
కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఆందోళన: మందకృష్ణ
హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణలో దళితుడిని తొలి ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన కేసీఆర్ వాగ్దానం నేరవేర్చనందుకు నిరసనగా ఈ నెల 30 నుంచి తెలంగాణవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు మహాజన సోషలిస్టు పార్టీ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ప్రకటించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దళితులను మోసగించిన కేసీఆర్ వైఖరిని నిరసిస్తూ అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
31న దళిత విద్యావంతులు, మేధావులతో సదస్సు నిర్వహిస్తామని, జూన్ 2న అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన చేపడుతామన్నారు. కేసీఆర్ ప్రమాణ స్వీకారోత్సవం రోజును దళితులకు దుర్దినంగా భావిస్తూ ఓయూ నుంచి రాజ్‌భవన్ వరకు వెయ్యిమంది డప్పు కళాకారులతో చావు డప్పు మోగిస్తూ నిరసన ర్యాలీ చేపడతామన్నారు. ఆగస్టు 10న లక్షలాది మందితో ఆత్మగౌరవ మహాసభను నిర్వహిస్తామన్నారు.