కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి జలాశయమైన తుంగభద్ర డ్యాంలో కేసీ కెనాల్ వాటాలో 4 టీఎంసీ మాత్రమే మిగిలినట్లు డ్యాం పర్యవేక్షక ఇంజనీర్ శ్రీనివాసరావు తెలిపారు.
కర్నూలు రూరల్, న్యూస్‌లైన్: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి జలాశయమైన తుంగభద్ర డ్యాంలో కేసీ కెనాల్ వాటాలో 4 టీఎంసీ మాత్రమే మిగిలినట్లు డ్యాం పర్యవేక్షక ఇంజనీర్ శ్రీనివాసరావు తెలిపారు. కేసీ కెనాల్‌కు నీటి సరఫరా నిలిపివేతతో దాదాపు 90వేల ఆయకట్టు భవిష్యత్ ప్రశ్నార్థకమవుతోంది.
ఈ నేపథ్యంలో ‘న్యూస్‌లైన్’ బుధవారం ఎస్‌ఈతో ఫోన్లో మాట్లాడగా వాస్తవ పరిస్థితిని వెల్లడించారు. 2013-14 సంవత్సరంలో టీబీ డ్యాంలోని నీటి నిల్వల నుంచి కేసీ కెనాల్‌కి 6.789 టీఎంసీలు కేటాయించారన్నారు. ఈ ఏడాది వర్షాలు బాగా కురవడంతో తుంగభద్ర నదిలో నీటి ప్రవాహం ఎక్కువ రోజులు సాగిందన్నారు. ఈ కారణంతోనే ఖరీఫ్ సీజన్‌లో కేసీకి నీటి విడుదల కోరలేదని భావిస్తున్నట్లు చెప్పారు. అయితే ఈ వాటా నీటిలో కొంత 2004 నుంచి అనంతపురం జిల్లాకు మళ్లించడం జరుగుతోందన్నారు. అందులో భాగంగా ఈ ఏడాది ఇప్పటి వరకు 2 టీఎంసీల నీరు అనంతపురం జిల్లావాసుల తాగునీటి అవసరాలకు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయన్నారు.
ఇది పోగా కేసీ వాటాలో 4.7 టీఎంసీ నీరు మాత్రమే డ్యాంలో మిగిలి ఉందన్నారు. ఈ నీటిని కేసీ ఆయకట్టుకు వదలాలని ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదన్నారు. కర్నూలు ఇరిగేషన్ సర్కిల్ ఎస్‌ఈ నాగేశ్వరరావు రైతుల ఆందోళనలను తన దృష్టికి తీసుకొచ్చారని.. అయితే అనుమతులు లేనిదే నీరు ఇవ్వలేమని ఆయనతో చెప్పామన్నారు. మిగిలిన కోటాలోనూ కొంత అనంతపురం జిల్లాకు కేటాయించే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇందులో తాగునీటికే అధిక ప్రాధాన్యం ఉంటుందన్నారు. తుంగభద్ర దిగువ కాలువల నుంచి 100 కిలోమీటర్ల వరకు చిన్న చిన్న ప్రధాన కాల్వ లైనింగ్ పనులు జరుగుతుండటంతోనే కర్ణాటక ప్రభుత్వం ఈ నెల 16 నుంచి నీరివ్వాలని ఇండెంట్ పెట్టినా అంగీకరించలేదన్నారు. అదే రోజు నుంచి ఆంధ్రా వాటా నీరు నిలుపుదల చేయాలనే అధికారుల వినతితోనే ఆ మేరకు చర్యలు చేపట్టామన్నారు. వచ్చే జనవరి 1వ తేదీ లోపు కాలువ పనులు పూర్తవుతాయని.. ఆ తర్వాత కర్ణాటక, ఆంధ్రా ప్రభుత్వాలు ఇండెంట్ పెడితే నీరిస్తామని ఆయన వెల్లడించారు.