విజయవాడ : ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణకు ఏమైనా జరిగితే చంద్రబాబు ప్రభుత్వమే బాధ్యత వహించాలి అని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు చెప్పారు. మంద కృష్ణను ఏపీలో అడుగుపెట్టనివ్వబోమని, అడుగుపెడితే రాళ్లతో కొట్టాలని స్వయానా మంత్రులకు ఆదేశాలిచ్చి రెండు రాష్ట్రాల మధ్య ఐక్యతను, సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు నాయుడు జాగీరా? అని ప్రశ్నించారు. మీడియా సమావేశంలో పాల్గొనేందుకు వస్తున్న మంద కృష్ణను ఇబ్రహీంపట్నం వద్ద అడ్డుకుని వెనక్కు పంపడాన్ని ఆయన తప్పుబట్టారు.
ఏపీ అభివృద్ధి కోసం కేసీఆర్ లాంటి వారి సలహాలు తీసుకుంటామనే చంద్రబాబు మంద కృష్ణను రాష్ట్రానికి రానివ్వకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. 'చంద్రబాబుకు సిగ్గు, లజ్జ, మానవత్వం లేవు. సహాయం చేసిన వారిని వెన్నుపోటు పొడిచే మనస్తత్వం. బంధువులను రాబందుల్లా పీక్కుతింటా’రని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబునాయుడు మహానాడు పెట్టుకుంటే ఎవరూ ఏపీలో ఉండకూడదా? ఇతర పార్టీలు, ప్రజా సంఘాలు కార్యక్రమాలు నిర్వహించకూడదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఇంకా రెండేళ్లే అధికారంలో ఉంటారని, టీడీపీకి ఆయనే చివరి ముఖ్యమంత్రి అన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. కృష్ణమాదిగ అరెస్ట్‌కు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
పచ్చ చొక్కా కార్యకర్తలా..
పోలీసులు పచ్చచొక్కాల కార్యకర్తల్లాగా.. లెసైన్స్‌డ్ గూండాల్లాగా వ్యవహరిస్తున్నారని మాణిక్యరావు మండిపడ్డారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు.. చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తున్నారన్నారు. చంద్రబాబునాయుడుకి కాపలాదారుల్లా మారారని దుయ్యబట్టారు. మాదిగ ప్రజాప్రతినిధులు చంద్రబాబుకు బానిసల్లా బతకొద్దన్నారు. మంత్రి రావెల కిషోర్‌బాబు వర్గీకరణే వద్దంటూ మాదిగ జాతికి ద్రోహం చేసేలా మాట్లాడుతున్నారన్నారు. భవిష్యత్తులో రావెలకు పుట్టగతులుండవన్నారు.