బాధితుడు శివయ్యతో కలసి విలేకరులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి
సాక్షి, ధర్మవరం: చంద్రబాబు తన స్వార్థం కోసం ప్రజలను బలిచేసేందుకు సిద్ధమయ్యారని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఉనికి కోల్పోయిన టీడీపీని తిరిగి ప్రజల్లోకి తీసుకువచ్చేందుకే చంద్రబాబు నానా తంటాలు పడుతున్నారన్నారు. ఈ క్రమంలోనే రాజకీయ స్వార్థంతో గ్రామాల మధ్య చిచ్చుపెడుతున్నాడని, సాయం కోసం వెళ్లిన వారిని స్వార్థ రాజకీయాలకు వినియోగించి వారి పొట్టకొడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు ఎన్నికల ఫలితాల రోజున వైఎస్సార్‌సీపీ నేతల దాడిలో గాయపడినట్లు చెప్పిన బత్తలపల్లి మండలం డి.చెర్లోపల్లికి చెందిన శివయ్యతోనే వాస్తవం చెప్పించారు.
ఈ సందర్భంగా శివయ్య మాట్లాడుతూ, తనకు 5 నెలల క్రితం పక్షవాతం వచ్చిందని, ఆర్థిక సాయం అడిగేందుకు చంద్రబాబు వద్దకు వెళ్లగా.. టీడీపీ నేతలు తమకు కావాల్సినట్లు అన్వయించుకుని తనను బదనాం చేశారని కన్నీటి పర్యంతమయ్యాడు. అనంతరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 10 సంవత్సరాలు ప్రతిపక్షనేతగా ఉన్న వ్యక్తి ఇలా దిగజారుడు రాజకీయాలు చేయడం ఏమిటని నిలదీశారు. గుర్తింపు కోసం ఇలా అడ్డదారులు తొక్కడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. అదేవిధంగా బత్తలపల్లి మండలం పత్యాపురం గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు స్థలం కోసం గొడవపడితే.. దాన్ని కూడా చంద్రబాబు వైఎస్సార్‌సీపీపైకి నెట్టే యత్నం చేశాడన్నారు.
శాంతిభద్రతలు గాడి తప్పనివ్వం
చంద్రబాబు ఎదుటే మాజీ ఎంపీ దివాకర్‌రెడ్డి బూట్లు నాకే పోలీసులను తెచ్చుకుంటామని చెబుతుంటే ఆయన్ను వారించాల్సిన ప్రతిపక్ష నేత.. ఆనందంగా ఆస్వాదించారన్నారు. తమ ప్రభుత్వం శాంతిభద్రతలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఎక్కడా లా అండ్ ఆర్డర్ సమస్య రానివ్వబోమన్నారు. ప్ర¿ోదానంద ఆశ్రమం వ్యవహారంలో దివాకర్‌రెడ్డి కారణంగా ఒకరు చనిపోగా.. ఆగ్రహించిన ప్రజలు పోలీస్‌స్టేషన్‌కు తాళం వేసిన ఉదంతం జిల్లా వాసులందరికీ తెలుసన్నారు. పోలీసులను విమర్శించిన జేసీ దివాకర్‌రెడ్డి తిమ్మంపల్లికి వచ్చేందుకు 800 మంది పోలీసులను రక్షణగా తెచ్చుకున్నాడని గుర్తుచేశారు. చంద్రబాబు హయాంలో ఆర్వోసీ చేసిన హత్యలు లెక్కలేవని, వారు ఎంతమందిని పొట్టనపెట్టుకున్నారో జిల్లావాసులందరికీ తెలుసునన్నారు. చంద్రబాబు అధికారకాంక్షతో గ్రామాల్లో కక్షలు, కార్పణ్యాలకు కారణభూతుడవుతున్నాడని దుయ్యబట్టారు. అబద్ధాలతో వ్యవస్థను మ్యానేజ్ చేయడం చంద్రబాబుకు పరిపాటిగా మారిపోయిందన్నారు. ఇప్పటికైనా ఆయన స్వార్థ రాజకీయాలు మానుకుని ప్రజాసమస్యలపై దృష్టి సారించాలని హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment