చండ్రుగొండ, న్యూస్‌లైన్ : సంపూర్ణ తెలంగాణ కోసం పోరాడిన ఆదివాసీ బిడ్డలను ఆంధ్రలో కలిపేస్తుంటే కేసీఆర్ నోరుమెదపకపోవడం దారుణమని మహాజన సోషలిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ విమర్శించారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు చండ్రుగొండకు వచ్చిన ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఆదివాసీలను ఆంధ్రలో కలిపేస్తుంటే కేసీఆర్ మాట్లాడకపోవడమేమిటని ప్రశ్నించారు. భద్రాచలం గుడికి దారేది అన్న కేసీఆర్ భద్రాచలం డివిజన్‌లోని ఆదివాసీగూడెంల గురించి నోరుమెదపడం లేదని దుయ్యబట్టారు. ‘హైదరాబాద్ యూటీ అంటే యుద్ధమే అన్నావు.. రాయల తెలంగాణ అంటే రణమే అన్నావు.
మరీ ఆదివాసీల గ్రామాలను సీమాంధ్రులకు ఎందుకు అప్పజెప్పావో చెప్పు..’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేసీఆర్ ఆ గ్రామాలను తెలంగాణలోనే ఉంచేలా చిత్తశుద్ధితో కృషిచేయాలని హితవు పలికారు. తెలంగాణలో దొరలరాజ్యం సాగిస్తామంటే సహించేది లేదన్నారు. మూడు లక్షల మంది ఆదివాసీల తరఫున పోరాటానికి తాను కంకణం కట్టుకున్నానని, పార్టీల మెడలు వంచైనా ఉద్యమంలో భాగస్వాములను చేస్తామని అన్నారు. ఇందులో భాగంగానే ఈనెల 2న హైదరాబాద్‌లో జలదీక్ష కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. నిన్న, మొన్నటి వరకు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను ఆదర్శంగా తీసుకుంటున్నామని చెప్పిన కేసీఆర్‌కు విజయోత్సవం సందర్భంగా ఆయన గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. విలేకరుల సమావేశంలో మహాజన సోషలిస్టు పార్టీ రాష్ట్ర నాయకుడు ఎస్.కె.మదార్‌సాబ్, మండల నాయకులు చాపలమడుగు వెంకటేశ్వర్లు, సి.హెచ్.ప్రసాద్, కె.రాములు, కె.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
కేసీఆర్ స్వార్థం వల్లే ముంపు
ఇల్లెందు అర్బన్ : కేసీఆర్ స్వార్థం వల్లనే పోలవరం ముంపు ప్రాంతాల్లోని ఆదివాసీ గ్రామాలన్నీ ఆంధ్రలో విలీనం చేయాలని పాలకులు నిర్ణయించారని మంద కృష్ణమాదిగ విమర్శించారు. ఆదివాసీ గ్రామాలను ఆంధ్రలో విలీనం చేయడానికి నిరసనగా మహాజన సోషలిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఇల్లెందులోని కొత్తబస్టాండ్‌సెంటర్‌లో గల కొమురంభీమ్ విగ్రహం వద్ద నుంచి ఆదివాసీల అరణ్య రోదన సైకిల్ యాత్రను ఆయన శనివారం పారంభించారు.
ఈ సందర్భంగా మంద కృష్ణ మాట్లాడుతూ ఒకప్పుడు పోలవరం నిర్మాణానికి విదేశీ కంపెనీలు ముందుకొస్తే పోలవరం కింద ఒక్క ఆదివాసీ గ్రామాన్ని కూడా ఆంధ్రలో విలీనం చేయడానికి వీల్లేదని హెచ్చరించిన కేసీఆర్.. నేడు మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. సీమాంధ్ర పెట్టుబడిదారులతో కేసీఆర్ కుమ్మక్కై పోలవరం నిర్మాణానికి సహకరిస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు వెంనగంటి నరేష్‌మాదిగ, లంజెపల్లి శ్రీనువాస్, మేకల శ్యామ్ మాదిగ, వసంతరావు, వెంకన్న, పేర్ల మధు, గాదె వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్... నోరుమెదపవెందుకు..?
Published Sat, Mar 1 2014 2:27 AM | Last Updated on Tue, Mar 19 2019 7:01 PM
Advertisement
Advertisement