మహాజన సోషలిస్టు పార్టీ
కొత్త పార్టీని ప్రకటించిన మంద కృష్ణ
బడుగులకు రాజ్యాధికారమే లక్ష్యమని ఉద్ఘాటన
సాక్షి, హైదరాబాద్: సామాజిక న్యాయం ఎజెండాగా రాష్ట్రం లో కొత్త పార్టీ అవిర్భవించింది. ‘మహాజన సోషలిస్టు పార్టీ(ఎంఎస్‌పీ)’ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ శనివారం ప్రకటించారు. వికలాంగులు, మహిళలు, బడు గు, బలహీన వర్గాలకు సంపూర్ణ న్యాయం కోసమే పార్టీని నెలకొల్పుతున్నట్లు సికింద్రాబాద్‌లో నిర్వహించిన వికలాంగుల మహాసభలో చెప్పారు. ‘అంధులకు లిపి ద్వారా బ్రెయిలీ చూపును అందించారు. ఆయన జయంతి రోజున ఆవిర్భవించిన ఎంఎస్‌పీ ఇంతకాలం రాజ్యాధికారానికి దూరమైన కులాలకు, వర్గాలకు అధికారాన్ని అందించి వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతుంది. రాష్ట్రవ్యాప్తంగా రెండు, మూడు అగ్రకులాలే రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకుంటున్నాయి. వాటి పునాదులను పెకిలించి మా పార్టీని అదికారంలోకి తెచ్చి సామాజిక న్యాయం అందిస్తాం. దోపిడీ, వివక్ష, అసమానతలు, కుటుంబ పాలన, సామాజిక, రాజకీయ, ఆర్థిక అసమానతలు తొలగిస్తాం’ అని మందకృష్ణ పేర్కొన్నారు.
బడుగులకు సీట్లేవి?: ఎస్సీల వర్గీకరణ కోసం 20 ఏళ్లుగా సాగుతున్న తమ ఉద్యమానికి మద్దతిస్తున్న అన్ని పార్టీల నాయకులు చట్టసభల్లో మాత్రం ఈ అంశాన్ని చర్చకు తేవడం లేదని మందకృష్ణ ధ్వజమెత్తారు. మెజారిటీ సభ్యులు అగ్రకులాలకు చెందిన వారు కావటం వల్లే ఇతర సామాజిక వర్గాల సమస్యలకు పరిష్కారం లభించడం లేదన్నారు. ప్రభుత్వంతోపాటు అన్ని పార్టీలూ వికలాంగులు, వృద్ధులు, మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీల సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయని విమర్శించారు. జనాభాలో 50 శాతం ఉన్న బలహీన వర్గాలకు వంద సీట్లు ఇస్తామని ప్రకటించిన పార్టీల నాయకులు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో బీసీ ఎమ్మెల్యేలకు రెండు సీట్లు కూడా కేటాయించడం లేదన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు, సీపీఐ నేత నారాయణలకు చెందిన చిత్తూరు జిల్లాలో 14 శాసనసభ స్థానాలు ఉండగా మూడు ఎస్సీ స్థానాలు పోను మిగతా సెగ్మెంట్‌లలో ఒక్కరు కూడా బీసీ ఎమ్మెల్యే లేరని చెప్పారు. గొప్ప నేతలుగా చెప్పుకుంటున్న జానారెడ్డి, వెంకయ్యనాయుడు, రాఘవులు, కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, జైపాల్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాల నుంచి బీసీలకు రాజకీయ ప్రాతినిథ్యం కల్పించడంలో పూర్తిగా అన్యాయం జరిగిందన్నారు. సామాజికంగా అందరికీ ఉపయోగపడే 20 అంశాలపై తమ పార్టీ ఉద్యమాలు చేస్తుందని మందకృష్ణ తెలిపారు. ఎంఎస్‌పీ పార్టీ ఆవిర్భావ కార్యక్రమంలో వికలాంగ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు అందె రాంబాబు, నాయకులు సునీల్, భవాని, గోపాల్, రవీందర్‌లతోపాటు ఎమ్మార్పీఎస్ నాయకులు యాతాకుల భాస్కర్, వంగపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
వీటి కోసమే ‘ఎంఎస్‌పీ’ పోరాటం
ఎస్సీల వర్గీకరణ, లంబాడా తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయడం ఆదివాసీల జీవన విధానాన్ని మెరుగుపరచడం జనాభాలో 50 శాతం ఉన్న 130 కులాలకు చెందిన బీసీలకు సమాన ప్రాతినిధ్యం ముస్లింలకు రిజర్వేషన్ల అమలు దళిత క్రైస్తవులు దళిత ముస్లింలకు రిజర్వేషన్లు మహిళలకు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా ప్రాతినిధ్యం వికలాంగులకు సామాజిక న్యాయం అగ్రకులాల పేదలకు ఆర్థిక ప్రగతి ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల పదోన్నతుల్లో రిజర్వేషన్లు ప్రభుత్వ ఆసుపత్రులను పటిష్టం చేసి పేదలకు సంపూర్ణంగా ఉచిత వైద్యం వృద్ధులు వితంతువులకు రూ.1,000 పెన్షన్లు పేదలందరికీ చౌకగా నిత్యావసర వస్తువులను అందించడం పేదలకు భూ పంపిణీపై కోనేరు రంగారావు సిఫార్సుల అమలు నిరుద్యోగులకు ఉపాధి అణగారిన వర్గాల విద్యార్థులకు ఉచిత ఉన్నత విద్య కార్మిక వర్గానికి ఉద్యోగభద్రత ప్రతినిత్యం పేదలకు ఉపాధి పథకం అమలు.