పరామర్శిస్తున్న మందకృష్ణ మాదిగ
ఆదిలాబాద్: అలేఖ్య అనే యువతిని పట్టపగలు నడిరోడ్డుపై హత్య చేసిన ప్రేమోన్మాది శ్రీకాంత్‌తో పాటు మిగతా నిందితులకు బెయిల్ రాకుండా చూడాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలోని అంబేద్కర్‌నగర్ కాలనీలో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఇదివరకే యువతి వివాహాన్ని చెడగొట్టిన నిందితుడు పోలీసుల సమక్షంలో మరోసారి తప్పుచేయనని ఒప్పుకొన్నప్పటికీ తిరిగి యువతిని అతి దారుణంగా హత్య చేశాడని తెలిపారు.
అలాంటి వ్యక్తి బెయిల్‌తో బయటకు వస్తే బాధిత కుటుంబానికి రక్షణ లేకుండా పోతుందని పేర్కొన్నారు. ఈ కేసు విషయంలో న్యాయవాదులతో పాటు ప్రభుత్వం నిందితుడికి బెయిల్ రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. లేనిపక్షంలో బాధిత కుటుంబానికి పరోక్షంగా మరోసారి నష్టం జరిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. సమత కేసు తరహాలో నిందితుడు జైలులో ఉన్నప్పుడే ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేపట్టి కఠిన శిక్ష పడేలా చూడాలన్నారు.
అలేఖ్య ఘటనలో ప్రభుత్వం పూర్తిస్థాయి బాధ్యత వహించి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతో పాటు తీవ్రంగా గాయపడ్డ మరో యువతిని ఆదుకునేలా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబానికి రూ.50లక్షల పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి బాధిత కుటుంబానికి అండగా నిలవాలని కోరారు. ఆయన వెంట నాయకులు నంది రామయ్య, కట్ట శ్రీనివాస్, కావలి సంతోష్, జన్నారపు శంకర్, గొర్రె గంగాధర్, నిట్ట రవి, మురళీకృష్ణ, రాజ్‌కుమార్ తదితరులున్నారు.
ఇవి చదవండి: Hyderabad: పెళ్లి పేరుతో నమ్మించి భార్యాభర్తల మోసాలు..
Comments
Please login to add a commentAdd a comment