపు సామాజిక వర్గం మండిపడుతోంది. అన్యాయం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. రూ.2 లక్షల రుణానికి బదులు రూ.40 వేలు మంజూరు చేస్తుండంపై గగ్గోలు పెడుతోంది.
శ్రీకాకుళం పాతబస్టాండ్: కాపుకార్పొరేషన్ నుంచి కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల యువతకు రూ.వేల కోట్ల రుణాలు మంజూరు చేస్తామని, ఉపాధికి ఊతమిస్తామని టీడీపీ సర్కారు ప్రకటించింది. ఆచరణలో విఫలం కావడం, రుణాలకు భారీగా కోత వేసింది. బీసీ రుణాలను గణనీయంగా తగ్గించిన ప్రభుత్వం తాజాగా 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాపు కార్పొరేషన్ రుణాలకు కూడా కోతపెట్టడంపై యువత మండిపడుతోంది. కాపు కార్పొరేషన్‌కి ఏడాదికి రూ.2 వేలు కోట్లు మంజూరు చేస్తామని టీడీపీ సర్కారు హామీ ఇచ్చింది. దీనిలో రూ.200 కోట్లు ఇస్తామని చెప్పి చివరికి రూ.వందకోట్లు మంజూరు చేసి చేతులు దులుపుకుంది.
రూ.2 లక్షలకు బదులు రూ.40 వేలు...
ఒక్కో యూనిట్ కింద యువతకు రూ.2 లక్షల రుణం మంజూరు చేయాలి. ఇందులో రూ.లక్ష రాయితీ లభిస్తుంది. అయితే, ప్రభుత్వం యూనిట్‌కు రూ.40 వేలే మంజూరు చేస్తుండడంపై యువకులు గగ్గోలు పెడుతున్నారు. ఈ రుణంతో ఎలాంటి స్వయం ఉపాధి యూనిట్‌లు నెలకొల్పలేమని వాపోతున్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి కాపుకార్పొరేషన్ రుణాలు జిల్లాకు 738 యూనిట్ల మంజూరు లక్ష్యంగా నిర్ణయించారు. దీనికోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. సుమారు 5 వేల మంది కాపు సామాజిక వర్గం యువతీయువకులు దరఖాస్తు చేశారు. రుణాలు వస్తాయి... స్వయం ఉపాధి పొందవచ్చని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఒక మోమోను జారీ చేసింది. రుణాలను 400 యూనిట్లకే పరిమితం చేసింది. బడ్జెట్‌ను సైతం కుదించారు.
-బీసీ కార్పొరేషన్ రుణాలు కూడా 2015-16 ఆర్థిక సంవత్సరానికి తొలుత 5,547 యూనిట్లు లక్ష్యంకాగా, రూ.53 కోట్టు బడ్జెట్‌ను కేటాయించారు. తర్వాత ఆ రుణాలను ఒక మెమోతో 1942 యూనిట్లకు తగ్గించారు. బడ్జెట్‌ను కూడా రూ.15 కోట్లకు కుదించారు.
కోత పెట్టడం అన్యాయం
కాపు కార్పొరేషన్ ద్వారా కాపు, బలిజ, తెలగ కులాలకు చెందిన నిరుద్యోగ, నిరుపేద యువతకు అందజేసే రుణాలకు కోత వేయడం అన్యాయం. ప్రభుత్వం చెప్పిన దానికి, చేసిన దానికి సంబంధం లేదు. టీడీపీ సర్కారు ప్రతి మాటలోనూ ప్రజలను మోసం చేస్తోంది. ఈ పథకం యూనిట్ల కుదింపుతో కాపు, తెలగ. బలిజ సామాజిక వర్గాల యువత మరోసారి నష్టపోతారు.
-రొక్కం సూర్యప్రకాశరావు, తెలగ సంఘం నాయకుడు
పారదర్శకతలేదు..
కాపు కార్పొరేషన్ రుణాల మంజూరులో పారదర్శకతలేదు. మాయ మాటలు చెప్పి, ఆ సామాజిక వర్గాలను మోసం చేస్తున్నారు. ఉద్యమాలు చేసేటప్పుడు మాట ఇచ్చి, తరువాత మాటమార్చుతున్నారు. గత ప్రభుత్వాల కంటే కాపు, తెలగ కులస్తులకు ఈ ప్రభుత్వం మరింత మోసం చేస్తోంది. ముద్రగడ దీక్షలోఉన్నప్పుడు ఇచ్చిన మాట నేడు లేదు.
-శవ్వాన ఉమామహేశ్వరి, తెలగ కుల నాయకురాలు
బీసీ రుణాల ఆశ సన్నగిల్లుతోంది..
బీసీ యువతకు అందజేసే రుణాల ఆశలు రోజురోజుకూ సన్నగిల్లుతున్నాయి. గతంతో వేలాదిమందికి ఇచ్చే రుణాలు నేడు వందల్లోకి చేరాయి. అవి కూడా ఎప్పుడు సబ్సీడీ విడుదలవుతుందో తెలియదు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి 5,542 యూనిట్లు లక్ష్యంకాగా, వాటిని 1942కి కుందించడం చాలా అన్యాయం.
-జె.ఎస్.రాజు, బీసీ యువకుడు
కాపు రుణాలకు కోత..!
Published Thu, Mar 10 2016 12:52 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement