సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్య తేలింది. అన్ని ప్రక్రియల అనంతరం అనేక మార్పులు, చేర్పులు తర్వాత జిల్లా ఓటర్ల తుది జాబితా శుక్రవారం తయారయింది. ఈ తుది జాబితా ప్రకారం జిల్లాలో మొత్తం 19,71,797 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 9,75,432 మంది కాగా, స్త్రీలు 9,96,254 మంది. అంటే జిల్లాలో పురుషుల కన్నా మహిళా ఓటర్లే 20,822 మంది ఎక్కువ ఉన్నారు. ఇచ్చిన గడువు శుక్రవారం నాటితో ముగియడంతో ఓటర్ల లెక్కను ఖరారు చేసిన కలెక్టర్ తుది జాబితాను ఎన్నికల సంఘానికి పంపినట్లు తెలిసింది. ఈ జాబితాపై ఎన్నికల సంఘం ఆమోదముద్ర పడడమే తరువాయి.
అన్నింటా పెరిగారు...
ఎస్సీ, ఎస్టీలకు ఎక్కువ స్థానాలు రిజర్వ్ కాబడిన జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోనూ ఓటర్లు పెరిగారు. ఓటర్ల సంఖ్య ప్రకారం ఖమ్మం నియోజకవర్గం మొదటి స్థానంలో ఉంది. ఈ నియోజకవర్గంలో మొత్తం 2,54,667 మంది ఓటర్లు నమోదయ్యారు. కాగా, జిల్లాలో అతి తక్కువ ఓటర్లు నమోదయింది అశ్వారావుపేట నియోజకవర్గంలో. ఈ నియోజకవర్గంలో 1,64,419 మంది ఓటర్లున్నారని తేలింది.
ఖమ్మం పార్లమెంటు స్థానంలో మొత్తం ఓటర్లు 14,07,974 మంది నమోదు కాగా, మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో పరిధిలోకి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో (పినపాక, భద్రాచలం, ఇల్లెందు) కలిపి 5,63,823 మంది ఓటర్లు తేలారు. విశేషమేమిటంటే..... ఒక్క పినపాక నియోజకవర్గం మినహా అన్ని చోట్లా మహిళల ఓట్లే ఎక్కువగా ఉన్నాయి. అంటే ఈసారి సార్వత్రిక ఎన్నికలలో మహిళా శక్తి అభ్యర్థుల జాతకాలను నిర్ణయించనున్నదన్నమాట.
ఖమ్మం ఫస్ట్... అశ్వారావుపేట లాస్ట్
Published Sat, Feb 1 2014 7:07 AM | Last Updated on Sat, Sep 2 2017 3:15 AM
Advertisement