ధర్మవరం టౌన్ (సత్యసాయి జిల్లా): నియోజకవర్గంలో టీడీపీ ఇన్‌చార్జ్ పరిటాల శ్రీరామ్, బీజేపీ నాయకుడు వరదాపురం సూరి మధ్య కోల్డ్‌వార్ జరుగుతోంది. వారి అనుచరులు తీవ్రమైన విమర్శలు చేసుకుంటూ వారి హయాంలో చేసిన ‘ఘన కార్యాలను’ దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ధర్మవరంలో 300 మంది అమాయకులను అంతం చేసిన చరిత్ర పరిటాల కుటుంబానిదని సూరి వర్గం ఆరోపిస్తుండగా... ఎన్నికల్లో ఓడిపోయిన నెలరోజలకే పార్టీ మారి కార్యకర్తలను నట్టేట ముంచిన చరిత్ర వరదాపురం సూరిదని పరిటాల వర్గం విమర్శలు గుప్పిస్తోంది. తాజాగా ఈ ఇద్దరి నాయకులు తమ అనుచరులతో చేనేత వ్యాపారులు, సామాన్య ప్రజలను బెదిరింపులకు గురిచేయడం విమర్శలకు తావిస్తోంది.
ఓటమితో పార్టీ మారిన సూరి..
2019 ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించడంతో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన గోనుగుంట్ల సూర్యనారాయణ వెంటనే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి పరిస్థితుల్లో టీడీపీ అధిష్టానం ధర్మవరం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా పరిటాల శ్రీరామ్‌ను ప్రకటించింది. అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలు అతనే నడిస్తున్నాడు. దీంతో ధర్మవరం టీడీపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు.
నేసేపేట కేంద్రంగా బెదిరింపుల పర్వం..
ధర్మవరంలోని నేసేపేటలో తటస్తులైన వ్యాపారులు ఎందరో ఉన్నారు. వారిపై ఇటు సూరి వర్గం, అటు పరిటాల శ్రీరామ్ వర్గం బెదిరింపులకు దిగుతున్నాయి. తమ నాయకుడు త్వరలోనే టీడీపీలో చేరి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాడని, వచ్చి కలవాలని చేనేత వ్యాపారులను సూరివర్గం ఒత్తిడి తెస్తోంది. మరోవైపు పరిటాల శ్రీరామ్ అనుచరులు కూడా వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా శ్రీరామ్‌ను ప్రకటిస్తారని, తమ నాయకున్ని వచ్చి కలవాలని చెబుతున్నారు. దీంతో ఏ పార్టీకి సంబంధం లేని వ్యాపారులు ఎవరిదగ్గరకు వెళితే ఏం అడుగుతారో..ఏం జరుగుతుందోనని భయబ్రాంతులకు గురవుతున్నారు.
టీడీపీ హయాంలో భారీ దందా..
టీడీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే పరిటాల రవీంద్ర అనుచరులు పరిటాల పేరు చెప్పి నేసేపేటలో ఎందరో వ్యాపారులను బెదిరించి డబ్బు వసూలు చేసిన సందర్భాలున్నాయి. ఇటు వరదాపురం సూరి ఎమ్మెల్యేగా పని చేసిన సమయంలోనూ చేనేత వ్యాపారులను బెదిరించి సెటిల్‌మెంట్లు చేసి భూములు లాక్కున్నారన్న ఆరోపణలున్నాయి. తాజాగా ఇద్దరు నేతలూ తమను కలవాలని అనుచరులతో ఒత్తిడి చేయిస్తుండటంతో నేసేపేటలోని వ్యాపారులు, సామాన్యులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
పరిటాల కుటుంబంపై తీవ్రమైన ఆరోపణలు..
ధర్మవరంలో టీడీపీ నేతలను తమ వైపు తిప్పుకునేందుకు వరదాపురం సూరి అనుచరులు పరిటాల కుటుంబం చేసిన ఆగడాలను ఒక్కొక్కటిగా వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సూరి అనుచరుడు పెద్దిరెడ్డి అరవిందరెడ్డి పరిటాల కుటుంబంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పరిటాల రవీంద్ర హయాంలో ధర్మవరంలో నరమేధం సృష్టించారని, దాదాపు 300 మందిని హత్య చేశారని ఆరోపించారు. ఇప్పటికీ ఆ 300 మంది ఆచూకీ తెలియదన్నారు. కుటుంబ పాలనతో రాప్తాడులో టీడీపీని భూస్థాపితం చేసి ధర్మవరం వచ్చారని, అటువంటి వారికి టీడీపీ టిక్కెట్ కచ్చితంగా రాదన్నారు.
సూరిపై ఎదురు దాడి..
పరిటాల అనుచరులు ఇటీవల మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎదురుదాడి చేశారు. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత కార్యకర్తలను గాలికి వదిలేసి స్వార్ధం కోసం బీజేపీలోకి చేరిన వరదాపురం సూరికి విలువల్లేవని ఆరోపించారు. రోజూ టీడీపీలోకి వస్తామని చెబుతూ టీడీపీ కార్యకర్తలను, పట్టణ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. టీడీపీలోకి రావాలంటే పరిటాల శ్రీరామ్ కండువా కప్పాలన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. నీచ రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్న సూరి మాటలు నమ్మవద్దన్నారు.
ఆ చీకటి రోజులు రావొద్దని కోరుకుంటున్న జనం..
టీడీపీ ప్రభుత్వ పాలనను తలచుకుని జనం భయాందోళనలు చెందుతున్నారు. పట్టణానికి చెందిన నిమ్మల కుంట వెంకటేశ్ అనే వ్యక్తికి సంబంధించిన భూములను లాక్కునేందుకు పరిటాల అనుచరులు ఏకంగా అతన్ని కిడ్నాప్ చేయడం అప్పట్లో పెను సంచలనంగా మారింది. విద్యుత్ కేబుల్ పనుల విషయంలో గుడ్‌విల్ ఇవ్వలేదన్న కారణంతో గుట్టకిందపల్లి వద్ద జరుగుతున్న పనులను అప్పటి ఎమ్మెల్యే వరదాపురం సూరి నిలిపి వేయడయంతో పరిటాల శ్రీరామ్ అనుచరులు, సూరి అనుచరులు రాళ్ల దాడిచేసుకున్న విషయాన్ని గుర్తుచేసుకుంటున్నారు.
ఇక తన మాట వినడం లేదన్న కారణంతో వరదాపురం సూరి అనుచరుడు ఏకంగా పోలీస్‌స్టేషన్ ఆవరణలోనే కానిస్టేబుల్‌ను చెంపదెబ్బకొట్టడాన్ని తలచుకుని ఆ చీకటి రోజులు మళ్లీ రాకూడదని కోరుకుంటున్నారు. ఏది ఏమైనా∙వీరిద్దరి మాటల యుద్ధం, బెదిరింపుల పర్వం కారణంగా ప్రశాంతంగా ఉండే ధర్మవరంలో అశాంతి రాజుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment