సాక్షి, ధర్మవరం: ‘నువ్వు అవినీతి, అక్రమాల్లో పీకల్లోతు కూరుకుపోయావు. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ.. పూటకో మాట మాట్లాడతావు. ఏ ఆధారాలు లేకున్నా తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను మభ్య పెట్టాలని ప్రయత్నిస్తున్నావు. నువ్వో ఔట్ డేటెడ్ పొలిటీషియన్. వ్యక్తిత్వం లేని నీలాంటి వ్యక్తుల ప్రవర్తన జుగుప్స కల్గిస్తోంది. మరోసారి నాపై బురద జల్లాలని చూస్తే ఊరుకోను’ అని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ధర్మవరం బీజేపీ నేత వరదాపురం సూరిని హెచ్చరించారు. మంగళవారం ఎమ్మెల్యే తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి తనపై చేసిన ఆరోపణలన్నీ తప్పు అని ఆధారాలతో సహా వివరించారు.
మార్కెట్ రేటుకు కొన్నాను
2015లో సూరి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే ధర్మవరం మండలం గరుడంపల్లి వద్ద ఓ ప్రైవేట్ కంపెనీ సోలార్ ప్రాజెక్ట్ పెట్టాలని భూములను కొనుగోలు చేసిందన్నారు. అయితే సదరు కంపెనీ ప్రతినిధులను సూరి రూ.4 కోట్లు డిమాండ్ చేయడంతో అంత ఇవ్వలేని వారు కంపెనీ ఏర్పాటు చేయకుండానే వెళ్లిపోయారన్నారు. ఈ విషయంపై అప్పట్లో అన్ని పత్రికల్లోనూ కథనాలు వచ్చాయని, వాటిని మీడియాకు చూపించారు. ఆ తర్వాత ఇన్నేళ్లకు ఆ భూములను సదరు ప్రైవేట్ కంపెనీ వేరొక కంపెనీకి విక్రయిస్తే తాను ఆ కంపెనీ నుంచి మార్కెట్ ధరకు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశానని ఎమ్మెల్యే కేతిరెడ్డి వివరించారు. ఇదేమైనా తప్పా అని ప్రశ్నించారు.
తన తాత సమితి అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచే తాము భూస్వాములమని, సూరి లాగా పేదల రక్తాన్ని పీల్చి ఉన్నత స్థాయికి ఎదగలేదన్నారు. తమకు డీజీపీ బంధువని సూరి పిచ్చిగా మాట్లాడుతున్నాడని, తనకు డీజీపీ ఏ విధంగా బంధువో తెలియజేయాలన్నారు. తాను ఆయనలాగే అధికారాన్ని దుర్వినియోగం చేయనన్నారు. ఇదే సూరి టీడీపీ ప్రభుత్వ హయాంలో డీజీపీగా జేవీ రాముడు ఉన్నప్పుడు ఆయన తనకు మామ అవుతారని పోలీసులపై స్వైర విహారం చేసిన మాట వాస్తవం కాదా.. అని ప్రశ్నించారు.
పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చా
ధర్మవరం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన దాడి ఘటనలో నిందితులుగా ఉన్న తన అభిమానులపై కూడా చట్ట ప్రకారం కేసు కట్టించి రిమాండ్‌కు పంపామన్నారు. పోలీసులకు ఎంత స్వేచ్ఛ ఇచ్చామో ఈ ఒక్క ఉదాహరణ చాలన్నారు. తాను ధర్మవరం పట్టణంలో 20 వేల మందికిపైగా పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చానని, ఇందుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియలోనూ రైతులకు న్యాయం చేశానన్నారు. టీడీపీ హయాంలో రైతుల పొట్టగొట్టి ఎకరానికి రూ.5 లక్షలు ఇచ్చి భూసేకరణ చేసి వారికి అన్యాయం చేశారని, తాము రేగాటిపల్లి పొలాలను ఎకరాకు రూ.25 లక్షల పరిహారం అందించి భూసేకరణ జరిపి పేదలకు ఇళ్లపట్టాలు ఇచ్చామన్నారు. వరదాపురం సూరి చేసిన అవినీతి, అక్రమాలు, నిబంధనలకు పాతరేసి ఏ బ్యాంకులలో ఎన్ని రూ.కోట్ల రుణం తీసుకున్నారో త్వరలోనే బట్టబయలు చేస్తానని ఎమ్మెల్యే కేతిరెడ్డి స్పష్టం చేశారు.
అభివృద్ధిపై మాట్లాడేందుకు నైతికత ఉందా?
ధర్మవరం నియోజకవర్గంలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.3,387 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని సూరి అబద్ధాలు చెప్పారని, వాటి తాలూకు ఆధారాలు చూపితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. నియోజకవర్గంలో గుర్తుండిపోయే పని ఒక్కటైనా చేశారా.. అని ప్రశ్నించారు. సూరి లాంటి నాయకులకు అభివృద్ధి గురించి మాట్లాడే నైతికత ఉందా..? అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment