రాయదుర్గం: ప్రశాంతతకు మారుపేరైన రాయదుర్గం నియోజకవర్గంలో టీడీపీ నాయకుల అరాచకాలు అధికమయ్యాయని, మంత్రి కాలవ శ్రీనివాసులు అండతోనే వారు పేట్రేగిపోతున్నారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కాపు రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం గూండాలు చేస్తున్న అరాచకాలకు అంతులేకుండా పోయిందన్నారు. ఇందుకు ఉదాహరణలు చింతమనేని, కేశినేని నాని లాంటివారు అహంకారంతో ప్రభుత్వ అధికారులపై దాడులు చేయడమే అన్నారు.
ధృతరాష్ట్రుడిలా వ్యవహరిస్తున్న కాలవ
రాష్ట్ర మంత్రిగా ఉన్న కాలవ శ్రీనివాసులుకు అధికారులపై చేసిన దాడులు కనబడలేదా అని కాపు ప్రశ్నించారు. జిల్లాలోని తాడిపత్రి, రాప్తాడు నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఏమి జరుగుతుందో కాలవకు కనబడకపోవడం సిగ్గుచేటన్నారు. పట్టపగలే తహసీల్దార్ కార్యాలయంతో తెలుగు తమ్ముళ్లు చేసిన హత్యలు, ఓ మహిళను విచక్షణారహితంగా అధికార పార్టీకి చెందిన ఓ ఉన్మాది చెప్పుకాలితో తన్నినా ఎందుకు స్పందించలేదని ఆగ్రహించారు. చీఫ్‌విప్‌గా, మంత్రిగా భిక్ష పెట్టిన రాయదుర్గం నియోజకవర్గంలో ఎన్నో అఘాయిత్యాలు, దౌర్జన్యాలు, రౌడీయిజం చేస్తూ తెలుగుతమ్ముళ్లు రాక్షసుల్లా వ్యవహరించినా మంత్రి నోరుమెదపకపోవడం విచారకరమన్నారు.
పల్లేపల్లిలో ఓ యువకుడిపై దాడి చేసి గాయపరిచింది టీడీపీ వారు కాదా? బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయకుండా అడ్డుకున్నది మీరు కాదా అని మంత్రిని ప్ర శ్నించారు. అధికార పార్టీకి చెందిన వాడైనా, ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి వర్గానికి చెందిన వారని మాజీ ఎంపీపీ పుష్పావతి భర్తను పోలీస్ స్టేషన్ సమీపంలో రోడ్డుపై విచక్షణారహితంగా కొట్టినా మంత్రి పట్టనట్టు వ్యవహరించలేదా అని విరుచుకుపడ్డారు.
= కాలవ ఎంపీగా ఉన్నపుడు రాయదుర్గం ప్రాంతానికి ఒరగబెటిందేమీ లేదని ఎద్దేవా చేశారు. స్థానికేతరుడైన నీ గెలుపునకు కారణమైన ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి.. నీ రాక్షసత్వంపై పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
= నియోజకవర్గంలో నీవు మంత్రి అయిన తరువాతనే నీ ‘పచ్చ సైన్యం’ గూండాల ఆగడాలు, అకృత్యాలు పెచ్చరిల్లాయి. నీవు నియోజకవర్గానికి రాకమునుపు ఇలాంటి సంస్కృతే లేదు. దుర్గం రాజకీ యాల్లో అరాచకాలకు ఆజ్యం పోసిన ఘనుడవు నీవే’ అని విమర్శించారు.
= మట్టి, ఇసుక దందాలకు పాల్పడుతూ ఇతరులపై విమర్శలు చేయడం చూస్తే ‘దొంగే .. దొంగ.. దొంగ’ అని అరిచినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. నీ అక్రమాలు, దౌర్జన్యాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో తరిమికొట్టడానికి సిద్ధంగా ఉన్నారని కాలవకు హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment