mahajana socialist party
-
కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఆందోళన: మందకృష్ణ
హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణలో దళితుడిని తొలి ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన కేసీఆర్ వాగ్దానం నేరవేర్చనందుకు నిరసనగా ఈ నెల 30 నుంచి తెలంగాణవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు మహాజన సోషలిస్టు పార్టీ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ప్రకటించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దళితులను మోసగించిన కేసీఆర్ వైఖరిని నిరసిస్తూ అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 31న దళిత విద్యావంతులు, మేధావులతో సదస్సు నిర్వహిస్తామని, జూన్ 2న అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన చేపడుతామన్నారు. కేసీఆర్ ప్రమాణ స్వీకారోత్సవం రోజును దళితులకు దుర్దినంగా భావిస్తూ ఓయూ నుంచి రాజ్‌భవన్ వరకు వెయ్యిమంది డప్పు కళాకారులతో చావు డప్పు మోగిస్తూ నిరసన ర్యాలీ చేపడతామన్నారు. ఆగస్టు 10న లక్షలాది మందితో ఆత్మగౌరవ మహాసభను నిర్వహిస్తామన్నారు. -
బీసీలను మోసం చేసిన కేసీఆర్
ఎంఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ హన్మకొండ సిటీ, న్యూస్‌లైన్ : టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీసీలను మోసం చేశాడని మహాజన సోషలిస్టు పార్టీ(ఎంఎస్పీ) అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. బుధవారం హన్మకొండలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరినపుడు బీసీ ఎమ్మెల్యేలున్నా మంత్రి పదవులివ్వలేదు.. బీసీ సంక్షేమ శాఖ ను అగ్రవర్ణాలకు కట్టబెట్టాడు.. ఇప్పుడేమో పరకాల టికెట్ మొలుగూరి బిక్షపతిని కాదని సహోదర్రెడ్డికిచ్చాడు. పార్టీ బలంగా ఉందని చెపుతున్న కేసీఆర్ బిక్షపతి గెలవడనే సాకుతో తప్పించడం సరికాదన్నారు. టీఆర్ఎస్ బలంగా లేని సమయంలో బలమైన అభ్యర్థి కొండా సురేఖపై పోటీ చేసి గెలిచినపుడు, పార్టీ బలంగా ఉండి, బలమై న ప్రత్యర్థి లేని సమయంలో బిక్షపతి ఎందుకు గెలవడని నిలదీశారు. మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి కనీసం ఇద్దరికి కూడా టికెట్ ఇవ్వలేదని, ఇచ్చిన ఒకటి కూడా టీఆర్ఎస్ గెలవదనే ఉద్ధేశంతో ఇచ్చారని ఆరోపించాడు. దళిత, గిరిజన, బీసీ, మైనారిటీలను ఏకం చేసి కేసీఆర్ వైఖరిని ఎండగట్టి తగిన గుణపాఠం చెబుతామన్నారు. పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రియాజ్ మాట్లాడుతూ ఈ ఎన్నికలు నిజమైన తెలంగాణ వాదులు, టీఆర్ఎస్ వంటి సూడో తెలంగాణవాదుల కు మధ్య జరుగుతున్నవని, విద్యార్థులు, యువకులు అలోచించి ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా మంద కృష్ణ జీవి త చరిత్ర(అన్న మనోడే)పై పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తీగల ప్రదీప్ రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. సమావేశంలో నాయకులు రఫీ, నవీద్, రాకేష్, అఫ్జల్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు -
మాది నక్సలైట్ల, అంబేద్కర్ ఎజెండా
మావోయిస్టులతో చర్చలు జరుపుతాం బాబు వూటలన్నీ అధికారం కోసమే హన్మకొండ సభలో ఎంఎస్పీ అధ్యక్షుడు మంద కృష్ణ వరంగల్, న్యూస్‌లైన్: మావోయిస్టులు, అంబేద్కర్ ఎజెండాయే మహాజన సోషలిస్ట్ పార్టీ లక్ష్యమని ఆ పార్టీ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ స్పష్టం చేశారు. తావుు అధికారంలోకి వస్తే మావోయిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేసి, బేషరతుగా చర్చలు జరుపుతామని ప్రకటించారు. హన్మకొండలో మంగళవారం రాత్రి జరిగిన ఎంఎస్పీ సింహగర్జన సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. సామాజిక న్యాయం, ఆర్థిక సమానత్వం, రాజ్యాధికారం కోసం ఎంఎస్పీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నక్సలైట్ల ఎజెండా కూడా ఇదే అరుునప్పటికీ వారు సాయుధ పోరాట మార్గాన్ని ఎంచుకున్నారని, అంబేద్కర్ రాజకీయ ప్రజాస్వామ్యం ద్వారా సాధించే మార్గాన్ని రాజ్యాంగంలో చూపెట్టారని అన్నారు. రాజకీయ ఖైదీల విడుదలపై విరసం నేత వరవరరావు టీడీపీ నేత చంద్రబాబు వద్దకు వెళ్లడం సరికాదన్నారు. నక్సలైట్లే దేశభక్తులని చెప్పిన ఎన్టీఆర్.. అధికారంలోకి రాగానే వరంగల్ జిల్లాలో మామిడాల హరిభూషణ్‌ను ఎన్కౌంటర్లో చంపలేదా? చంద్రబాబు నక్సలైట్ నేతలను వరుస ఎన్కౌంటర్లు చేయించలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు సామాజిక తెలంగాణ, బీసీ ముఖ్యమంత్రి అంటూ సీమాంధ్రలో అధికారంలోకి వచ్చేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. మాటతప్పితే బోర్డర్ దాటిస్తం ఉద్యమ సమయంలో దళితున్ని ముఖ్యమంత్రి, ముస్లింను డిప్యూటీ సీఎం చేస్తానంటూ వూట్లాడిన కేసీఆర్.. ఇప్పుడు ఆ పరిస్థితిలేదంటూ మాటమార్చే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, మైనార్టీలపై ఆధిపత్యం చెలాయించిన దొరలను గడీల నుంచి తరిమితే హైదరాబాద్ చేరుకున్నారని, ఇప్పుడు కేసీఆర్ మాటమార్చితే హైదరాబాద్ నుంచి తెలంగాణ బోర్డర్ దాటిస్తామని హెచ్చరించారు. ఈ సభకు భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. కళాకారుల ఆటాపాటలతో సభ హోరెత్తింది. -
దొంగతనం చేసి పార్టీ నడపాలా?
ఖమ్మం/నడిగూడెం: ‘ఇప్పటి వరకు బ యట ఉండి అనేక ఉద్యమాలు చేశాం.. ఇకపై చట్టసభలకు వెళ్లి అధికార, ప్రతిపక్షాలను నిలదీయాలని పార్టీ పెడి తే దాని కోసం ఒక్క రూ పాయి ఖర్చు పెట్టే నాయకుడు లేరు.. ఇలా అయితే పార్టీని బతికిం చడం ఎలా.. దొంగతనం చేయా లా..’ అని మహాజన సోషలిస్ట్ పార్టీ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కార్యకర్తలను ప్రశ్నించా రు. ఒక్కో నాయకుడు రూ.లక్ష సమకూర్చాల్సిందేనని అన్నారు. ఖమ్మంలో ఆదివారం ఆయన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ దళిత ద్రోహి టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ దళితద్రోహి అని మంద కృష్ణమాదిగ ఆరోపించారు. ఆదివారం ఆయన నల్లగొండ జిల్లా నడిగూడెంలో విలేకరులతో మాట్లాడారు. సీఎం పదవిపై ఆయన మాటమార్చి దళితులను మోసం చేశాడని విమర్శించారు. దామోదర రాజనర్సింహ సీఎం కావాల్సిన సమయంలో కేంద్రం కావాలనే రాష్ట్రపతి పాలన విధించిందన్నారు. చంద్రబాబు తెలంగాణను అడ్డుకొని, ఇప్పుడు సామాజిక తెలంగాణ అంటున్నాడని విమర్శించారు. -
దళితుడిని సీఎం చేయాలి: కృష్ణమాదిగ
హన్మకొండ, న్యూస్‌లైన్: తెలంగాణ ఏర్పాటు కానున్న క్రమంలో కేసీఆర్ వైఖరిలో మార్పు చోటు చేసుకుందని మహాజన సోషలిస్టు పార్టీ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ విమర్శించారు. బుధవారం వరంగల్ జిల్లా హన్మకొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎవరు అడగకున్నా దళితుడిని సీఎం చేస్తానని, ముస్లిం నాయకుడిని డిప్యూటీ సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్.. ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాడా స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికలలో కేసీఆర్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికలకు వెళ్తారనే ప్రచారం జరుగుతుందని, దీనిపై కేసీఆర్‌తోపాటు టీఆర్ఎస్ పార్టీ వైఖరిని వెల్లడించాలని డిమాండ్ చేశారు. గతంలో గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిన మాటలపై నిలబడాలన్నారు. బీసీలకు అన్ని రంగాలలో 50 శాతం వాటా కల్పిస్తామని చెప్పారని మంద కృష్ణ గుర్తు చేశారు. సాధారణ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన క్రమంలో ఎన్నికలపై చర్చించేందుకు గురువారం పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం హన్మకొండలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేశామన్నారు. -
కేసీఆర్‌కు పుట్టగతులుండవ్
హన్మకొండ: తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన ఆదివాసీ బిడ్డలను సీమాంధ్రులకు బలిచ్చిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు పుట్టగతులుండవని ములుగు మాజీ ఎమ్మెల్యే ధనసరి అనసూయ (సీతక్క) మండిపడ్డారు. మహాజన సోషలిస్టు పార్టీ(ఎంఎస్పీ) ఆధ్వర్యంలో ఆదివారం వరంగల్‌లో జరిగిన జలదీక్ష కార్యక్రమానికి ఆమె సంఘీభావం తెలిపారు. కాపువాడ శివారులోని భద్రకాళి చెరువు మత్తడి వద్ద ఎంఎస్పీ నేతలతో కలిసి చెరువులో దిగి దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ నెల రోజుల నుంచి రక్షించండని ఆదివాసీలు రోదిస్తున్నా కేసీఆర్‌కు వినిపించ లేదా అని ప్రశ్నించారు. పోలవరం టెండర్లు దక్కించుకున్నందుకే నేడు కేసీఆర్ ఆదివాసీలను ముంచేందుకు సిద్ధపడ్డాడని దయ్యబట్టారు. ఇప్పటికైనా ఆదివాసీల పక్షాన నిలబడకుంటే గిరిజనుల బాణాలకు బలికాక తప్పదని సీతక్క హెచ్చరించారు. ఎంఎస్పీ సమన్వయకర్త మంద కుమార్ మాట్లాడుతూ ఒక్క గ్రామాన్ని కూడా వదులు కోవడానికి సిద్ధంగా లేమని ప్రకటించిన కేసీఆర్... 200కు పైగా ఆదివాసీ గ్రామాలు పోలవరంలో మునుగుతుంటే ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. -
కేసీఆర్... నోరుమెదపవెందుకు..?
చండ్రుగొండ, న్యూస్‌లైన్ : సంపూర్ణ తెలంగాణ కోసం పోరాడిన ఆదివాసీ బిడ్డలను ఆంధ్రలో కలిపేస్తుంటే కేసీఆర్ నోరుమెదపకపోవడం దారుణమని మహాజన సోషలిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ విమర్శించారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు చండ్రుగొండకు వచ్చిన ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఆదివాసీలను ఆంధ్రలో కలిపేస్తుంటే కేసీఆర్ మాట్లాడకపోవడమేమిటని ప్రశ్నించారు. భద్రాచలం గుడికి దారేది అన్న కేసీఆర్ భద్రాచలం డివిజన్లోని ఆదివాసీగూడెంల గురించి నోరుమెదపడం లేదని దుయ్యబట్టారు. ‘హైదరాబాద్ యూటీ అంటే యుద్ధమే అన్నావు.. రాయల తెలంగాణ అంటే రణమే అన్నావు. మరీ ఆదివాసీల గ్రామాలను సీమాంధ్రులకు ఎందుకు అప్పజెప్పావో చెప్పు..’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేసీఆర్ ఆ గ్రామాలను తెలంగాణలోనే ఉంచేలా చిత్తశుద్ధితో కృషిచేయాలని హితవు పలికారు. తెలంగాణలో దొరలరాజ్యం సాగిస్తామంటే సహించేది లేదన్నారు. మూడు లక్షల మంది ఆదివాసీల తరఫున పోరాటానికి తాను కంకణం కట్టుకున్నానని, పార్టీల మెడలు వంచైనా ఉద్యమంలో భాగస్వాములను చేస్తామని అన్నారు. ఇందులో భాగంగానే ఈనెల 2న హైదరాబాద్‌లో జలదీక్ష కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. నిన్న, మొన్నటి వరకు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను ఆదర్శంగా తీసుకుంటున్నామని చెప్పిన కేసీఆర్‌కు విజయోత్సవం సందర్భంగా ఆయన గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. విలేకరుల సమావేశంలో మహాజన సోషలిస్టు పార్టీ రాష్ట్ర నాయకుడు ఎస్.కె.మదార్‌సాబ్, మండల నాయకులు చాపలమడుగు వెంకటేశ్వర్లు, సి.హెచ్.ప్రసాద్, కె.రాములు, కె.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కేసీఆర్ స్వార్థం వల్లే ముంపు ఇల్లెందు అర్బన్ : కేసీఆర్ స్వార్థం వల్లనే పోలవరం ముంపు ప్రాంతాల్లోని ఆదివాసీ గ్రామాలన్నీ ఆంధ్రలో విలీనం చేయాలని పాలకులు నిర్ణయించారని మంద కృష్ణమాదిగ విమర్శించారు. ఆదివాసీ గ్రామాలను ఆంధ్రలో విలీనం చేయడానికి నిరసనగా మహాజన సోషలిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఇల్లెందులోని కొత్తబస్టాండ్సెంటర్లో గల కొమురంభీమ్ విగ్రహం వద్ద నుంచి ఆదివాసీల అరణ్య రోదన సైకిల్ యాత్రను ఆయన శనివారం పారంభించారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాట్లాడుతూ ఒకప్పుడు పోలవరం నిర్మాణానికి విదేశీ కంపెనీలు ముందుకొస్తే పోలవరం కింద ఒక్క ఆదివాసీ గ్రామాన్ని కూడా ఆంధ్రలో విలీనం చేయడానికి వీల్లేదని హెచ్చరించిన కేసీఆర్.. నేడు మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. సీమాంధ్ర పెట్టుబడిదారులతో కేసీఆర్ కుమ్మక్కై పోలవరం నిర్మాణానికి సహకరిస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు వెంనగంటి నరేష్‌మాదిగ, లంజెపల్లి శ్రీనువాస్, మేకల శ్యామ్ మాదిగ, వసంతరావు, వెంకన్న, పేర్ల మధు, గాదె వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
కేంద్రం ఆదేశాల మేరకే సీఎం డ్రామా
నిర్మల్: తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు కేంద్రం ముఖ్యమంత్రి కిరణ్‌తో నాటకాలు ఆడిస్తోందని మహాజన సోషలిస్టు పార్టీ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పూనుకోవటం దారుణమన్నారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ పట్టణంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రం కిరణ్‌తో చేయించిన కుట్రలు, కుతంత్రాలు జూలై 30 నుంచి జనవరి 30 వరకు సాగాయని, ఇందుకు నిదర్శనమే అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన పరిణామాలని పేర్కొన్నారు. ఏదేమైనా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాక తప్పదని చెప్పారు. లోక్‌సభ, రాజ్యసభలలో ఎస్సీ, ఎస్టీలకు కల్పిస్తున్న రిజర్వేషన్ల మాదిరే శాసనమండలి, శాసనసభలలో కూడా కల్పించాలని కోరారు. ఇది లేకపోవడంతో ఎంతో మంది ఎస్సీ, ఎస్టీలు నష్టపోతున్నారని చెప్పారు. -
మహాజన సోషలిస్టు పార్టీ
కొత్త పార్టీని ప్రకటించిన మంద కృష్ణ బడుగులకు రాజ్యాధికారమే లక్ష్యమని ఉద్ఘాటన సాక్షి, హైదరాబాద్: సామాజిక న్యాయం ఎజెండాగా రాష్ట్రం లో కొత్త పార్టీ అవిర్భవించింది. ‘మహాజన సోషలిస్టు పార్టీ(ఎంఎస్పీ)’ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ శనివారం ప్రకటించారు. వికలాంగులు, మహిళలు, బడు గు, బలహీన వర్గాలకు సంపూర్ణ న్యాయం కోసమే పార్టీని నెలకొల్పుతున్నట్లు సికింద్రాబాద్‌లో నిర్వహించిన వికలాంగుల మహాసభలో చెప్పారు. ‘అంధులకు లిపి ద్వారా బ్రెయిలీ చూపును అందించారు. ఆయన జయంతి రోజున ఆవిర్భవించిన ఎంఎస్పీ ఇంతకాలం రాజ్యాధికారానికి దూరమైన కులాలకు, వర్గాలకు అధికారాన్ని అందించి వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతుంది. రాష్ట్రవ్యాప్తంగా రెండు, మూడు అగ్రకులాలే రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకుంటున్నాయి. వాటి పునాదులను పెకిలించి మా పార్టీని అదికారంలోకి తెచ్చి సామాజిక న్యాయం అందిస్తాం. దోపిడీ, వివక్ష, అసమానతలు, కుటుంబ పాలన, సామాజిక, రాజకీయ, ఆర్థిక అసమానతలు తొలగిస్తాం’ అని మందకృష్ణ పేర్కొన్నారు. బడుగులకు సీట్లేవి?: ఎస్సీల వర్గీకరణ కోసం 20 ఏళ్లుగా సాగుతున్న తమ ఉద్యమానికి మద్దతిస్తున్న అన్ని పార్టీల నాయకులు చట్టసభల్లో మాత్రం ఈ అంశాన్ని చర్చకు తేవడం లేదని మందకృష్ణ ధ్వజమెత్తారు. మెజారిటీ సభ్యులు అగ్రకులాలకు చెందిన వారు కావటం వల్లే ఇతర సామాజిక వర్గాల సమస్యలకు పరిష్కారం లభించడం లేదన్నారు. ప్రభుత్వంతోపాటు అన్ని పార్టీలూ వికలాంగులు, వృద్ధులు, మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీల సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయని విమర్శించారు. జనాభాలో 50 శాతం ఉన్న బలహీన వర్గాలకు వంద సీట్లు ఇస్తామని ప్రకటించిన పార్టీల నాయకులు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో బీసీ ఎమ్మెల్యేలకు రెండు సీట్లు కూడా కేటాయించడం లేదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు, సీపీఐ నేత నారాయణలకు చెందిన చిత్తూరు జిల్లాలో 14 శాసనసభ స్థానాలు ఉండగా మూడు ఎస్సీ స్థానాలు పోను మిగతా సెగ్మెంట్లలో ఒక్కరు కూడా బీసీ ఎమ్మెల్యే లేరని చెప్పారు. గొప్ప నేతలుగా చెప్పుకుంటున్న జానారెడ్డి, వెంకయ్యనాయుడు, రాఘవులు, కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, జైపాల్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాల నుంచి బీసీలకు రాజకీయ ప్రాతినిథ్యం కల్పించడంలో పూర్తిగా అన్యాయం జరిగిందన్నారు. సామాజికంగా అందరికీ ఉపయోగపడే 20 అంశాలపై తమ పార్టీ ఉద్యమాలు చేస్తుందని మందకృష్ణ తెలిపారు. ఎంఎస్పీ పార్టీ ఆవిర్భావ కార్యక్రమంలో వికలాంగ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు అందె రాంబాబు, నాయకులు సునీల్, భవాని, గోపాల్, రవీందర్‌లతోపాటు ఎమ్మార్పీఎస్ నాయకులు యాతాకుల భాస్కర్, వంగపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వీటి కోసమే ‘ఎంఎస్పీ’ పోరాటం ఎస్సీల వర్గీకరణ, లంబాడా తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయడం ఆదివాసీల జీవన విధానాన్ని మెరుగుపరచడం జనాభాలో 50 శాతం ఉన్న 130 కులాలకు చెందిన బీసీలకు సమాన ప్రాతినిధ్యం ముస్లింలకు రిజర్వేషన్ల అమలు దళిత క్రైస్తవులు దళిత ముస్లింలకు రిజర్వేషన్లు మహిళలకు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా ప్రాతినిధ్యం వికలాంగులకు సామాజిక న్యాయం అగ్రకులాల పేదలకు ఆర్థిక ప్రగతి ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల పదోన్నతుల్లో రిజర్వేషన్లు ప్రభుత్వ ఆసుపత్రులను పటిష్టం చేసి పేదలకు సంపూర్ణంగా ఉచిత వైద్యం వృద్ధులు వితంతువులకు రూ.1,000 పెన్షన్లు పేదలందరికీ చౌకగా నిత్యావసర వస్తువులను అందించడం పేదలకు భూ పంపిణీపై కోనేరు రంగారావు సిఫార్సుల అమలు నిరుద్యోగులకు ఉపాధి అణగారిన వర్గాల విద్యార్థులకు ఉచిత ఉన్నత విద్య కార్మిక వర్గానికి ఉద్యోగభద్రత ప్రతినిత్యం పేదలకు ఉపాధి పథకం అమలు.